న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) సంస్థ ఒక సర్వే చేపట్టింది. ఈ సంస్థ విడుదల చేసిన నివేదిక విస్తుపోయే వాస్తవాలను వెల్లడించింది. కొన్ని రాష్ట్రాల్లో మూడింట ఒక వంతు సుమారు సగం మంది చిన్నారులకు సరైన పోషకాహారం అందడం లేదని తెలిపింది. దీంతో (ఐదేళ్ల వయసు వరకు) తక్కువ బరువు, ఎత్తు, సరైన పెరుగుదల లేకపోడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. నాలుగింట మూడొంతుల్లో సగం మంది చిన్నారులు, మహిళల్లో మూడింట ఒకవంతు నుండి మూడొంతుల వరకు (15-49 ఏళ్ల వయసు మధ్య) రక్తహీనత, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపింది.
2019-20ల మధ్య అన్ని రాష్ట్రాల్లో సుమారు ఏడులక్షల నివాసాలను సర్వేచేసింది. ఈ డేటా 17 రాష్ట్రాలు, ఐదు కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే దేశ జనాభాలో సగం మందిపై సర్వే చేపట్టింది. కరోనా మహమ్మారి కారణంగా మిగిలిన రాష్ట్రాల్లో సర్వే చేపట్టలేకపోయినట్లు సంస్థ తెలిపింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. 2015-16 ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ ఇదే విధమైన సర్వే చేపట్టింది. గడిచిన ఐదేళ్ల కాలంలో కొన్ని రాష్ట్రాలు మినహా ఈ సంఖ్యలో ఎటువంటి మార్పూ లేదని పేర్కొంది. దేశంలోని పేద, ధనిక రాష్ట్రాల్లోని చిన్నారులు, మహిళల పోషకాహార లోపం, ఇతర రాష్ట్రాల్లోని చిన్నారుల, మహిళల నిష్పత్తి మధ్య భారీ తేడా కనిపిస్తోంది. అలాగే ధనిక రాష్ట్రాల్లోనూ మెరుగైన విధంగా లేదని సర్వే స్పష్టం చేసింది.
చిన్నారుల్లో పోషకాహార లోపం :
వయసుకు తగిన బరువు లేని చిన్నారులు బీహార్‌లో 41 శాతం ఉండగా, మహారాష్ట్రలో 36 శాతం, కర్ణాటకలో 33 శాతం ఉన్నాయి. అయితే అవి కూడ అంత ఆమోద యోగ్యంకాదని సంస్థ తెలిపింది. ఇక్కడ బీహార్ అత్యంత పేద రాష్ట్రాల్లో ఒకటి, గుజరాత్ ధనిక రాష్ట్రాల్లో ఒకటి. అయితే ఈ రెండు రాష్ట్రాల్లోనూ వాస్తవంగా చిన్నారుల వాటా ఒకేవిధంగా ఉంది.
బీహార్‌లో 2015-16 అనంతరం పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది. తక్కువ బరువు కలిగిన చిన్నారుల వాటా గతంలో 44 శాతం ఉండగా, ప్రస్తుతం 41 శాతం ఉంది. గుజరాత్, మహారాష్ట్రలు రెండూ ఒకే స్థాయిలో ఉన్నాయి. అస్సాం, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కేరళల్లో తక్కువ బరువు కలిగిన చిన్నారుల శాతంలో క్షీణత కనిపిస్తోంది. అంటే ఆ రాష్ట్రాల్లో పోషకాహారలోపాన్ని కొంతమేర అధిగమించినట్లు తెలుస్తోంది. నాగాలాండ్‌లో గతంతో పోలిస్తే.. 10 శాతం పెరుగుదల కనిపించింది.
రక్తహీనత :
కొందరిలో రక్త హీనత దీర్ఘకాలికంగా ఉంటే.. మరికొందరిలో అప్పుడప్పుడు ఎదురవుతోంది. రక్తంలో ఐరన్ లోపించడంతో.. శారీరక, మానసిక ఎదుగుదలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. రక్తహీనత ఉన్న చిన్నారుల వాటా తొమ్మిదిరాష్ట్రాల్లో 60 శాతం ఉండగా, 17 రాష్ట్రాలకుగాను... 16 రాష్ట్రాల్లో 40 శాతానికి పైగా ఉంది. కేరళ మాత్రమే స్వల్పంగా 39 శాతం నమోదైంది. మేఘాలయ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో రక్తహీనత స్థాయిలు పెరిగాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలు చిన్నారులకు అందడంలేదని స్పష్టమౌతోంది. దేశంలో పోషకాహార లోపం మరింత పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థ, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ప్రభుత్వం ప్రకటిస్తోంది. వాస్తవానికి దేశం ఆకలితో, బలహీనంగా ఉన్న జనాభాతో నిండిపోతుంది. నేటి చిన్నారులే రేపటి భావి భారత పౌరులన్న వాస్తవాన్ని పాలకులు మర్చిపోతున్నారు. పాలక వర్గాలు భవిష్యత్ తరాలను శారీరక, మానసిక లోపాలతో నిండిపోయేలా చేస్తున్నారు.










