Sep 11,2020 08:52

నిర్మలా సీతారామన్‌

కరోనా ను అదుపు చేయడం, ప్రజలను కాపాడడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మొదటి ప్రాధాన్యతగా లేదని వలస కూలీల వెతలను మోడీ ప్రభుత్వం పట్టించుకోకుండా అత్యంత అమానవీయంగా వ్యవహరించినప్పుడే స్పష్టమైపోయింది. ఆ తర్వాత ఆత్మ నిర్భర భారత్‌ అని మోడీ, రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీతో నిర్మలా సీతారామన్‌ ముందుకొచ్చారు. వాటి వలన ప్రజలకు ఒరిగిందేమీ లేదు. పి.ఎం కేర్స్‌ కు ప్రజల నుండి విరాళంగా వచ్చినది ఎక్కువ, ఆ నిధి నుండి ప్రజలను ఆదుకోవడానికి చేసిన ఖర్చు తక్కువ. కాదంటే మోడీ గారు ఆ నిధి లెక్కలను బైట పెట్టాలి. వామపక్షాలు, అనేక ప్రజా సంఘాలు లేవనెత్తిన డిమాండ్లలో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా అదుపులో విఫలమైంది. ప్రపంచంలో అతి ఎక్కువ కరోనా కేసులున్న దేశాలలో రెండవ స్థానంలో ఉన్నాం. ఇటు దేశంలో అతి ఎక్కువ కేసులున్న రాష్ట్రాలలో రెండవ రాష్ట్రంగా ఉన్నాం. ఒక రోజులో నమోదయ్యే కేసుల లెక్క తీసుకుంటే ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నాం.
ప్రభుత్వాలకు ప్రజలను కాపాడడం అనేది మొదటి ప్రాధాన్యత కాకపోతే మరి ఏది మొదటి ప్రాధాన్యత? నిస్సందేహంగా కార్పొరేట్లను, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిని, అమెరికాను సంతృప్తిపరచడమే మొదటి ప్రాధాన్యత. అందుకే ప్రజల కొనుగోలు శక్తిని పెంచే ఏ ఒక్క చర్యనూ మోడీ ప్రభుత్వం చేపట్టలేదు. రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీలో సింహభాగం కార్పొరేట్లకే ఉపయోగపడింది. ఆ తర్వాత వరసగా చేపట్టిన చర్యలన్నీ మరింత తీవ్రంగా నయా ఉదారవాద విధానాలను అమలు చేయడమే. ప్రైవేటీకరణను వేగవంతం చేయడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆంక్షలు ఏమీ లేకుండా ఎత్తివేయడం, పర్యావరణ నిబంధనల సడలింపు, నూతన విద్యా విధానం పేరుతో విద్య కార్పొరేటీకరణ, కార్మిక చట్టాలను ఆ కార్మికులకే వ్యతిరేకంగా ఉండేలా సవరించడం, రాష్ట్రాలకు ఆర్థిక సహాయ నిరాకరణ, వ్యవసాయ ఆర్డినెన్సులు, తాజాగా విద్యుత్‌ సంస్కరణలు చేపట్టారు. ఇంత తక్కువ కాలంలో ఇన్ని ఎక్కువ చర్యలతో కార్పొరేట్లకు దేశ సంపదను ధారపోయడంలో మోడీ ప్రభుత్వం సరికొత్త రికార్డు స్థాపించిందనే చెప్పాలి. ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ బాటలోనే నడక ప్రారంభించింది.
ప్రజలను వదిలిపెట్టి కార్పొరేట్లను కాపాడడాన్ని పాలకులు సమర్ధించుకుంటున్న తీరు ఇలా ఉంది...''కరోనా కేసులు ఎక్కువేగాని, కోలుకుంటున్నవారూ ఎక్కువే. మన దేశంలో మరణాల రేటు కూడా తక్కువ. త్వరలో సామూహిక రోగ నిరోధక శక్తి అందరికీ వచ్చేస్తుంది. కరోనా నుండి ప్రజలు తమను తాము ఎలాగూ కాపాడుకుంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం కీలకం. ముఖ్యంగా మన జిడిపి పడిపోకుండా చూడాలి. విదేశీ పెట్టుబడులు రావాలి. కరోనా తగ్గిపోగానే మళ్ళీ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది.ఆ సమయానికి మనం తగిన మోతాదులో ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తే తక్కిన దేశాల కంటే మనం ముందుకు దూసుకుపోతాం''.
ఇదే తరహా వాదనలు అమెరికాలో ట్రంప్‌ ముందుకు తెచ్చాడు. బ్రిటన్‌ లో బోరిస్‌ జాన్సన్‌దీ ఇదే వాదన. ఆర్థిక వ్యవస్థ గురించి ఇంతగా బాధ పడిపోయిన ఈ దేశాల ప్రస్తుత పరిస్థితి ఏమిటి? అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసాంతానికి 9.5 శాతం పడిపోయింది. జపాన్‌ లో 7.6 శాతం పడిపోయింది. వీరందరినీ తలదన్నేలా మన దేశం ఏకంగా 24 శాతం పడిపోయింది. ఇంత పెద్ద పతనం ఏ ఇతర పెద్ద ఆర్థిక వ్యవస్థ లోనూ లేదు. అంటే అటు ప్రజలను ఆదుకోగలిగినదీ లేదు, ఇటు ఆర్థిక వ్యవస్థను పడిపోకుండా నిలబెట్టినదీ లేదు. పాలకులది రెంటికీ చెడిన సిద్ధాంతం అయింది. తమను గెలిపించిన ప్రజలను గాలికి వదిలేసి, ఈ కార్పొరేట్లను ప్రభుత్వాలు ఎంత కాపాడినా వారు ఈ దేశాన్ని గాని, ఆర్థిక వ్యవస్థను గాని కాపాడలేదు అన్నది ప్రపంచ వ్యాప్తంగా రుజువైంది.
స్కాండినేవియన్‌ దేశాల అనుభవాలు మనకు ఇంకా స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. డెన్మార్క్‌, నార్వే దేశాలు లాక్‌ డౌన్‌ ప్రకటించి కరోనా అదుపుకు చర్యలు కూడా తీసుకుంటే, స్వీడెన్‌ మాత్రం సామూహిక రోగ నిరోధకశక్తి సూత్రాన్ని నమ్మింది. దానినే ఆచరించింది. ఈ మూడు దేశాలలోనూ జిడిపి పతనం రేటు దాదాపు ఒకే తీరుగా ఉంది. అంటే కరోనా మీద పోరాడకుండా వదిలి పెడితే జిడిపి రేటును నిలబెట్టుకోవచ్చునన్న సూత్రం తప్పు అని తేలిపోయింది. ఇక కరోనా సంగతి చూస్తే, స్వీడెన్‌ లో ప్రతీ లక్ష జనాభాలో 870 మందికి కరోనా సోకితే, నార్వేలో 178 మందికి, డెన్మార్క్‌లో 256 మందికి సోకింది. ప్రతీ లక్షమందిలో చనిపోయినవారు స్వీడెన్‌ లో 57 మంది ఉంటే, నార్వేలో అయిదుగురు, డెన్మార్క్‌లో 11 మంది మాత్రమే ఉన్నారు. పోనీ సామూహిక రోగనిరోధక శక్తి స్వీడెన్‌లో ఏమైనా ఎక్కువగా పెరిగిందా అంటే అదీ లేదు. సీరో టెస్టులు చూస్తే స్వీడెన్‌ లో 15-20 శాతం ప్రజలకు మాత్రమే యాంటీబాడీస్‌ వృద్ధి చెందాయి. దాదాపు అన్ని దేశాలలోనూ అదే మోతాదులో ఉన్నాయి.
ఈ దేశాల అనుభవాలకు పూర్తి భిన్నంగా చైనా, క్యూబా, వియత్నాం తదితర సోషలిస్టు దేశాల అనుభవాలు ఉన్నాయి. అందరికన్నా ముందు కరోనా దెబ్బ తగిలిన దేశం చైనా. మొదటి మూడు నెలల కాలంలో- అంటే జనవరి నుండి మార్చి నెలల్లో చైనాలో 82,000 కేసులు వచ్చాయి. ఆ తర్వాత ఇప్పటిదాకా కేవలం మరో 3000 కేసులు మాత్రమే వచ్చాయి. అంతా కలిపినా మన దేశంలో ఇప్పుడు ఒక్క రోజులో వస్తున్నన్ని కేసులు కూడా లేవు. లాక్‌డౌన్‌ ను సమర్ధవంతంగా చైనా అమలు జరిసింది. అందుకనే కరోనా ప్రధానంగా ఒక్క హువెయి రాష్ట్రానికే పరిమితం అయింది. కరోనా ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అయిపోయింది. తక్కిన రాష్ట్రాలకు పాకలేదు. అదీ లాక్‌డౌన్‌ అంటే. మరి మన దగ్గరో? మూడు దశల లాక్‌డౌన్లు, నాలుగు దశల అన్‌లాక్‌లు తర్వాత దేశంలో మూల మూలలకూ అంతకంతకూ వేగంగా విస్తరిస్తోంది. కరోనాను కట్టడి చేయడమే గాక, దాని ఫలితంగా ఈ ఏడాది రెండో త్రైమాసాంతానికి చైనా 3.2 శాతం వృద్ధి రేటు సాధించింది. అంటే కరోనాను కట్టడి చేస్తే ఆర్థిక వృద్ధి సాధ్యపడుతుంది తప్ప ప్రజలను గాలికి వదిలేస్తే ఆర్థిక పరిస్థితి మన మాదిరిగా అథోగతే అవుతుంది. క్యూబా, వియత్నాం వంటి సోషలిస్టు దేశాలతోబాటు న్యూజిలాండ్‌ కూడా కరోనా ను కట్టడి చేస్తేనే ఆర్థిక వృద్ధి అని గుర్తించి ఆ దిశగా నడుస్తోంది. ఈ విషయాన్ని పై అనుభవాల తర్వాత కూడా గుర్తించడానికి నిరాకరిస్తున్నాడు ట్రంప్‌. ఆ రూటు లోనే అనుసరిస్తున్నాడు మోడీ.
ఈ కరోనా చూస్తే మొదటి దశలో అదుపు లోకి వచ్చిందనుకున్న ఇటలీ, ఫ్రాన్స్‌ వంటి దేశాలలో మళ్ళీ రెండో దశ వ్యాప్తి మొదలైంది. దానిని అదుపు చేయకుండా వదిలేస్తే మళ్ళీ వస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు చేసే ఖర్చు రాను రాను తగ్గిపోతుంది. దాంతో సరుకుల డిమాండ్‌ తగ్గిపోతుంది. ఫలితంగా వృద్ధిరేటు ఇంకా తగ్గిపోతుంది. ఈ పశ్చిమ దేశాల ప్రతికూల అనుభవాలను చూసినా, అటు సోషలిస్టు దేశాలు కరోనాను కట్టడి చేసి సాధించిన సానుకూల అనుభవాలను చూసినా సారాంశం ఒకటే. కరోనాను కట్టడి చేసి ప్రజలను కాపాడితేనే ఆర్థిక వ్యవస్థ మళ్ళీ పుంజుకుంటుంది తప్ప కార్పొరేట్లను కాపాడడం వలన దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోలేము. ఈ విషయాన్ని పై అనుభవాల తర్వాత కూడా గుర్తించడానికి నిరాకరిస్తున్నాడు ట్రంప్‌. ఆ రూటు లోనే అనుసరిస్తున్నాడు మోడీ. మరి వీళ్ళనేం చేయాలో ఇక ప్రజలే నిర్ణయించాలి.

- ఎంవీఎస్