ఒక అడవిలో ఎన్నో చిన్నా, పెద్దా జంతువులు అన్నీ కలసిమెలసి జీవించేవి. అయితే ఆ అడవిలో ఉన్న తాబేలుకి సీత, గీత అనే ఇద్దరు కుందేళ్లతో స్నేహం బాగా కుదిరింది. ఎక్కడికి వెళ్ళినా ముగ్గురూ కలిసే వెళ్లేవారు. ఆహారం దొరికితే అంతా పంచుకుని తినేవారు.
ఒకరోజు తాబేలు తన స్నేహితురాళ్లైన సీత, గీతలను వాళ్లింటికి విందుకి పిలిచింది. సీత, గీత ఒక రైతు తోటలో ఎర్రగా పండిన టమాటా పళ్ళు కోసుకుని, తమ స్నేహితురాలికి కానుకగా తీసుకు వెళ్ళాయి.
తాబేలు తమ స్నేహితురాళ్ళు నడచి నడచి అలసిపోయి వస్తారని, కాళ్ళునొప్పి పెడుతూ ఉంటాయని అనుకుంది. దాంతో చల్లటి నీళ్ళతో కాళ్ళు కడుక్కుంటే కాళ్ల నొప్పులు తగ్గుతాయని ఇంటి గుమ్మం బయట పెద్ద గిన్నెలో కొన్ని నీళ్ళు పెట్టింది. స్నేహితులకు ఎదురు వెళ్ళి తమ ఇంటికి తీసుకు వచ్చింది. సీత, గీత కాళ్లూ చేతులూ ముఖమూ కడుక్కుని, తాబేలు అందించిన తువ్వాలుతో ముఖం తుడుచుకుంటూ లోపలికి వచ్చారు.
సీత, గీత ఇద్దరికీ అక్కడ రకరకాల గడ్డి, దుంపలు, పళ్ల ముక్కలూ, రకరకాల కూరగాయలు కనిపించాయి. వాటిని చూడగానే కుందేళ్ళు ఇద్దరికీ నోరూరి పోయింది. ఎప్పుడు తిందామా అని ఎదురు చూడసాగాయి. తమ కూడా తెచ్చిన టమాటా పళ్లను తాబేలుకి బహుకరించాయి.
పెద్ద పెద్దగా ఉండి, బాగా ముగ్గిన టమాటా పళ్లను చూసి తాబేలు ఎంతో సంతోషపడింది. ముగ్గురూ కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకున్నాయి. కొంచెం సేపు అయ్యాకా .. తాబేలు తన మిత్రులు ఇద్దరి వైపూ చూస్తూ.. 'భోజనాలు చేద్దాము. రండి. ఎప్పుడో బయలుదేరి ఉంటారు. పైగా నాకు కానుక ఇవ్వాలని ఎంతో దూరం నడచి రైతు పొలం వరకూ వెళ్ళారు. ఆకలి వేస్తూ ఉండి ఉంటుంది.' అని వాళ్లని తిందాం రమ్మని పిలిచింది తాబేలు.
సరేనని లేచి తాబేలు వెనుక నడిచారు. అక్కడున్న ఆహారాన్ని చూస్తూ.. 'చాలా రకాలు పెట్టావు మిత్రమా. వీటన్నింటి కోసం ఎక్కడెక్కడా తిరిగావో ఏమో!' అంది కుందేలు సీత.
'ఆ..ఏముంది! స్నేహితుల్ని పిలిచాక ఒకటీ, రెండు రకాలు పెడితే ఏమి బాగుంటుంది. ఇవ్వాళ నేను పిలిచాను. రేపు మీరు నన్ను పిలుస్తారు. ఒకటో, రెండో రకాలు పెట్టి పంపేస్తారా ఏమిటి?' అని హాస్యమాడింది తాబేలు. ఆ మాటలకి నవ్వుకుంటూ పళ్లాలు తీసుకుని, వడ్డించుకోవటం మొదలు పెట్టాయి కుందేళ్ళు.
సీతేమో నిదానంగా ఒక్కొక్కటీ తింటుంది. గీతకేమో వాటన్నింటినీ చూసేసరికి ఏది ముందు తినాలో, ఏది తర్వాత తినాలో నిర్ణయించుకోలేక అన్నింటి దగ్గరకీ అటూ ఇటూ తిరగటం మొదలుపెట్టింది. అలా ఎంతసేపు వాటన్నింటినీ చూసినా ఏది తినాలో దానికి తెలియలేదు. చివరికి అన్నింటినీ తినెయ్యాలనుకుని తినటం మొదలుపెట్టింది. కానీ తినలేకపోతుంది. ఒకటి పెట్టుకుంటుంది. ఇంతలో మరొకటి నోరు ఊరిస్తుంది. మొదటిదాన్ని పడేసి, అది పెట్టుకుంటుంది. ఈలోపు మరొకటి కనిపిస్తుంది. దాన్ని చూడగానే దీన్ని పడేస్తుంది. మధ్య మధ్యలో సీత ఏం తింటుందో వచ్చి చూస్తుంది. అవి చూడగానే తన పళ్ళెంలో ఉన్నవి అన్నీ పడేసి, సీత తింటున్నవి వేసుకుంటుంది.
ఇదంతా గమనిస్తూనే ఉంది సీత.
'ఈ గీత ఎప్పుడూ ఇంతే. దీనికి ఆశ ఎక్కువ, అరిగించుకోవటం తక్కువ.' అని మనసులోనే అనుకుంటా తనకి ఇష్టమైనవేవో అవన్నీ కడుపునిండా తినేసి, తాబేలు దగ్గిరికెళ్లి.. 'మిత్రమా! ఆహార పదార్థాలు అన్నీ చాలా బాగున్నాయి. పొట్ట నిండిపోయిం దనుకో.. ఇంక వెళ్ళొస్తాం.' అని లేచింది.
అప్పటికి కూడా గీత అక్కడ పెట్టిన ఆహారం చుట్టూ తిరుగుతూనే ఉంది. దానికింకా ఆకలి తీర్లేదు. కడుపు నిండలేదు. ఆ మాట చెప్పటానికి సిగ్గుపడింది. పళ్ళెం అక్కడ పెట్టేసి, సీత వెనుక బయలుదేరింది.
తాబేలు వాళ్లిద్దరికీ మంచి మంచి కానుకలు ఇచ్చి, కొంతదూరం సాగనంపి వెనక్కి వెళ్ళిపోయింది. అప్పటికే గీతకి అలుపు వచ్చేసి ఇక నడవలేపోయింది.
గీత నడవలేకపోవటం చూసిన సీత గీతతో..
'నేను చూస్తూనే ఉన్నాను నువ్వేం తింటున్నావో. ఎవరైనా భోజనానికి పిలిచినప్పుడు ఎన్నో రకాలు పెడతారు. అది వాళ్ల మర్యాద. వాటిల్లో మనకు ఏవి ఇష్టమో అవే తినాలి. అంతేగానీ అన్నీ తినెయ్యాలని అటూ ఇటూ తిరగటం, మన ఇష్టాలను వదిలేసి ఎదుటివారు ఏమి తింటున్నారో అది తినాలి అనుకోవటం చేస్తే ఇలాగే ఉంటది. చూసావా! అదనీ, ఇదనీ అటూ ఇటూ తిరిగి చివరికి ఏదీ పూర్తిగా తినకుండా వచ్చేశావ్. సరిగ్గా తినలేదు కాబట్టే ఇప్పుడు నీకు ఆకలేసి, నీరసం వచ్చి నడవలేకపోతున్నావ్. నీకంటూ ఒక ఇష్టం లేదా? ఉండే ఉంటది. ముందు అది ఏమిటో తెలుసుకో. నువ్వు ఎంత తినగలవు? అది కూడా తెలుసుకో. దొరికినప్పుడే తినాలి. కానీ నువ్వు తినలేదు. ఇప్పుడు తినాలని ఉన్నా వెనక్కి వెళ్ళి తినలేవు. అర్థమైందా?' అని బాగా తిట్టి, చుట్టూ చూసి దగ్గర్లో ఉన్న పాలకూర తోటలో నుండి కాసిన్ని ఆకుల్ని తెంపుకొచ్చి, గీత ముందేసి.. 'తిను. నువ్వు తిన్నాకా శక్తి వస్తే బయలు దేరదాం. ' అంది సీత.దాంతో తన తప్పు తెలుసుకున్న గీత 'నిజమే. అత్యాశతో ఆహారాన్ని సరిగ్గా తినలేకపోయాను. పైగా ఎంతో కష్టపడి మనకోసం ఏర్పాటు చేసిన ఆహారాన్ని వృథా చేసాను. నాకు నీ మాటలతో కనువిప్పు కలిగింది. ఇక నుండి అలా చెయ్యను' అని సీతతో అని, పాలకూర ఆకుల్ని తినటం మొదలుపెట్టింది గీత.
కన్నెగంటి అనసూయ
9246541249