రోడ్డు కాలువల నిండుగా వలస నెత్తురు పారితే కారనీగాక. భూములు పడావుబడి చెమట చేతుల చెలకల్లో కరువు మొలిస్తే మొలవనీగాక. చిన్న, మధ్య తరహా రైతులు హక్కుల కోసం పోరాడుతూ.. చస్తే చావనీగాక. పేదవాడి ఆకలి కడుపు మీద చావు డప్పు మోగనీగాక. కరోనా మహమ్మారి కంటే హానికరమైన చట్టాల కింద నలిగితే నలగనీగాక. మొత్తంగా... దేశం దేహం ఆకలితో నోరెళ్ళబెట్టి అరిస్తే అరవనీగాక. ఆత్మనిర్భర్ చందమామని మన అరచేతి అద్దంలో అందంగా అచ్చుగుద్దుతాడు అతడు. నీరో చక్రవర్తిలా ఫిడేల్ వాయించుకుంటూ పరవశించే కార్పొరేట్ల సేవకుడతడు. 'నేనిప్పుడు/ ఖండాంతర లావాదేవీల్లో/ జాతి వెన్నెముకని తాకట్టు పెట్టిన వాళ్ళనే ప్రశ్నిస్తాను/ శవాల ఉసురు పోసుకునే చీకటి డబ్బునీ/ దాని కాపలా కుక్కల్నీ ప్రశ్నిస్తాను/ మట్టిని నమ్ముకున్న బతుకు మట్టిలోనే పొలి అయినప్పుడు/ అది ఖచ్చితంగా హత్యే/ చేసిందెవరనే నేను ప్రశ్నిస్తాను' అంటాడో కవి. అందుకే సరికొత్త పంథాలో పోరాటం నడుపుతున్నారు రైతులు. నీరో చక్రవర్తి గుక్కతిప్పుకోడానికి వీల్లేకుండా ప్రశ్నలను సంధిస్తున్నారు వారు. ఇది రైతుకు జరుగుతున్న అన్యాయంపై, రైతుల కళ్లుగప్పి తేవాలనుకున్న నల్ల చట్టాలపై ఎక్కుపెట్టిన పోరాటం. ఈ పోరాటం వినూత్నం. నేలతల్లి బిడ్డల ఈ పోరాటం జరుగుతున్న తీరు ఉత్తేజభరితం. దేశం నలుమూలల నుండి దేశ రాజధానికి తరలివచ్చిన రైతులు కుటుంబ సమేతంగా జరుపుకునే జాతరలా, ఓ తిరునాళ్లలా సాగుతోందీ ఉద్యమం.
దేశం శక్తిని ప్రదర్శించే రిపబ్లిక్ దినోత్సవానికి దీటుగా రైతు శక్తిని ప్రదర్శించే ఉద్యమ రూపం...రిపబ్లిక్‌డే నాడు రైతులు నిర్వహించే కిసాన్ పెరేడ్. ప్రభుత్వ శకటాలకు పోటీగా రైతుల శకటాలు (ట్రాక్టర్లు) సిద్ధమౌతున్నాయి. ఈ రిపబ్లిక్ మాది... ఈ పెరేడ్ కూడా మాదే అంటూ... ముస్తాబైన ట్రాక్టర్లతో కదం తొక్కుతున్నారు రైతులు. ఇది కాషాయవాదుల దేశభక్తి కాదు... మట్టిని నమ్ముకున్న నేలతల్లి ముద్దుబిడ్డల అసలుసిసలు దేశభక్తి. ఇది పోరు శక్తి. ఈ పోరాటం పండుగలా... పండుగ రోజునా పోరాడుతూ.. అక్కడే ఉత్సవాలు, అక్కడే కవితాగోష్టులు, అక్కడే చిన్నచిన్న మీటింగ్‌లు, మధ్యమధ్యలో వినోద కార్యక్రమాలు, కుస్తీ పోటీలు, వైద్య శిబిరాలు అన్నీ అక్కడే. అంతేకాదు... తిరునాళ్లను తలపించేలా చిన్నచిన్న దుకాణాలు. వాన, బురద, చలీ, మంచు అన్నింటినీ పోరాటంలో భాగం చేసుకుంటూ.. అలసటను పారద్రోలుతూ సాగుతూ... కొత్తపుంతలు తొక్కుతోన్న రైతు పోరాటం ఇది.
దేశమంతా రైతులు పోరాటంలో వుంటే, మన రాష్ట్రంలో మాత్రం ఈమారు సంక్రాంతి జూదరుల పండుగలా మారిపోయింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో జూదరుల పండుగ విచ్చలవిడిగా సాగుతోంది. రైతుల కష్టం మీద బతికే బాపతంతా సంక్రాంతిని జూదంలా మార్చేశారు. ఈ పండుగ మూడునాలుగు రోజుల్లో పొలాలు అమ్ముకునేవారు, ఆస్తులు తాకట్టు పెట్టుకునేవారు, చివరకు భార్య పుస్తెలను కూడా తాకట్టు పెట్టి జూదం ఆడే ఘనాపాటీలు ఇక్కడ కనబడుతారు. ఈ జూదరుల పోరాటంలో ఓడినవాడికెలాను ఏడుపు తప్పదు. గెలిచినవాడు కూడా గర్వంగా చెప్పుకోలేని పోరాటం ఇది. ఒకరి కష్టార్జితాన్ని కాజేసే జూదరుల పోరాటం ఇది. ఈ పోరాటం సమాజంలో గౌరవాన్ని తెచ్చేది కాదు. పందెం కాసే ప్రతివాడు బలిపశువే.
వ్యవసాయాన్ని పండుగ చేసుకోవాలనుకునే ప్రతి రైతు చూపు ఇప్పుడు దేశ రాజధాని వైపే. నిజమైన రైతులందరూ రైతు పోరాటాలను పండుగలా జరుపుకుంటున్నారు. గెలిచినా ఓడినా ఒక చిరస్మరణీయ పోరాటంలో భాగస్వాములు వారు. ఈ దేశం కోసం, భవిష్యత్తరాల కోసం గర్వంగా చెప్పుకోగలుగుతారు. రైతు పోరాటం తన కోసమే కాదు... తన దేశం కోసం కూడా. 'పొలాల నన్నీ / హలాల దున్నీ/ ఇలాతలంలో హేమం పిండగ/ జగానికంతా సౌఖ్యం నిండగ/ విరామ మెరుగక పరిశ్రమించే/ బలం ధరిత్రికి బలి కావించే' రైతన్నల పోరాటంలో పాల్గొనే ప్రతివాడు... ఒక పోరాట యోధుడే. జూదరుల పోరాటంలో పాల్గొనేవారు దీప కాంతికి రెక్కలు మాడి, నేలరాలిన పురుగుల్లా బలవుతారు. ఉత్తర దిక్కున ఉదయించిన రైతు పోరాటం పండుగలా వెలుగొందుతోందిప్పుడు. ఈ పోరాటంలో స్వచ్ఛందంగా పాల్గొనేవారు పోరాట యోధుల్లా, ధ్రువతారల్లా నిలిచిపోతారు చరిత్రలో...!










