Feb 08,2021 14:52

పశ్చిమ గోదావరి (ఉండి) : ఎపిలో పంచాయతీ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. మంగళవారం పోలింగ్‌కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 6.30 నుంచి సాయంత్రం 3.30 వరకు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అనంతరం ఓట్ల లెక్కింపు.. తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు. అయితే, ఓటర్లను ప్రసన్న చేసుకునేందుకు తాయిలాలతో అభ్యర్థులు గాలం వేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలోని ఒక గ్రామంలో వార్డు పదవికి పోటీలో ఉన్న అభ్యర్థి ఆదివారం ఓటర్లకు వెరైటీ గిఫ్ట్‌లు ఇచ్చిన విషయం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆయన ఏమిచ్చారో అనుకుంటున్నారా? ఇంటింటికీ బ్రాయిలర్‌ కోడి, పెరుగు ప్యాకెట్లు పంపిణీ చేశారట. డబ్బులతో పాటు గృహావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారట. అదే మండలంలోని మరొక గ్రామంలో వార్డు పదవికి పోటీలో ఉన్న వ్యక్తి ఇంటి అవసరాలకు ఉపయోగపడే కిరాణా సరుకులను పంపిణీ చేశారు. కొన్ని గ్రామాల్లో సిమెంట్‌ బస్తాలు, అభ్యర్థుల గుర్తులైన ప్రెషర్‌ కుక్కర్లు కూడా పంపిణీ చేస్తున్నారట. అంతేకాదు పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతండటంతో అభ్యర్థులు గుట్టుచప్పుడు కాకుండా డబ్బుల పంచుతున్నారట. ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు ఇచ్చేందుకు వెనుకాడటం లేదు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారిని కూడా ఊళ్లకు రప్పిస్తున్నారు. బస్సు, ట్రైన్‌ టిక్కెట్లు కూడా బుక్‌ చేసి మరీ రప్పిస్తున్నారు.