ప్రస్తుతం దేశం ముందున్న రెండు ప్రధాన సవాళ్లు కోవిడ్-19, రోజురోజుకీ ముదురుతున్న ఆర్థిక సంక్షోభం. మన పార్లమెంటు ఈ రెండు సవాళ్లనూ చర్చించి బయటపడే మార్గాన్ని నిర్ణయించడంలో ఘోరంగా విఫలమైంది. ఇందుకు మోడీ ప్రభుత్వానిదే ప్రధాన బాధ్యత. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వం, ఆ మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితిని మాత్రం ఉపయోగించుకుని తన నిరంకుశ పోకడలను మరింత తీవ్రతరం చేసింది. వివాదాస్పదమైన రెండు వ్యవసాయ బిల్లులు రాజ్యసభ ముందుకు పరిశీలనకు వచ్చినప్పుడు సభలో జరిగిన పరిణామాలు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి. బిల్లులపై సరిగా చర్చ జరగకుండానే డిప్యూటీ చైర్మన్ పార్లమెంటరీ నియమ నిబంధనలన్నిటినీ తుంగలో తొక్కి అడ్డగోలుగా వ్యవహరించారు. బిల్లును ఓటింగ్‌కు పెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే దానిని పట్టించుకోలేదు. పోనీ ఆ బిల్లులను లోతుగా పరిశీలించేందుకు సెలెక్టు కమిటీకి పంపాలని తీర్మానాలు పెడితే వాటికి అనుమతి నిరాకరించారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన పలు సవరణలను ఓటింగ్‌కు పెట్టాలని కోరితే దానిని కూడా తిరస్కరించి, గందరగోళం మధ్య మూజువాణి ఓటుతో ఆమోదించుకున్నారు. రాజ్యసభలో ప్రభుత్వం అనుసరించిన నిరంకుశ పోకడలు పార్లమెంటు సభ్యుల ప్రాథమిక హక్కులనే కాలరాసేలా ఉన్నాయి. దీంతో ప్రతిపక్షాల నుంచి సహజంగానే నిరసనాగ్రహాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ప్రభుత్వం స్పందించిన తీరు మరీ దారుణం. కె.కె.రాగేష్, ఎలమల కరీం (సిపిఐ(ఎం)తో సహా 8 మంది ప్రతిపక్ష ఎంపీలను రాజ్యసభ వర్షాకాల సమావేశాలు ముగిసేంతవరకు సస్పెండ్ చేసింది. బలవంతంగా తమ గొంతు నులిమేసిన నిరంకుశ చర్యను నిరసిస్తూ ఆ రోజు (సెప్టెంబరు 21)న రాత్రంతా పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద సస్పెండయిన ఎంపీలు ధర్నా చేశారు. ప్రతిపక్షాలు పార్లమెంటు ఉభయ సభలను వర్షాకాల సమావేశాలు ముగిసేంతవరకు బహిష్కరించాయి. ప్రజాస్వామ్యం పట్ల, పార్లమెంటు సభ్యుల హక్కుల పట్ల బిజెపి ప్రభుత్వ ఖాతరులేని తనానికి ప్రశ్నోత్తరాల రద్దు మరో నిదర్శనం. కరోనా మహమ్మారికి, ప్రశ్నోత్తరాల రద్దుకు సంబంధమేమిటో కనీసం వివరణ కూడా ఇవ్వలేదు. ప్రభుత్వాన్ని ప్రజలకు జవాబుదారీ చేసేందుకు పార్లమెంటు సభ్యులకు ఉన్న ఈ ప్రాథమిక హక్కును ఇది నిరాకరించడమే.
పార్లమెంటరీ స్థాయీ సంఘాలనూ బిజెపి ప్రభుత్వం పక్కనబెట్టింది. కీలకమైన బిల్లులను మరింత లోతుగా విశ్లేషించేందుకు, పరిశీలించేందుకు వీటిని పార్లమెంటరీ స్థాయీ సంఘాలకు లేదా సెలెక్టు కమిటీకి నివేదించడం ఒక ఆనవాయితీ. దీనిని కూడా బిజెపి కాలరాచింది. గత ఆరు మాసాల్లో జారీ చేసిన 11 ఆర్డినెన్సులకు చట్టరూపం ఇచ్చేందుకు బిల్లులను పెట్టి ఆమోదింపజేసుకుంది. ఈ ఆర్డినెన్సుల్లో ఒక్కటి తప్ప మిగతావేవీ కూడా అంత అత్యవసరమైనవి కాదు. అయినా ఈ ప్రభుత్వం పార్లమెంటును పక్కన పెట్టేందుకు ఈ ఆర్డినెన్సు రూటును ఎంచుకుంది. మరో వైపు పౌరుల హక్కులపైనా బిజెపి ప్రభుత్వం ఎలా నిర్లజ్జగా దాడులకు తెగబడుతున్నదీ చూస్తున్నాం. అసమ్మతిని అణచివేసేందుకు యుఎపిఏ, ఎన్‌ఎస్‌ఎ వంటి క్రూరమైన చట్టాలను ప్రయోగిస్తున్నది. మైనార్టీలను, మేధావులను, సామాజిక కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని వారిపై దేశ ద్రోహం క్లాజు కింద కేసులు బనాయిస్తున్నది. మీడియాను బెదిరిస్తున్నది. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తున్నది. ప్రాథమికమైన ఉద్యోగ భద్రత హక్కును లాగివేసుకోవడమే గాక, సమ్మె చేసే హక్కుపై ఆంక్షలు విధిస్తున్నది. దేశంలో ప్రజాతంత్ర వాతావరణాన్ని మొత్తంగా దెబ్బ తీసి, ప్రజాస్వామ్యం ఉసురు తీయాలని చూస్తున్నది. ప్రజాస్వామ్యం పీక నులిమేసి కార్మికవర్గం తమ హక్కుల కోసం సంఘటితంగా పోరాడే స్థితిని లేకుండా చేయొచ్చని అది భావిస్తున్నది. అయితే. వివాదాస్పద వ్యవసాయ బిల్లులపై పార్లమెంటు లోపల, వెలుపల జరుగుతున్న పోరాటాలు నిరంకుశ మోడీ ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరికను చేస్తున్నాయి. ముఖ్యంగా పంజాబ్, హర్యానాల్లో రైతుల పోరాటం బిజెపి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కార్మికుల హక్కులను హరించే లేబర్ కోడ్ బిల్లులను ప్రతిపక్షాలు లేని సమయంలో పార్లమెంటులో పెట్టి మూజువాణి ఓటుతో ఆమోదింపజేసుకున్న ప్రభుత్వ చర్యకు గట్టి ప్రతిఘటన ఎదురవుతున్నది. కార్పొరేట్లు, బడా వ్యాపారుల ప్రయోజనాల కోసం రైతులపైన, కార్మికులపైన ప్రభుత్వం ఎలా నగంగా దాడి చేసినదీ ఈ పార్లమెంటు సమావేశాల్లో స్పష్టంగా బయటపడింది. దుర్మార్గమైన ఈ చర్యలకు వ్యతిరేకంగా ప్రజానీకం ఉద్యమాల్లోకి రావడం మొదలైంది. మున్ముందు ఇది మరింత ఉధృతం కానుంది.










