తీవ్ర ఆర్థిక మాంద్యం నుండి కొంతైనా కోలుకోవాలంటే శ్రామిక ప్రజలకు, రైతులకు, సామాన్యులకు నేరుగా నగదు అందించే చర్యలు చాలా అవసరం. అప్పుడే ప్రజల కొనుగోలుశక్తి పెరుగుతుంది. వేతన జీవులకు పన్ను రాయితీలు కల్పించడం కూడా అందుకు తోడ్పడుతుంది. కానీ, దీనికి పూర్తి వ్యతిరేక దిశలో కార్పొరేట్లకు మరిన్ని రాయితీలు కల్పించి ప్రజలపై యథావిధిగా భారాలు మోపింది తాజా బడ్జెట్. 'ఈ శతాబ్దపు బడ్జెట్', 'ఇదివరకెన్నడూ చూడని బడ్జెట్' అంటూ ముందుగానే ఊదరగొట్టిన మోడీ ప్రభుత్వ విధాన సమర్ధకులు సైతం నోరు మెదపలేని స్థితిలో పడ్డారంటేనే ఇది ఎంతటి ప్రజావ్యతిరేక బడ్జెటో అర్థమవుతుంది.
కోవిడ్ చేసిన గాయాల నుంచి ప్రజలకు ఊరట కలిగించే చర్యలు చేపట్టడానికి కానీ, కరోనా నుంచి పాఠాలు తీసుకోవడానికి కానీ ప్రభుత్వం ఇప్పటికీ సుముఖంగా లేదు. కరోనా మూలంగా ఉపాధి కోల్పోయిన కోట్లాది మంది వలసకార్మికులు స్వస్థలాలకు తిరిగి రావడంతో గ్రామీణ నిరుద్యోగం మరింత తీవ్ర రూపందాల్చింది. దీన్ని ఎదుర్కొనేందుకు జాతీయ ఉపాధి హామీ చట్టానికి ఇతోధికంగా నిధులు కేటాయించాల్సి ఉండగా, మోడీ ప్రభుత్వం గత ఏడాది ఖర్చు చేసినదానికన్నా తగ్గించింది. ఉపాధి హామీ పనులను వందరోజుల నుండి నూట యాభై రోజులకు పెంచాలన్న డిమాండ్‌ను పెడచెవినపెట్టింది. రికార్డు స్థాయిలో పెరిగిన నిరుద్యోగాన్ని పరిష్కరించే ప్రస్తావన ఏదీ లేదు. కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమానికి రూ.35వేల కోట్లు మాత్రమే కేటాయించడంతో ఉచిత టీకాలు మొదటి విడతలో 3 కోట్ల మందికి మాత్రమే అందజేసే అవకాశముంది. మిగతా వారు వ్యాక్సిన్‌ను కొనుక్కోవాల్సిందేనని ప్రభుత్వం చెప్పకనే చెబుతోంది. ప్రజారోగ్యానికి బడ్జెట్‌లో కనీసం 3 శాతం కేటాయించాల్సి ఉండగా, ఇప్పుడు కేటాయించింది అందులో సగం కూడా లేదు.
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు పెద్దయెత్తున ఆందోళన సాగిస్తున్నారు. అయినా, మోడీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాల రద్దుకు మొండిగా నిరాకరిస్తున్నది. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర గ్యారంటీ చేయడం లేదు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును ఎత్తివేసే విద్యుత్ చట్ట సవరణబిల్లును పార్లమెంటులో తీసుకురావడానికి తహతహలాడుతున్నది. వ్యవసాయ సెస్‌ను పెట్రోల్, డీజిల్‌తో బాటు రైతులు ఉపయోగించే ఎరువులు, రసాయనిక క్రిమి సంహారక ముందులపై సైతం విధించింది. సామాన్యులను బెంబేలెత్తిస్తున్న ధరల పెరుగుదలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాల్సింది పోయి, వాటికి మరింత ఆజ్యంపోసేలా పెట్రోల్‌పై రూ.2,50, డీజిల్‌పై రూ.4 చొప్పున వ్యవసాయ సెస్ విధించింది. పెట్రోల్ ధరల పెరుగుదల వల్ల రవాణా వ్యయం పెరిగి, అంతిమంగా నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలకు దారి తీస్తుంది.
కార్పొరేట్లకు ఈ బడ్జెట్‌లో పెద్దయెత్తున పన్ను రాయితీలు కల్పించడంతోబాటు, రైల్వేలు, ఓడరేవులు, ఐఒసి, బీమా, బ్యాంకింగ్ వంటి ప్రతిష్టాకరమైన ప్రభుత్వ రంగ సంస్ధలను ప్రైవేటు పరంగావించేందుకు ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించింది. ఏమాత్రం దాపరికం లేకుండా నయా ఉదారవాద విధానాలను ఇంత పచ్చిగా ముందుకు తేవడం ద్వారా మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు తాను నమ్మిన బంటునన్న సత్యాన్ని చాటుకుంది. ఆ రీత్యా చూస్తే ఇదివరకటి బడ్జెట్ల కన్నా ఇది భిన్నమైనదే. బీమా రంగంలో (ఎల్‌ఐసి, జిఐసి మొదలైన) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచింది. ఒక బీమా కంపెనీని, రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించింది. రైల్వేలను, ఓడరేవులను, విమానాశ్రయాలను ప్రైవేటీకరించడం వల్ల ప్రభుత్వ రంగమే అదృశ్యమయ్యే ప్రమాదముంది. బీమా రంగంలోకి విదేశీ కంపెనీలను అనుమతించడంతోబాటు ఎల్‌ఐసి వాటాలను తెగనమ్మడానికి సిద్ధమైంది.బడా కంపెనీల స్టాక్స్‌తో వ్యాపారం చేసే స్టాక్ ఎక్స్‌ఛేంజి సూచిక బడ్జెట్‌కి ముందు రోజు దాకా శరవేగంగా పడిపోతూ వచ్చింది. బడ్జెట్‌తో ఆ సూచిక ఒక్కసారిగా పుంజుకుని రికార్డు వేగంతో పెరుగుతోంది. ఈ బడ్జెట్ వలన బడా కంపెనీల లాభాలు పెరుగుతాయనడానికి ఇదొక్క సంకేతం చాలు.
మన రాష్ట్రానికి మరోసారి కేంద్ర బడ్జెట్ మొండిచెయ్యి చూపించింది. గతంలో హామీ ఇచ్చిన దుగరాజపట్నం మేజర్ పోర్టు గాని, కడప ఉక్కు గాని ప్రస్తావనకు నోచుకోలేదు. ఇక ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీల ఊసే మరిచారు. అందుకే ఈ ప్రజావ్యతిరేక బడ్జెట్‌ను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి.










