Jul 17,2023 21:37
  • ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించిన ఐద్వా
  • తక్షణమే డేటాను చేపట్టాలని డిమాండ్‌

న్యూఢిల్లీ : భారతదేశంలో మహిళల్లో, చిన్నారుల్లో రక్తహీనత సమస్య ఎక్కువగానే వుంటుంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌)-5 సర్వే ప్రకారం 57శాతం మంది మహిళలు, 67శాతం పిల్లలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఇంత స్థాయిలో ఈ సమస్య నెలకొని వునుందున ఇదేదో చాలా చిన్న సమస్య అని కొట్టివేయడానికి వీల్లేదు. ఈ స్థాయి రక్తహీనత ప్రసూతి మరణాలకు, పిల్లల మరణాలకు దోహదపడుతుందని వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. పిల్లల్లో ఎదుగుదల, అభివృద్ధిని దెబ్బతీసేందుకు కూడా దారి తీస్తుందంటున్నారు. ఇక బాలికలు, మహిళలకు రక్తహీనత వల్ల కలిగే ప్రభావం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా చేపట్టే ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌-6 సర్వేలో అనీమియా (రక్తహీనత)కు సంబంధించిన డేటాను సర్వే నుండి ఎత్తివేయాలనే నిర్ణయాన్ని బిజెపి ప్రభుత్వం తీసుకుంది. అంచనా విశ్వసనీయతకు సంబంధించిన సాంకేతిక కారణాలను ఇందుకు సాకుగా చూపుతోంది. సర్వే నివేదికలు చెల్లుబాటవుతాయని ప్రజారోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇదే ప్రాతిపదికన గతంలో సేకరించిన డేటాతో తాజా నివేదికను సరిపోల్చి చూడవచ్చని అంటున్నారు. ప్రాంతాల వారీగా ఇంత వైవిధ్యత వున్న దేశంలో అనీమియా స్థాయిలు కూడా రాష్ట్రాలు, జిల్లాలవారీగా తేడాలుంటాయి. జిల్లాస్థాయిలో విలువైన సమాచారాన్ని ఇవ్వగలిగేది ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ మాత్రమే. అటువంటి కీలకమైన అంశానిు సర్వే పరిధి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

  • ఐద్వా ఖండన

సర్వే సూచీల నుండి అనీమియాను తొలగించాలను నిర్ణయాన్ని ఐద్వా ఖండించింది. దీనివల్ల తీవ్ర పర్యవసానాలు నెలకొంటాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సర్వేలో ఈ అంశానేు పరిగణనలోకి తీసుకోకపోతే ఎక్కడ జోక్యం చేసుకోవాలో శాస్త్రీయంగా అంచనా వేసేందుకు కూడా మార్గం వుండదని పేర్కొంది. గతంలో ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమై, భవిష్యత్తులో సమస్యను పరిష్కరించడానికి అవసరమైన చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం విముఖంగా వుందని విమర్శించింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, సర్వేలో అనీమియా డేటాను చేపట్టడాన్ని పునరుద్ధరించాలని ఐద్వా డిమాండ్‌ చేసింది. అదే సమయంలో ప్రభుత్వ ఆహార భద్రతా వ్యూహాల్లో భాగంగా రక్తపుష్టినికలిగించే బియ్యానిు జాతీయ స్థాయిలో ప్రవేశపెట్టడం అనాలోచిత తొందరపాటు చర్య అవుతుందని హెచ్చరించింది. దీనికన్నా ప్రజల్లో గల రక్తహీనత, పోషకాహారం లోపం సమస్యలను పరిష్కరించేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలని కోరింది. దీనికి తోడు నిత్యావసరాల ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని ఐద్వా కోరింది.