ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపి విధానాలు వదిలి, రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసిపి ప్రభుత్వం పనిచేయాలని సిపిఎం సీనియర్ నాయకులు పి మధు తెలిపారు. విజయవాడలో జరిగిన 'దేశ రక్షణ భేరి' బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బిజెపి మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి దేశ రక్షణ భేరి వంటి సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశాన్ని రక్షించాలంటే మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపులో భాగంగా ఈ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో దేశానికి సంపూర్ణ స్వతంత్రం నినాదం ఇచ్చినట్లుగానే, ఇప్పుడు 'మతోన్మాద బిజెపిని ఓడించాలని' కమ్యూనిస్టులు పిలుపునిచ్చారని అన్నారు. జిఎస్టి రావడంతో నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. స్మశానంలో కూడా జిఎస్టి వేయడం దుర్మార్గమన్నారు. మరోపక్క కార్పొరేట్లకు కోట్లాది రూపాయలు రాయితీలు ఇస్తూ, వారిని ప్రపంచ స్థాయి కుబేరులుగా నిలిపారని విమర్శించారు. రాష్ట్రంలో అనేక పరిశ్రమలు, రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలు ఆదానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా కట్టపెడుతుందని మండపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీలో దుర్భాషలాడడం మానుకొని ప్రజల సమస్యలపై చర్చించాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం విధానాలను రాష్ట్ర ప్రభుత్వం నిసిగ్గుగా మద్దతు పలకడం సరికాదన్నారు.










