పాఠశాలల ఏర్పాటు, నిర్వహణ అనేది ప్రైవేటు, ధార్మిక, దాతృత్వ, మత సంస్థల బాధ్యత అని...ప్రభుత్వానిది కాదని చెబుతున్న జాతీయ విద్యా విధానాన్ని (ఎన్‌ఇపి) నిజానికి తిరస్కరించాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదంటే తన దిశను మార్చుకున్నట్టేనని అర్ధమౌతుంది. 'అమ్మ ఒడి' ప్రవేటు పాఠశాలలకు వర్తింపు, బోధనా మాధ్యమంగా మాతృ భాష రద్దు, పూర్వ శిశు విద్యపై అత్యుత్సాహం వంటి చర్యల అమలు యెక్క పర్యవసానాలు చివరికి ప్రవేటు విద్యా మార్కెట్‌కు దోహద పడతాయని అభిప్రాయం బలపడుతున్నది.
ఈ ప్రమాదం ఒకవైపు ఉండగా...రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 53 జీఓ ద్వారా హేతుబద్ధీకరణ పక్రియను చేపట్టింది. దీనివల్ల ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలకు దీర్ఘకాలంలో నష్టం జరిగినా...ప్రాథమిక పాఠశాలలు తక్షణం మరణశయ్య పైకి చేరడం ఖాయంగా కనిపిస్తున్నది. గతంలో 20 లోపు పిల్లలకు ఒకరు, 21-60 వరకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేవారు. ప్రస్తుతం కూడా 60 లోపు ఎంతమంది పిల్లలున్నా ఇద్దరు టీచర్లే ఉంటారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండకపోవడం ఆహ్వానించ దగ్గదే అయినా...1-60 వరకు పిల్లలకు ఇద్దరు టీచర్లే ఉండడం హేతుబద్ధంగా లేదు. 60 లోపు ఎంతమంది పిల్లలున్నా ఇద్దరు టీచర్లు ఉండాలన్న నిబంధన కారణంగా... ఆచరణలో 40 నుండి 60 మంది పిల్లలున్న బడులలో పని చేస్తున్న ఉపాధ్యాయులు...30 లోపు పిల్లలున్న పాఠశాలకు వెళ్లడానికి ఇష్టపడతారు. 5 తరగతులు 19 సబ్జెక్టులను అదీ ఆంగ్ల మాధ్యమంలో తక్కువ పిల్లలున్న బడులలో అయితే న్యాయం చేయగలమన్నది కారణంగా వుంది. 20 మంది పిల్లలున్న బడులలో ఇద్దరు టీచర్లకుగాను ఉపాధ్యాయ పోస్టుల కొరత ఉంటుంది. కాబట్టి 40 నుండి 60 మధ్య పిల్లలున్న పాఠశాలలు కొన్ని ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారతాయి. 20 నుండి 60 మధ్య పిల్లలున్న పాఠశాలల సంఖ్య అధికం. అందువలన 41 మంది పిల్లలు వున్న దగ్గర 3వ పోస్టు, 61 మంది పిల్లలు వున్న దగ్గర 4వ పోస్టు ఇవ్వడం హేతుబద్ధమైనది. పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించకపోవడం, సరిపడా టీచర్లను ఇవ్వకపోవడం సరైనది కాదు.
విద్యా ప్రమాణాల మెరుగుదల, వనరుల సక్రమ వినియోగం పేరుతో చేస్తున్న రేషనలైజేషన్‌ను పాలకులు చాలా సంకుచిత దృష్టిలో అమలు చేస్తున్నారు. ఉన్న పోస్టులను సర్దుబాటు చేయడం తప్ప కొత్తవి ఇవ్వకుండా...కేవలం ఉపాధ్యాయులు, విద్యార్ధుల నిష్పత్తికే పరిమితం అవుతున్నారు. పాఠ్య ప్రణాళికలు, బోధన పరిస్ధితులు, పాఠశాలల మౌలిక వసతులు, ప్రాంతాల మధ్య వ్యత్యాసం, విద్యార్ధుల సామాజిక స్థాయి వంటి అంశాలు హేతుబద్ధీకరణకు ప్రమాణాలుగా తీసుకోవడం లేదు. ఒక సమగ్రమైన అధ్యయన ప్రక్రియగా కాక కేవలం యాంత్రికంగా విద్యార్ధులు, ఉపాధ్యాయుల నిష్పత్తికే పరిమితం అవుతున్నారు. దీనిని ప్రభావితం చేసే అంశాలను పరిగణ లోకి తీసుకోకుంటే అది సహేతుకమైనది ఎలా అవుతుంది? మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలలో జరిగే ఈ ప్రక్రియ ప్రవేటు పాఠశాలలకు వర్తించకపోవడం ఒకటైతే దీనికి నిబంధనలు రూపొందించేటప్పుడు ప్రైవేట్ పాఠశాలల నుండి ఉండే పోటీని పరిగణలోకి తీసుకోకపోవడం పెద్ద లోపంగా వుంది.
''పిల్లలు పెరిగితే టీచర్లు పెరుగుతారు. పిల్లలు తగ్గితే టీచర్లు తగ్గుతారు'' అన్నది రేషనలైజేషన్ ప్రాథమిక సూత్రం. పైకి చూడడానికి ఈ వాదన న్యాయంగా కనిపిస్తుంది. కానీ సారంలో పిల్లలు తగ్గారని టీచర్లను తగ్గిస్తే పిల్లలు పెరుగుతారా? ఇంకా తగ్గుతారు. తగ్గారని మరలా టీచర్ల సంఖ్య తగ్గుతుంది. మరలా పిల్లల సంఖ్య తగ్గుతుందే కానీ పెరగదు. ఫలితంగా రెండు లేదా మూడు రేషనలైజేషన్లకు ఆ పాఠశాలలు మూతబడతాయి. ఊబిలో ఉన్నవాడు పైకి రావాలని ప్రయత్నించేకొద్దీ మరింతగా ఊబి లోకి దిగబడిన చందంగా హేతుబద్ధీకరణ ప్రక్రియ ఉంది. 60 మంది పిల్లలు దాటిన బడిలో ముగ్గురు ఉపాధ్యాయులు ఉంటారు. ఏ కారణంగానైనా ఇద్దరు పిల్లలు తగ్గి 59 మంది అయితే ఇద్దరు టీచర్లవుతారు. ఇద్దరు టీచర్లుంటే విద్యార్థులు 59 మందికన్నా తగ్గుతారే తప్ప పెరగరు. ఈ పద్ధతిలో 60 లోపు పిల్లలున్న బడులు కాస్తా 20 మంది 30 మంది పిల్లలున్న బడులవుతాయి. రెండు మూడు వరస రేషనలైజేషన్లతో అవి పూర్తిగా కనుమరుగైపోతాయి. తదుపరి దీని ప్రభావం ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలపై పడుతుంది. వాస్తవంగా పిల్లల సంఖ్య తగ్గుతుందంటే అక్కడ అదనపు సహాయం చేయడం అవసరమని అర్ధం. ప్రైవేట్ బడుల నుండి పోటీ వల్ల లేదా చదువుతున్న బడిలో లోపాల వల్ల పిల్లలు తగ్గుతారు. అటువంటి చోట నిర్దిష్టమైన అధ్యయనం చేపట్టి సహాయం చేయడం హేతుబద్ధమైన చర్య అవుతుంది. ఇటువంటి ప్రయత్నంలో భాగంగా ఉపాధ్యాయ ఉద్యమం ఒత్తిడి ఫలితంగా 2017 రేషనలైజేషన్‌లో 80 మంది పిల్లలున్న బడులను మోడల్ పాఠశాలలుగా గుర్తించి ఐదుగురు ఉపాధ్యాయులను ఇచ్చారు. అయితే ఉపాధ్యాయులను ఇచ్చారే తప్ప ఇతర సౌకర్యాలను కల్పించకపోవడం ద్వారా పాలకులు దీనిని కూడా విఫల ప్రయోగంగా మార్చారు.
హేతుబద్ధీకరణ ప్రక్రియ పాఠశాలల మూత, టీచరు పోస్టుల రద్దు లక్ష్యంగా సాగుతున్నది. ప్రస్తుతం అమలవుతున్న హేతుబద్ధీకరణ ప్రక్రియలో ఉన్న మరో ప్రమాదం ఏమిటంటే బడిలో పిల్లల సంఖ్య పెరగడం లేదా తగ్గడం అనేది కేవలం ఉపాధ్యాయుని విశ్వసనీయతకు సంబంధించిన విషయంగా చూస్తుంది. వాస్తవానికి అది ప్రభుత్వం, విద్యా శాఖల విశ్వసనీయతకు సంబంధించినది. ప్రభుత్వ ప్రోత్సాహంతో విద్యా వ్యాపారం వెర్రితలలు వేస్తున్న రాష్ట్రం మనది. ప్రభుత్వ పాఠశాలలు సంక్షోభంలో ఉన్నాయంటారు. దీనిని అధిగమించాలనీ అంటారు. కానీ అవి సంక్షోభంలో ఎందుకు ఉన్నాయో మాట్లాడరు. అలా మాట్లాడితే కారణం విద్యా మార్కెట్ వైపు చూపవలసి ఉంటుంది. ఉమ్మడి బడి (కామన్ స్కూల్) పెట్టవలసి ఉంటుంది.
విద్యా హక్కు చట్టం చెప్పిన 1:30 ప్రకారమే రేషనలైజేషన్ చేస్తున్నామని ప్రభుత్వం వాదిస్తున్నది. అయితే 1:30 అనేది ఒక ఆచరణాత్మక పరిమితి మాత్రమే. అదే ఆదర్శం కాదు. దానిని అధిగమించరాదనీ కాదు. పైగా కేవలం ప్రభుత్వ బడులు మాత్రమే ఉండి, ప్రైవేట్ బడుల నుండి పోటీ లేనప్పుడు అది సమ్మతమే. ఒక వైపు ప్రైవేట్ పాఠశాలల్లో తరగతికి ఒక టీచరు చొప్పున ఉంటారు. వాటి నుండి పోటీని తట్టుకోవాలంటే ఇక్కడ కూడా తరగతికి ఒక టీచరు ఉండడం హేతుబద్ధమౌతుంది. ఆంగ్ల మాధ్యమంలో బోధన పెట్టడం వల్ల 1:20 గా మార్చడం సరైనది.
బోధనా మాధ్యమం అనుభవం చెబుతున్నది ఏమంటే ప్రభుత్వ పాఠశాలలో మాతృభాష, ప్రైవేట్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అనేవి ఎల్లకాలం స్ధిరంగా ఉండవు. మాతృభాషలో బోధన కోరుకునే శక్తులు ప్రైవేట్ బడుల్లో కూడా అమలు చేయించలేక పోవడం వలన ప్రభుత్వం ప్రభుత్వ బడులలో కూడా ఆంగ్ల మాధ్యమం పెట్టింది. అలాగే రేషనలైజేషన్ ప్రభుత్వ బడులకు మాత్రమే ఉండి ప్రైవేట్ బడులకు లేకపోవడం, ప్రభుత్వ బడులలో టీచరు పోస్టులు రద్దు అవుతుండడం, ఎటువంటి నియంత్రణ లేకుండా ప్రైవేట్ బడులను వదిలేయడం వలన ఈ రెండు రకాల బడులు ఎల్లకాలం ఉండవు. ప్రభుత్వ బడులను కాపాడుకోవాలనే శక్తులు ఒక వైపు ప్రభుత్వ బడులలో సౌకర్యాలతో పాటు టీచర్ పోస్టులను కాపాడుకోవడానికి...మరోవైపు ప్రైవేట్ బడులపై నియంత్రణ లక్ష్యంగా ఉద్యమించకపోతే ప్రభుత్వం ఒక బడిని మాత్రమే ఉంచుతుంది. అదీ ప్రైవేటు బడి. రేషనలైజేషన్ అంతిమ లక్ష్యం కూడా అదే. అందుకే రేషనలైజేషన్ రద్దు లక్ష్యంగా ఉద్యమించాలి.
(వ్యాసకర్త యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి)
కె. శేషగిరి










