- బిగించేందుకు సిద్ధమైన డిస్కంలు
- వ్యవసాయ కనెక్షన్లకు ప్రతి నెల 231.21
- గృహాలకు 109.74
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్ వినియోగదారులను ఇప్పటికే ట్రూఅప్, ఇతర భారాలు వెంటాడుతున్నాయి. వీటికి తోడు ఇక నుంచి స్మార్ట్ మీటర్ల భారాలు కూడా కలిసి వినియోగదారుల నడ్డి విరవనున్నాయి. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం(ఆర్‌డిఎస్‌ఎస్)లో రాష్ర ్టప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు, గృహా, వాణిజ్య, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమ లకు స్మార్ట్ ప్రిపెయిడ్ మీటర్లను బిగించనుంది. ఇందుకు అవసరమైన టెండర్లను కూడా ఇటీవల జరిగిన రాష్ట్రమంత్రిమండలి ఆమోదం తెలిపింది. వ్యవసాయ కనెక్షన్ల మీటర్ల టెండర్‌ను షీరిడి సాయి ఎలక్ట్రికల్‌కు, ప్రిపెయిడ్ మీటర్ల టెండర్‌ను అదానీ సంస్థకు దక్కాయి. వ్యవసాయ కనెక్షన్లకు సంబంధించిన ఒక్కొ స్మార్ట్ మీటర్‌కు రూ.36,975 లకు, గృహా, వాణిజ్య, పరిశ్రమలకు బిగించనున్న స్మార్ట్ ప్రిపెయిడ్ మీటర్లకు రూ.10,205.82లకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 1.96కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 18.62లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. దీనికోసం మొత్తం రూ.6,888కోట్లకు టెండర్లు ఖరారు అయ్యాయి.
అయితే ఈ మొత్తాన్ని కంపెనీ కి ఒకేసారి కాకుండా ప్రతి నెల రూ.231.21లు చొప్పున 93 నెలలు పాటు చెల్లించాల్సి ఉంటుంది. వ్యవసాయ మీటర్లకు అయ్యే ఖర్చు తామే చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఈ భారం అంతిమంగా వినియోగదారులపైనే పడనుంది. ఇక ప్రిపెయిడ్ మీటర్ల విషయానికి వస్తే మొదటి దశ కింద ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి 27.68 లక్షల కనెక్షన్లకు బిగించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిల్లో 4.72లక్షల గృహాలు, 3.7లక్షల ఫీడర్ల వద్ద, 3.22 లక్షల ప్రభుత్వ కార్యాలయాలు, 1.19 లక్షలు పరిశ్రమలకు, 15.47లక్షల వాణిజ్య వినియోగ దారులకు బిగించేందుకు డిస్కంలు సిద్ధమ య్యాయి. ప్రిపెయిడ్ మీటర్ ధర రూ.10,205. 82లుగా టెండర్‌ను డిస్కంలు ఫైనల్ చేశాయి. దీనికి కూడా 93 నెలలు చొప్పున జిఎస్‌టితో కలిపి రూ.109.74లు చొప్పున వినియోగదారులు చెల్లించాలి. మొదటి దశ పూర్తికాగానే 2025 డిసెంబర్ నాటికి రెండో దశలో మరో 13.5లక్షల కనెక్షన్లకు ఈ ప్రిపెయిడ్ మీటర్లకు డిస్కంలు టెండర్లు పిలుస్తాయి. మిగిలిన కనెక్షన్లకు కూడా దశల వారీగా అమర్చనున్నాయి. 1.60కోట్లకు ప్రిపెయిడ్ మీటర్లను అమర్చేందుకు ఈ టెండర్ ప్రకారం సుమారు రూ.16,500కోట్లు అవుతుంది. రెండో దశలో గానీ, ఆ తరువాత దశల్లో గానీ ధరలు పెరిగాయని మరలా మీటర్ల ధరలు పెంచే అవకాశం లేకపోలేదు.
రాష్ట్రంలోనే అధిక ధర
వ్యవసాయ కనెక్షన్లకు బిగించే స్మార్ట్ మీటర్ల ధర రాష్ట్రంలోనే అధికంగా ఉంది. రాజస్థాన్‌లో ఒక్కొ మీటర్ నిర్వహణతో కలిపి రూ.7945లు, ఛండీఘర్‌లో రూ.9710లు మాత్రమే ధర ఉంది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌కు చెందిన విద్యుత్ పంపిణీ సంస్థ గృహా, వాణిజ్య కనెక్షన్ల కోసం ప్రిపెయిడ్ మీటర్లకు టెండర్ పిలవగా అదానీ సంస్థ రూ.10వేలకు కోడ్ చేసింది. ఎక్కువ ధరకు కోడ్ చేసిందని ఉత్తరప్రదేశ్ డిస్కం అదానీ టెండర్‌ను రద్దు చేసింది. ఇప్పుడు అదే అదానీ సంస్థకు అక్కడి కంటే ఎక్కువగా సుమారు రూ.10,300లకు రాష్ట్రప్రభుత్వం ఖరారు చేసింది.










