Nov 09,2023 10:48

తగ్గింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌
న్యూఢిల్లీ : 
 గత నెల 26న జారీ చేసిన నోటిఫికేషన్‌లో ప్రకటించినట్లుగా ఎన్‌బిఎస్‌ పథకం కింద ఎరువులపై సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఇటీవల గణనీయంగా తగ్గించింది. సబ్సిడీ కుదింపుపై అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎరువులు ముఖ్యంగా ఫాస్పేట్‌, పొటాష్‌ సబ్సిడీలు దారుణంగా తగ్గించారని, దీనివల్ల రైతుల దుస్థితి మరింత పెరుగుతుందని పేర్కొంది. 2020 జూన్‌లోని సబ్సిడీ రేటుతో పోల్చుకుంటే ఈ ఏడాది అక్టోబరులో ఫాస్పేట్లపై సబ్సిడీ కేవలం 9 శాతమే అధికంగా వుందని డేటా వెల్లడిస్తోంది. కానీ 2002 జూన్‌తో పోలిస్తే రాక్‌ ఫాస్పేట్‌ అంతర్జాతీయ ధరలు మాత్రం దాదాపు 4.6 రెట్లు పెరిగాయి. పొటాష్‌ పరిస్థితి మరీ దారుణంగా వుంది. సబ్సిడీని సంక్షోభానికి ముందు స్థాయిలో కేవలం 23 శాతానికి కుదించారు. లేదా మారకపు రేటు తరుగుదలను పరిగణిస్తే దాదాపు 80 శాతంగా వుంది. 2020 జూన్‌తో పోలిస్తే పొటాషియం క్లోరైడ్‌ అంతర్జాతీయ ధరలు 1.75 రెట్లు ఎక్కవగా వున్న తరుణంలో ఈ పరిస్థితి నెలకొందని ఎఐకెఎస్‌ విమర్శించింది. సబ్సిడీని ఇంత దారుణంగా కుదించడం వల్ల భారత్‌లో ఎరువుల ధరలు తీవ్రంగా పెరగడానికి దారి తీసే వీలుందని హెచ్చరించింది. తక్షణమే కేంద్రం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది.