ప్రజాశక్తి - గుత్తి (అనంతపురం) : సత్యసాయి వాటర్ సప్లై కార్మికుల కోసం కనీస వేతన సలహా బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు రాష్ట్ర నాయకులు జి.ఓబులు డిమాండ్ చేశారు. స్థానిక పట్టణ శివారులో ఉన్న శ్రీ సత్యసాయి మంచినీటి పథకం సంపు వద్ద మంగళవారం సత్యసాయి వాటర్ సప్లై కార్మికులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 ఏళ్లుగా శ్రీ సత్యసాయి తాగునీటి ప్రాజెక్టులో కార్మికులు పనిచేస్తున్నా వారి సమస్యలు ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని చెప్పారు. 13 ఏళ్లుగా కార్మికుల కొరకు కనీస వేతన సలహా బోర్డును ఏర్పాటు చేయాలని విన్నవించుకుంటున్న ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు. కరోనా సమయంలో కూడా కార్మికులు వారి ప్రాణాలు పణంగా పెట్టి సైనికుల్లా పనిచేసి 900 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేశారన్నారు. 2021 జూన్ లో కార్మికులకు గ్రాడ్యుటి ఇవ్వకుండా కాంట్రాక్ట్ నుంచి తప్పుకుందన్నారు. పలు మార్లు జిల్లా కలెక్టర్, ఆర్డబ్ల్యుఎస్ ఎస్‌ఇలకు గ్రాడ్యుటి సమస్యను విన్నవించుకున్న పట్టించుకోలేదన్నారు. నిత్యవసర వస్తువుల ధరలు రెండింతలు అయ్యాయని ఆయన అన్నారు. కార్మికుల వేతనం పెంచడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. ఈఎస్‌ఐ సౌకర్యం లేక కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గుత్తి ప్రాంతంలోని సూర్యనారాయణ అనే కార్మికుడు విధులు సమయంలో ప్రమాదానికి గురై అప్పులు చేసి చికిత్స చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎస్‌ఐ సౌకర్యం లేకపోవడంతో కార్మికుడి కుటుంబం రోడ్డున పడిందన్నారు. ఖాళీగా ఉన్న కార్మికుల పోస్టులను భర్తీ చేయాలని ఆయన కోరారు. కార్మికులకు పనిభారం తగ్గించి, వారిపై రాజకీయ ఒత్తిడిలను అరికట్టాలన్నారు. వచ్చే నెలలో కార్మికుల సమస్యలపై జీపు జాత చేపట్టినట్లు ఆయన చెప్పారు. సెప్టెంబర్ నెలలో సత్యసాయి వాటర్ సప్లై కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎం.మల్లేష్, వి.నిర్మల, కెపిఎస్ మండల కార్యదర్శి యు. మల్లికార్జున, ఐద్వా మండల కార్యదర్శి ఎన్.కవిత, సత్యసాయి వాటర్ సప్లై వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు తిప్పేస్వామి, ఉపాధ్యక్షుడు బాలకృష్ణ, నాయకులు చిన్న బాబయ్య, తిప్పేస్వామి, ఆంథోని రెడ్డి, శ్రీనివాసులు, ప్రసాద్, నాగరాజు, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.










