- 15లోగా బాధితులకు న్యాయం చేయాలి
- అసైన్డ్ భూముల పరిరక్షణ సదస్సులో పి మధు
- మంత్రి, వైసిపి నాయకుల ఆగడాలపై కన్నీటి పర్యంతమైన అసైన్డ్ రైతులు
ప్రజాశక్తి-చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) : పేదల వద్ద లాక్కున్న అసైన్డ్ భూములను పట్టాలతో సహా ప్రభుత్వం తిరిగి ఇవ్వాలని రాజ్యసభ మాజీ సభ్యులు పి.మధు డిమాండ్ చేశారు. లేదంటే దశల వారీగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిఎం జగన్మోహన్‌రెడ్డి, మంత్రి విడదల రజిని వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోయిన అసైన్డ్ రైతులతో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని గ్రాండ్ వెంకటేష్ కల్యాణ మండపంలో అసైన్డ్ భూముల పరిరక్షణ సదస్సు శనివారం జరిగింది. వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, అసైన్డ్ భూముల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు చిలకలూరిపేట నియోజకవర్గంలోని యడవల్లి, మురుకిపూడి, నాదెండ్ల, ఎండుగుంపాలెం తదితర 13 గ్రామాలకు చెందిన బాధిత రైతులు హాజరయ్యారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన పి.మధు మాట్లాడుతూ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి పేదలకు పంపిణీ చేసిన భూములను ఆయన కుమారుడు, ప్రస్తుత సిఎం జగన్మోహన్‌రెడ్డి లాక్కుంటున్నారని విమర్శించారు. పేదలకు ఎడవల్లి, మురుకుపూడి గ్రామాల్లో ఇచ్చిన అసైన్డ్ భూముల్లో గ్రానైట్ ఉండడంతో ఈ భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుందన్నారు. ఈ భూముల్లో కొన్నింటిని మైనింగ్ కోసం వైసిపి నాయకులకు కట్టబెట్టిందని, మరికొన్ని భూములను వైసిపి నాయకులు ఆక్రమించుకున్నారని విమర్శించారు. బాధిత రైతుల వివరాలను మంత్రి రజినికి ఇస్తామని, మార్చి 15లోగా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తొలుత ప్రతి గ్రామంలో ర్యాలీలు, మార్చి నెలాఖరులో చిలకలూరిపేటలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీలకు దోచుపెడుతోందని, విద్యుత్తు ఛార్జీలను పెంచుతోందని అన్నారు. వీటిపై తన వైఖరేమిటో సిఎం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ పేదలకు ఇచ్చిన కొద్దిపాటి భూమినీ తిరిగి లాక్కోవాలని చూడడం సరికాదన్నారు. ప్రభుత్వాల విధానాలతో ఉపాధి కోల్పోతున్న పేదలు ఉన్న కాస్త భూమి ఆధారంగా బతుకుతున్నారని తెలిపారు. కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎక్కడ భూములు తీసుకున్నా ఎస్‌సి, ఎస్‌టి, బిసిలు అన్యాయానికి గురవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఐక్యంగా పోరాడి భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సదస్సుకు అధ్యక్షత వహించిన ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ మాట్లాడుతూ భూముల రీసర్వే పేరుతో అసైన్డ్, చెరువు, కాలువ, పోరంబోకు తదితర భూములను ఎస్‌సి, ఎస్‌టి, ఇతర పేదలకు దక్కనీయకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఈ కుట్రలను తిప్పికొట్టి భూములను, వాటి పట్టాలను సాధించుకునేందుకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.రోశయ్య, ఎ.లకీëశ్వరరెడ్డి మాట్లాడుతూ మురికిపూడిలో భూములను గ్రానైట్ పేరుతో సిఎం బంధువైన ఎంపి అవినాష్‌రెడ్డి, తదితరులకు కట్టబెట్టారని విమర్శించారు. యడవల్లిలోనూ ఇలాగే తీసుకున్నారని, అక్కడ పోరాట ఫలితంగా కొంతవరకైనా పరిహారం దక్కిందని తెలిపారు.
ఈ సదస్సులో మురుగుపూడి చెందిన దళిత రైతు రాజు మాట్లాడుతూ తమ గ్రామంలో ఎస్‌సి, బిసిలకు 30 ఏళ్ల క్రితం ఇచ్చిన 400 ఎకరాలను ప్రస్తుత మంత్రి రజిని గ్రానైట్ క్వారీలకు అప్పజెప్పారని, దీన్ని వ్యతిరేకించిన వారిపై అత్యాచారం కేసులు బనాయిస్తున్నారని వాపోయారు. ఛంఘీస్‌ఖాన్‌పేట సమీపంలోని సంఘం గోపాలపురానికి చెందిన దళిత మహిళ పోలేపోగు సుమమాధురి మాట్లాడుతూ 50 మందికి రెండు సెంట్ల చొప్పున ఎకరం స్థలంలో ఇళ్ల స్థలాలు, ఒక్కో కుటుంబానికి రెండెకరాల పొలం ఇచ్చారని, వాటికి పాస్‌పుస్తకాలు కూడా ఉన్నాయని, వాటిని వైసిపి నాయకులు ఆక్రమించారని తెలిపారు. దీనిపై అడిగితే ఇబ్బందులకు గురి చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. సదస్సులో కెవిపిఎస్ పల్నాడు జిల్లా కార్యదర్శి జి.రవిబాబు, సిఐటియు పట్టణ కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు, బి.శంకరరావు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, పలు గ్రామాల ఎస్‌సి, ఎస్‌టి, బిసి, రైతులు, మహిళలు పాల్గన్నారు.










