న్యూఢిల్లీ : ప్రస్తుతం ఉత్తరాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలను, వరదల్నీ జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆల్ ఇండియా కిసాన్ సభ (ఎఐకెఎస్) డిమాండ్ చేసింది. బాధిత ప్రజలకు ఉపశమనం కలిగించడానికి అత్యంవసర చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎఐకెఎస్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు అశోక్ దావలే, విజూ కృష్ణన్ ఒక ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాలు, వరదలతో కష్టాలు పడుతున్న ప్రజల పట్ల తీవ్రమైన ఆందోళన, సానుభూతిని ఎఐకెఎస్ వ్యక్తం చేసింది. ఉత్తరభారతంలోని హిమాచల్ ప్రదేశ్, జమ్ముకాశ్మీర్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌తో పాటు ఈశాన్యంలోని అస్సాం, దక్షిణాన కేరళ వంటి రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో ప్రభావితమయ్యాయని తెలిపింది. చాలా రాష్ట్రాల్లో పంటలు పూర్తిగా నాశనమయ్యాయని, రాష్ట్రాల్లో జరిగిన విధ్వంసం జాతీయ విపత్తు కంటే తక్కువ కాదని పేర్కొంది. నివేదికల ప్రకారం 100 మందికి పైగా మరణించారని, పశువులు, ఆస్థులు, వాహనాలు నీటిలో కొట్టుకుని పోయాయని, లక్షల ఎకరాల్లో పంటలు మునిగిపోయాయని తెలిపింది. ఎడతెరిపి లేని, కుండపోత వర్షాలు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరగిపడ్డం వంటి వాటికి కారణమయ్యాయని, రోడ్లు, వంతెలను ధ్వంసమయ్యాయని చెప్పింది. అనేక గ్రామాలు నీట మునగడంతో సాధారణ జీవితం స్తంభించిందని తెలిపింది. ఆప్తులను కోల్పోయిన వారి ద్ణుఖాన్ని పంచుకోవడంతో పాటు, పంటలు, ఆస్తులు కొల్పోయి నిరాశ్రయులైన వారందరికీ సంఘీభావాన్ని ఎఐకెఎస్ తెలియజేస్తుంది. వారికి పరిశ్రుభమైన తాగునీరు, ఆహారం, ప్రాధాన్యత ప్రాతిపదికన వైద్య సహాయం వంటి ఉపశమన చర్యలు అవసరమని తెలిపింది. యుద్ధ ప్రాతిపదికన తక్షణ సహాయక చర్యలు, బాధితులకు తగిన నష్ట పరిహారాన్ని ఎఐకెఎస్ డిమాండ్ చేసింది. అలాగే సహాయ చర్యల్లో పాలుపంచుకోవాలని తన విభాగాలు, కార్యకర్తలకు ఎఐకెఎస్ పిలుపునిచ్చింది.