Mar 02,2023 07:28
  • లక్ష్యం పూర్తయిందని చెప్తున్న అధికార్లు
  •  పలు జిల్లాల్లో రైతుల వద్దే లక్షల టన్నులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : ధాన్యం అమ్ముదామని రైతు భరోసా కేంద్రాలకు (ఆర్‌బికెలకు) వెళ్తున్న రైతులకే నిరాశే ఎదురవుతోంది. లక్ష్యం పూర్తయిందని, పైనుంచి ఆదేశాల వచ్చే వరకు ఏమీ చేయలేమని అధికారులు చెప్తుండడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సాధారణంగా ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మార్చి 31 వరకు సాగుతుంది. ఆ కాలంలో శ్రీకాకుళం, ఉమ్మడి గుంటూరు వంటి జిల్లాల్లో మినుము, పెసర పంటలు వేస్తుంటారు. ఖరీఫ్‌లో పండించిన వరిని వెంటనే నూర్చకుండా పొలాల్లోనే కుప్పలుగా ఉంచారు. ప్రస్తుతం అపరాల కోతలు పూర్తి కావడంతో రైతులు ధాన్యం నూర్పులు చేస్తున్నారు. ఈ సమయంలోనే ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ముగించడంతో పలు జిల్లాల్లో లక్షలాది మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైతుల వద్దే ఉండిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో సుమారు 77 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో రూ.37 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇంతవరకూ సుమారు 33 లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసింది. అంచనాకు మించి కొన్ని జిల్లాల్లో దిగుబడులు వచ్చాయి. ఫిబ్రవరి 15వ తేదీతో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలు ముగిస్తామని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్భంగా ప్రకటించారు. అప్పటికే రైతుల వద్ద పెద్ద ఎత్తున ధాన్యం నిల్వలు ఉండిపోవడంతో ఆ తర్వాత కొద్దికొద్దిగా కొనుగోలు చేశారు. సోమవారం నుంచి కొనుగోళ్లు నిల్చిపోయాయి. దీంతో, అపరాలు సాగు చేస్తున్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ధాన్యం నిల్వలు ఉండిపోయాయి. ధాన్యం కొనుగోలు లక్ష్యం పెంచాలని జిల్లాల నుంచి అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీన్ని పరిగణలోకి తీసుకోకపోగా లక్ష్యం పూర్తి కాకముందే కొనుగోలు నిలుపుదల చేసింది. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు, ఆచరణకు పొంతన లేకుండా పోయింది. దీంతో, రైతులు మిల్లర్లకు తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వస్తోంది. కృష్ణా జిల్లా మొవ్వ మండలం వేములమడ గ్రామానికి చెందిన వి. వెంకటేశ్వరరావు ఎంటియు 1318 వరి వంగడాన్ని ఆరు ఎకరాల్లో సాగు చేశారు. 18 రోజుల క్రితం వరి నూర్పిడి చేశారు. ఈ ధాన్యాన్ని కొనేందుకు అధికారులు ముందుకురాలేదు. దీంతో, మిల్లరుకు అమ్ముకోవాల్సి వచ్చింది. 'ఎ' గ్రేడ్‌కు 75 కిలోల బస్తాను రూ.1545కు చెల్లించాలి. మిల్లరు బస్తా ఒక్కంటికీ రూ.1250 చొప్పున 210 బస్తాలు కొనుగోలు చేశారు. బస్తా ఒక్కంటికీ రూ.295 చొప్పున రూ.61,950 వెంకటేశ్వరరావు నష్టపోయారు. లక్ష్యం పూర్తవడంతో మరో 1.68 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని కృష్ణా జిల్లా అధికారులు నివేదించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీంతో, ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్‌కు మించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఆన్‌లైన్‌ చేయవద్దంటూ మిల్లర్లకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అదనంగా ధాన్యం కొనుగోలు చేస్తే రైతులకు మిల్లర్లే డబ్బులు చెల్లించాలని ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు.

  • కొనుగోలు చేయాలి

మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాను. మినుము పంట ఉండడంతో కోత మిషన్‌ వచ్చే దారిలేక ఇప్పుడు నూర్పులు చేశాను. 75 బస్తాలు ధాన్యం వచ్చింది. కొనుగోలు చేయాలని ఆర్‌బికె సిబ్బందిని అడిగాను. లక్ష్యం పూర్తయిందని చెప్తున్నారు. ఏం చేయాలో తోచడం లేదు. ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలి.
- ఎన్‌.కృష్ణ, తోలాపి గ్రామం, పొందూరు మండలం, శ్రీకాకుళం జిల్లా