Sep 30,2022 12:13

ఉండి (పశ్చిమ గోదావరి) : ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును కొనసాగించే వరకు నియోజకవర్గ పరిధిలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని మండల టిడిపి పార్టీ అధ్యక్షులు జుత్తిగ శ్రీనివాస్‌ అన్నారు. ఉండి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం మండల పార్టీ ఆధ్వర్యంలో తెలుగు యువత, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు దీక్షలో కూర్చున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉండి శాసనసభ్యులు మంతెన రామరాజు మాట్లాడుతూ... విజయవాడలో ప్రయివేటు ఆధ్వర్యంలో నడిచే హెల్త్‌ యూనివర్సిటీని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని అన్నారు. తెలుగుజాతికి వైద్య విశ్వవిద్యాలయంను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. విద్యా సంస్థలు ప్రముఖుల పేర్లతో ఉన్నప్పుడు గత ప్రభుత్వాలు ఎప్పుడూ మార్చలేదని కానీ ఈ ముఖ్యమంత్రి పేరు మార్చడం సబబు కాదన్నారు. ఎన్టీఆర్‌ పేరును కొనసాగించే వరకు దీక్షలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి బురిడీ రవిబాబు, తెలుగుయువత మండల అధ్యక్షులు జమ్ము గణేష్‌, గురువెల్లి బాబూరావు, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి మాండ్రు సందీప్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నియోజకవర్గ ఉపాధ్యక్షులు కాలా గణేష్‌, కొత్తకోట అనిల్‌,రామేశ్వరపు దుర్గారావు, కేసన కోటి తదితరులు పాల్గొన్నారు.