ఉండి (పశ్చిమ గోదావరి) : ఆక్వా రైతుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ... ఉండి కోట్ల ఫంక్షన్ హాల్ లో ఆక్వా రైతు పోరుబాట కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. సభలో ఆక్వా రైతుల సమస్యలపై ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు ప్రసంగిస్తున్నారు.
ఆక్వా రైతులు మాట్లాడుతూ ... రొయ్యల ధరలు రోజురోజుకీ పతనం, ఫీడ్ ధరలు పెరగడం, నాణ్యమైన సీడ్ లభించని సమస్యలతో ఆక్వా రైతులు కుదేలవుతున్నారని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా విద్యుత్ సబ్సిడీని ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అంటూ, అర్థం లేని నిబంధనలు పెట్టి ఆక్వా రైతుకు విద్యుత్ సబ్సిడీని ఎత్తివేస్తున్నారని రైతులు నిరసన తెలుపుతున్నారు. ఆక్వా రైతులందరికీ న్యాయం జరిగేంత వరకు ఉద్యమిస్తామని రైతులు స్పష్టం చేశారు.
ఉండి సబ్ స్టేషన్ వద్ద ఈ ఉదయం జరిగే ఆక్వా రైతుల నిరసన ప్రదర్శనలో పాల్గనేందుకు పాలకొల్లు నుంచి పెద్ద సంఖ్యలో రైతులు కార్లలో బయలుదేరారు. పట్టణంలోని టిడిపి ప్రధాన కార్యాలయం వద్ద నుంచి ఊరేగింపుగా ఆక్వా రైతులు బయలుదేరి వెళ్ళారు. ఎంఎల్‌ఏ నిమ్మల రామానాయుడు, ఎంఎల్‌సి అంగర రామ్మోహన్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు, జిల్లా కార్యదర్శి కర్నేన గౌరు నాయుడు, దొడ్డా ఏడుకొండలు, గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, మామిడి శెట్టి పెద్దిరాజు తదితరులు ఉన్నారు.










