Apr 29,2023 16:56
  • క్రీడలు  నిర్వహణ, సినీ తారల  సందడి.

ప్రజాశక్తి - తాళ్లరేవు(కాకినాడ) : పైడా విద్యాసంస్థల ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించిన పైడావింగ్స్ టూ కే  23 ఫెస్ట్ విద్యార్థుల కోలాహలం, సినీ తారల సందడితో ముగిసింది. ఈ సందర్భంగా విద్యార్థులకు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, త్రో బాల్ వంటి పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాల నుంచి విద్యార్థులు హాజరై పలు రకాల ప్రాజెక్టులు ప్రదర్శించారు. విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పైడా అగ్రికల్చర్ విద్యార్థులు చేసిన రైతే రాజు అనే స్కిట్ అందరిని ఆకట్టుకుంది. ఇతర కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులు తీసిన డాక్యుమెంటరీలు పలువురిని ఆలోచింపజేశాయి. జెఎన్టియుకె డైరెక్టర్ కే.వెంకటరెడ్డి విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇచ్చారు. అనంతరం వెంకటరెడ్డి పైడా విద్యాసంస్థల చైర్మన్  పైడా సత్యప్రసాద్,  సెక్రటరీ శ్రీరామ్, జాయింట్ సెక్రెటరీ నిత్య శ్రీరామ్, డీన్ వీరభద్రరావు డి.డి.రవీందర్ రెడ్డి, ప్రిన్సిపల్ సూర్యప్రకాశరావులతో కలసి పలు అంశాల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. సినీ తారల సందడి: అల్లరి సినిమాతో హీరోగా అలరించి ఆ సినిమా పేరు ఇంటి పేరుగా మార్చుకుని నవ్వులతో అందరిని అలరించిన అల్లరి నరేష్ సీమటపాకాయ్ గా పేలి, కితకితలు, సుడిగాడు, బ్లేడ్ బాబ్జి సినిమాలతో ఎన్నో నవ్వులు పండించిన అల్లరి నరేష్ తన 60వ సినిమా ఉగ్రం ప్రమోషన్ లో భాగంగా పైడా లో జరుగుతున్న పైడావింగ్స్ కు విచ్చేసి  విద్యార్థులతో సెల్ఫీలు దిగారు. అల్లరి నరేష్ రాకతో పైడా కళాశాల ప్రాంగణం హోరెత్తింది. అల్లరి నరేష్ వెంట ఉగ్రం సినిమా హీరోయిన్ మిర్నామీనన్ సహనటుడు సాయి శ్రీనివాస్ కళాశాలలో హల్ చల్ చేశారు. ప్రేమ కథ చిత్రం, కల్కి వంటి చిత్రాల్లో నటించిన హీరోయిన్ నందిత శ్వేత కళాశాలలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో సందడి చేశారు. విద్యార్థులతో కలిసి స్టెప్పులు వేశారు.