నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ దేశంలో 5 కోట్ల మంది విద్యా వంతులైన నిరుద్యోగులు వున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. కరోనాతో ఈ సంఖ్య 15 కోట్లకు పెరిగినట్లు సర్వే రిపోర్టులు చెపుతున్నాయి. పర్మినెంటు ఉద్యోగాలను తగ్గించి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల వైపు తోసివేయడానికి భారీ, కీలక పరిశ్రమలను ప్రైవేటీ కరించడానికి పూనుకున్నారు. ఈ సంవత్సరం రూ. 1.75 లక్షల కోట్ల ప్రభుత్వ వాటాలను ఉపసంహరిస్తామని చెపుతూనే చిన్నతరహా పరిశ్రమలకు రూ. 15,700 కోట్లు కేటాయింపు చూపారు. రూ. 3 వేల కోట్లతో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నిధులు ఒక రాష్ట్రానికి కూడా సరిపోవు.
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూ.34,83,236 కోట్లతో ప్రవేశపెట్టిన 2021-22 కేంద్ర బడ్జెట్‌లో, 2021 రివైజ్డ్ బడ్జెట్‌పై రూ.32,931 కోట్లు మాత్రమే అదనంగా కేటాయింపులు చూపించారు. ద్రవ్యలోటు రూ.15.07 లక్షల కోట్లుగా ఉంది. వడ్డీ చెల్లింపులు రూ.8,09,701 కోట్లుగా ఉంది. బడ్జెట్‌లో 23.234 శాతం వడ్డీ చెల్లింపులకే సరిపోయింది. ఆదాయాన్ని పెంచకుండానే బడ్జెట్‌లో కేటాయింపులు చూపించారు.
ఆర్థికమంత్రి 2020 మే 14న రూ.21 లక్షల కోట్లతో ప్యాకేజి ప్రకటిస్తూ అన్ని రంగాలకు కేటాయింపులు చూపారు. కానీ ఈరోజుకి అందులో 3.2 శాతం మాత్రమే వ్యయం జరిగింది. 8 శాతం అభివృద్ధి ఆశించగా 2.7 శాతం మాత్రమే అభివృద్ధిని రికార్డు చేశారు. 3 కోట్ల మంది రైతులకు 4.22 లక్షల కోట్ల రుణాలు మారటోరియం ప్రకటించారు. 3 నెలల మారటోరియం (వాయిదా) వలన లాభమేంటి? 25 లక్షల క్రెడిట్ కార్డులు ఇస్తామన్నారు. వలస కార్మికులకు 1100 కోట్లు మరియు రూ. 46,600 కోట్లు రుణాలు ఇస్తున్నామని ప్రకటించారు. ఈ పథకం అమలు ఎక్కడా కనపడదు. అంతేకాక 74,300 కోట్ల ధాన్యం మార్కెట్ల ద్వారా సేకరిస్తామని కూడా ప్రకటించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అన్నిటికీ రూ.10 వేల వరకు రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. అవే ప్రకటనలు మళ్ళీ చేశారు. ఆత్మనిర్భర్ పేరుతో భారత ప్యాకేజికి 25.1 లక్షల కోట్లు కేటాయించబోతున్నట్లు దీనిని మినీ బడ్జెట్‌గా చెప్పారు. ఈ పథకానికి తోడు రూ. 2.75 లక్షల కోట్లతో ప్రధాని గరీబ్ కళ్యాణ్ యోజన కింద కేటాయిస్తున్నట్లు పార్లమెంటులో చెప్పారు. రానున్న కాలంలో 5 ట్రిలియన్ డాలర్లకు ఉత్పత్తి రంగాన్ని పెంచబోతున్నట్లు పునరుద్ఘాటించారు. ప్రస్తుత భారత స్థూల ఉత్పత్తి 2 ట్రిలియన్ డాలర్లు మాత్రమే వుంది. రానున్న 3 సంవత్సరాలలో 3 ట్రిలియన్ డాలర్లు పెంచుతామన్న ప్రకటనలు అమలు జరిగేనా? ఆరోగ్యం, ఆత్మనిర్భర భారత్ రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు బడ్జెట్‌లో చూపారు. కానీ పేదల ఆదాయం పెంచడానికి ఈ బడ్జెట్‌లో ఎక్కడా అవకాశం చూపించలేదు. సీనియర్ సిటిజన్లకు పన్ను రాయితీ ఇస్తామని చెప్పడం వల్ల ఒరిగేదేమిటి? గత సెప్టెంబర్‌లో కార్పొరేట్ సంస్థలకు 10 శాతం పన్ను రాయితీ ఇవ్వడంతో వారు ఆ నిధులను మార్కెట్‌కు తరలించకుండా తమ లాభాల ఖాతాల్లో వేసుకున్నారు. ప్రజల ఆదాయం పెరిగితే మార్కెట్లలో టర్నోవర్ పెరుగుతుంది. ఈ బడ్జెట్‌లో కూడా మార్కెట్ లోకి నిధులు విడుదలయ్యే పథకాలేవీ లేవు. చివరికి దేశానికి గుండెకాయ లాగా ఉండి భారత ప్రభుత్వానికి అనేక విధాల రుణాలందించిన బీమా సంస్థపై అజమాయిషీని విదేశీ సంస్థలకు అప్పగించడానికి మోడీ ప్రభుత్వం సిద్ధపడింది. 5 వేల కోట్లతో ప్రారంభించిన ఈ సంస్థ నేడు 32 లక్షల కోట్ల ఆస్తులును పోగుచేసింది. లక్షల మందికి రుణాలు ఇచ్చి ఉపాధిని కల్పిస్తున్నది. ఈ సంస్థకు పోటీగా అనేక బీమా సంస్థలకు గతంలో అనుమతించినప్పటికీ భారత బీమా సంస్థ లాభాల్లోనే వుంది. నేడు ప్రత్యక్షంగా దేశీయ బీమా సంస్థ లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తూ ప్రకటించారు. పరిశ్రమలకు మౌలిక వసతుల కేటాయింపును తగ్గించడంతో పాటు కేంద్ర చట్టాలను పటిష్టం చేసి కార్మికులను కార్పొరేట్ సంస్థల దయాదాక్షిణ్యాలకు వదిలివేశారు.
ప్రస్తుతం జరుగుతున్న రైతాంగ పోరాటాలను గమనం లోకి తీసుకుని వ్యవసాయ రంగానికి లాభాలు కల్పించబోతున్నట్లు ఆర్థికమంత్రి సెలవిచ్చారు. కనీస మద్దతు ధరల ద్వారా కొనుగోలు చేయడానికి 1.72 లక్షల కోట్లు, 75 వేల కోట్లు గోధుమలకు, ధాన్యం సేకరణకు 75,060 కోట్లు ఎఫ్‌సిఐ కి కేటాయింపు జరిగింది. వ్యవసాయ రుణాలు రూ. 16.5 లక్షల కోట్లుగా ప్రకటించారు. గతంలో కూడా ఇదే ఆర్థికమంత్రి రూ. 11 లక్షల కోట్లు ప్రకటించి రూ. 6.5 లక్షల కోట్లు మాత్రమే రుణ సౌకర్యం కల్పించారు. రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడి వ్యవసాయాలు సాగిస్తూ రుణగ్రస్తులై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏటా 12,600 మంది రైతులు ఆత్మహత్యలకు గురవుతున్నారు. ఆత్మహత్యలు నివారించాలన్న ఆలోచన ప్రభుత్వానికి వున్నట్టు లేదు. 2020-21లో వ్యవసాయ బడ్జెట్ రూ. 1,27,165 కోట్లు కాగా 2021-22 బడ్జెట్‌లో రూ. 1,34,632 కోట్లకు పెంచారు. అంటే రూ. 7,467 కోట్లు మాత్రమే పెంచారు. పంటల బీమా పథకానికి కేటాయించిన రూ. 16 వేల కోట్లలో 6-8 వేల కోట్లు బీమా సంస్థలే కాజేస్తున్నాయి. పంట రుణాల వడ్డీ రాయితీకి కేటాయించిన రూ. 19,468 కోట్లలో 5-6 వేల కోట్లు చెల్లింపులు జరగడంలేదు. పి.ఎమ్ అన్నదాత ఆదాయ సంరక్షణకు కేవలం రూ. 400 కోట్లు, వ్యవసాయ ఉత్పత్తుల ధరల మద్దతుకు రూ. 1500 కోట్లు మాత్రమే కేటాయించారు. కిసాన్ సమ్మాన్ నిధికి ప్రారంభంలో రూ. 75 వేల కోట్లు కేటాయించి, రూ. 48,713 కోట్లు మాత్రమే రైతులకు పంపిణీ చేశారు. రైతు కుటుంబానికి ఇచ్చే రూ. 6 వేలు పెంచుతున్నామని చెప్తూనే 2021-22 సంవత్సరంలో రూ. 65 వేల కోట్లు, వ్యవసాయ పరిశోధనలు, విద్యకు రూ. 8,515 కోట్లు, పశుపోషణ పాడి పెంపకానికి రూ. 3,102 కోట్లు, మొత్తం మూడు రంగాలకు కలిపి వ్యవసాయ బడ్జెట్ రూ. 1,34,632 కోట్లు కేటాయింపులు చూపారు. ఏ విధంగా చూసినా వ్యవసాయాభివృద్ధికి తగిన ప్రణాళిక గాని, ప్రస్తుతం జరుగుతున్న 3 లక్షల కోట్ల వ్యవసాయ దిగుమతులు ఇతర దేశాల నుండి రావడాన్ని నిరోధించి స్వయంసమృద్ధి కావడానికి తగిన కేటాయింపులు మాత్రం చూపలేదు. మోడీ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న రిలయన్స్, అదానీలకు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్ళలో పూర్తి గుత్తాధిపత్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఉత్పాదకతను తగ్గించడానికి ఎరువుల సబ్సిడీ 2020-21లో రూ. 94,957 కోట్లు ఉండగా, దానిని 2020 సంవత్సరానికి రూ. 58,529 కోట్లకు తగ్గించడం జరిగింది. వ్యవసాయ ఉత్పత్తి పెంచడమంటే ఈ విధానాలతోనా? ఉత్పత్తి, ఉత్పాదకత పెంచడం, కనీస మద్దతు ధరను నిర్ణయించడం, విత్తనాలు ఎరువుల సబ్సిడీలను పెంచడం, నాణ్యత గల విత్తనాలను సరఫరా చేయడం, వ్యవసాయాభివృద్ధికి ప్రణాళికను రూపొందించడం లాంటివేవీ ఈ బడ్జెట్‌లో చూపలేదు. 'ఆత్మనిర్భర్ భారత్' పేరుతో భౌతిక మరియు ఆర్థిక పెట్టుబడి, మౌలిక సౌకర్యాలను పెంచుతామని చెప్తూ వ్యవసాయానికి గత ప్యాకేజిలో కేటాయించిన రూ. లక్ష కోట్లను నేటికీ విడుదల చేయలేదు. సహకార సంఘాలు, గ్రామీణ బ్యాంకుల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తామన్న ప్రకటన ప్రకటనగానే మిగిలిపోయింది. భారతదేశ ఆహారధాన్యాల ఉత్పత్తిని పరిశీలించినపుడు 29.15 కోట్ల టన్నులకు మించి పెరగలేదు. గత సంవత్సరం 28.50 కోట్ల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి జరిగింది. ప్రపంచంలోనే అత్యధికంగా 34 కోట్ల ఎకరాలు సాగుచేస్తున్న భారతదేశంలో ఉత్పాదకత పెరగడమంటే ఇదేనా? కరోనా సమయంలో కూడా రైతులు కష్టపడి పంటలు పండించినప్పటికీ కనీస మద్దతు ధర లభించడంలేదు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ను అమలుజరపడానికి ప్రభుత్వం ప్రకటించిన రూ. 1.75 లక్షల కోట్లు ఏ రూపంలో ఖర్చు చేస్తారన్నది ప్రభుత్వం చెప్పలేదు.
నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ దేశంలో 5 కోట్ల మంది విద్యావంతులైన నిరుద్యోగులున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. కరోనాతో ఈ సంఖ్య 15 కోట్లకు పెరిగినట్లు సర్వే రిపోర్టులు చెపుతున్నాయి. పర్మినెంటు ఉద్యోగాలను తగ్గించి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల వైపు తోసివేయడానికి భారీ, కీలక పరిశ్రమలను ప్రైవేటీకరించడానికి పూనుకున్నారు. ఈ సంవత్సరం రూ. 1.75 లక్షల కోట్ల ప్రభుత్వ వాటాలను ఉపసంహరిస్తామని చెపుతూనే చిన్నతరహా పరిశ్రమలకు రూ. 15,700 కోట్లు కేటాయింపు చూపారు. రూ. 3 వేల కోట్లతో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నిధులు ఒక రాష్ట్రానికి కూడా సరిపోవు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న 70 కోట్ల జనాభాలో 35 కోట్ల మంది నిరక్షరాస్యులే. వారిలో నైపుణ్యం వృద్ధి చేయాలంటే కనీసం రూ. 15 వేల కోట్లు కావాలి. అందువల్ల ఉపాధి కల్పించే పథకాలకు నిధులు తగ్గించడం, కార్పొరేట్ సంస్థలకు మౌలిక వసతులు కల్పించడానికి నిధులు పెంచడం జరిగింది. ప్రైవేటు రంగంలో 7 కొత్త ఓడరేవులను ప్రతిపాదించారు. ఇప్పటికే రవాణా సౌకర్యాలు 80 శాతం ప్రైవేటుగానే కొనసాగుతున్నాయి. రవాణా భారం భరించలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించి వాటి నిర్వహణ బాధ్యతను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం, టోల్‌ట్యాక్స్ పేరుతో దశాబ్దాల పాటు వేల కోట్లు వసూలు చేసుకోవడానికి భారీ సంస్థలకు అవకాశం కల్పిస్తున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో విదేశీ సంస్థలకు ఆహ్వానం పలుకుతూ వారికి భూమి, విద్యుత్తు, నీరు, తదితర సౌకార్యలు ఉచితంగా కల్పించడమే కాక ఆ ఫ్యాక్టరీలు విడుదల చేసిన కాలుష్యానికి భారత ప్రజలను గురిచేస్తున్నారు. నేడు భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫార్మా పరిశ్రమలను ఆహ్వానించడంలో మునిగి పోయాయి. మన దేశీయ అవసరాలకు మించి ఫార్మా ఉత్పత్తులు జరుగుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ కార్పొరేట్ సంస్థల అభివృద్ధికి మాత్రమే దోహదపడుతుంది. వీరు ఎగవేసే బ్యాంకు రుణాలు, ఎన్‌పిఎ లను ఒకచోట చేర్చి ఉపసంహరించుకోవడానికి 'బ్యాడ్ బ్యాంక్'' విధానాన్ని రూపొందించబోతున్నారు. ఎన్‌పిఎ లతో పాటు మొండి బాకీలను కూడా ఈ బ్యాడ్ బ్యాంక్‌కు తరలిస్తారు. ఆ విధంగా కార్పొరేట్ల రుణాలను మాఫీ చేయడానికి కేంద్రీకరణ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికే రిజర్వ్ బ్యాంకు లోని ఏ ఖాతాకు చెందని నిల్వలను కేంద్ర ప్రభుత్వం తన అవసరాలకు వాడుకుంటున్నది. అలాగే బ్యాంకులను కలపడం ద్వారా ఎగవేసిన పెట్టుబడిదారులకు తిరిగి రుణాలు ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. అందువల్ల ఈ బడ్జెట్ కార్పొరేట్ సంస్థల లాభాల కోసమే తప్ప పేదల ఆదాయం పెంచడానికి వినియోగపడదు అన్నది కనపడుతున్న సత్యం. అతి కొద్ది కాలం లోనే కొర్పొరేట్ సంస్థలు మొత్తం దేశ ఆర్థిక పెత్తనాన్ని, నిర్వహణను తమ చేతుల్లోకి తీసుకోవడం జరిగిపోతుంది.
(వ్యాసకర్త సెల్ : 94900 98666)
సారంపల్లి మల్లారెడ్డి











