Oct 04,2020 19:14
పల్లె జ్వలితనేత్రమవ్వాలి- కవిత

పల్లెలు వణుకుతున్నాయి
జ్వరమొచ్చినట్టు
చేతులు కాళ్ళ నులిపెట్టినట్టు
గుండెలు భీతిల్లినట్టు
నరాలు లాగేసి పిండేసినట్టు
పల్లెలు వణుకుతున్నాయి

ఎగరపోతల చేటల్లోంచి
పొల్లులా ఎగిరిపోతున్న కష్టం చూసి
క్రిందపడ్డ గింజలకోసం
కాచుకున్న అప్పుల చిట్టా చూసి
చేతుల్లోని ఖాళీ చేటలు చూసి
పల్లెలు వణుకుతున్నాయి
పంట చేతికి రాక
వ్యవసాయం గిట్టుబాటు కాక
గింజలు నోటికి అందక
ఖాళీ కల్లాలు చూసి
మెతుకుల్లేని పళ్ళేలు చూసి
పల్లెలు వణుకుతున్నాయి

రోగాలతో చిక్కి శల్యమై
ఆశల ఆకులురాలిన బతుకుచెట్టులా
తలొరెమ్మా తురుముకు పోయిన
కరివేపాకు మొక్కలా
ఎండుటాకుల మర్రిలా
ఒంటరై పల్లెలు వణుకుతున్నాయి

దిక్కుతోచని ధీనురాలై
ఎగసిపడిన ద్ణుఖపు అలై
రాకపోకల్లేని కంకర బాటై
బాధల తుఫాన్ల తాకిడికి
బంధాలతీగలు తెగిపడి
వాలిన ఒంటరి స్తంభమై
నిరాధారమై పల్లె వణుకుతోంది

పిడుగొచ్చి పైనపడ్డట్టు
పులొచ్చి పంజా విసిరినట్టు
ఒకటిపోతే మరొకటి
చెట్టుకూలేందుకు గొడ్డలి వేట్లులా
పల్లెల స్థిరత్వాన్ని
కూకటివేళ్లతో కూల్చబడుతున్నాయి
పల్లెలు తల్లడిల్లుతున్నాయి

పల్లెలశ్వాస కోశాల్లో
రైతు చట్టాల పుళ్లు
పల్లెల ప్రేగుల్లో
వ్యవసాయ బిల్లుల ముళ్ళు
కష్టాలకావిడి భుజానికెత్తుకొని
గిట్టుబాటు వెదికేందుకు వెతుకులాట
నక్కలు తిరగని కల్లాలకై వెతుకులాట
రాబందులు ఎగురలేని చోటుకోసం
వెతుకులాట
పాపం పల్లెకు తెలీదు
సంక్షేమం ముసుగేసుకొని
రాబందులు చట్టబద్ధంగా
పల్లెలపై వాలుతాయని
కొండచిలువలు నాగేటి చాళ్ళలోనే
కదులుతాయని
పల్లెకుపట్టిన జెలగలు
హక్కుగా మరింత రక్తం
పీల్చుకు తాగుతాయనిు

పల్లెలు అప్రమత్తమవ్వాలిక
పల్లెల్లో చైతన్య విత్తులు చల్లాలిక
పల్లెల్లో నినాదాల నాట్లు వెయ్యలిక

వణుకుతున్నపల్లెలు మేల్కొనాలి
పిడికిలి బిగిస్తూ కెరటంలా లేవాలి
క్రోధంతో వణకాలి
పాలకుల్ని వణికించాలి


-బొడ్డ కూర్మారావు
9959500360