Sep 29,2023 07:18

            ప్రజా సమస్యలకు పట్టం కట్టి, వాటి పరిష్కారానికి దిశా నిర్దేశం చేయాల్సిన అసెంబ్లీ సమావేశాలు ఏకపక్ష విన్యాసాలుగా మారడం దురదృష్టకరం. ఐదు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి శూన్యం. ఫలప్రదంగా చర్చలు జరిగాయని ప్రభుత్వం చెప్పుకోవడం సముచితమనిపించుకోదు. మొదటి రెండు రోజులు అసెంబ్లీకి హాజరైన ప్రధాన ప్రతిపక్షం, ఆ తరువాత సమావేశాలను బహిష్కరించింది. మండలిలో పిడిఎఫ్‌ సభ్యులు లేవనెత్తిన వివిధ అంశాలకు అధికారపక్షం నుండి దాటవేతే సమాధానంగా వచ్చింది. ఇక ప్రతిపక్షమే లేకుండా జరిగిన శాసనసభలో చర్చలు ఏ రీతిగా జరిగి ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అత్యంత కీలకమైన జిపిఎస్‌ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరే దీనికి నిలువెత్తు నిదర్శనం. ఈ బిల్లును శాసనసభలో ఏకపక్షంగా ఆమోదించుకున్న ప్రభుత్వం మండలిలో పిడిఎఫ్‌ సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలను పట్టించుకోలేదు. నిరసన చెబుతుండగానే బిల్లును ఓటింగ్‌కు పెట్టి, మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఓటింగ్‌కు పెట్టే సమయంలో సభ్యులందరూ తమ సీట్లలో ఉండేలా చూసుకోవాలన్న ప్రాథమిక సూత్రాన్ని కూడా పాటించలేదు. దీంతో పిడిఎఫ్‌ సభ్యులకు వాకౌట్‌ చేయడం మినహా మరో మార్గం కనిపించలేదు. నిజానికి ఈ బిల్లుకు వ్యతిరేకంగా, పాత పెన్షన్‌ విధానం (ఒపిఎస్‌) కావాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. అయినా, చట్టసభల్లో విస్తృతమైన చర్చకు ప్రభుత్వం సిద్ధపడకపోవడం దారుణం.
          స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ స్కామ్‌లో అవినీతి ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో జరిగిన తాజా అసెంబ్లీ సమావేశాలకు సహజంగానే ప్రాధాన్యత ఉంది. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష సభ్యులు ఏం ప్రశ్నిస్తారు? అధికారపక్షం ఏం జవాబు చెబుతుందన్న ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగానే ఉంది. దీంతో పాటు ఎన్నికల వేడి ఇప్పటికే రాజుకోవడంతో వివిధ ప్రజాసమస్యలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్న అంశం కూడా ఆసక్తికరంగా మారింది. అయితే, జరిగింది భిన్నం. మొదటి రెండు రోజులు అధికార వైసిపి, ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి సభ్యుల మధ్య వాదోపవాదాలకే సరిపోగా, ఆ తరువాత ఏకపక్షానికే సభ పరిమితమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో, చిట్టచివరి ప్రయత్నంగా మాత్రమే ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్‌ చేయాల్సి ఉండగా, జరిగింది దానికి భిన్నం. సాంకేతికంగా సభలో చేసిన ఒకటి, రెండు విజ్ఞప్తులు మినహా ప్రతిష్టంభనను తొలగించడానికి అవసరమైన చొరవను అధికారపక్షం చూపలేదు. ఈ సందర్భంగా స్పీకర్‌ అనుసరించిన వైఖరి కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు చంద్రబాబు అరెస్ట్‌ మినహా రాష్ట్రంలో మరే సమస్య లేనట్లు తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి బదులు సమావేశాలను బహిష్కరించే మార్గం ఎంచుకుంది. ఈ చర్య అధికార పార్టీ మరింత నిరంకుశంగా వ్యవహరించడానికి ఉపయోగపడింది.
            శాసనసభ సమావేశాల్లో వైసిపి, టిడిపిలు అనుసరించిన ఈ వైఖరితో కీలకమైన ప్రజా సమస్యలు మరుగున పడ్డాయి. జిపిఎస్‌ బిల్లును ఆమోదించిన విధంగానే అసైన్డ్‌ భూముల చట్ట సవరణకూ, కాంట్రాక్టు ఉద్యోగులందరికీ వర్తించాల్సిన క్రమబద్ధీకరణ ప్రయోజనాలను కొద్దిమందికే పరిమితం చేసేలా రూపొందించిన బిల్లునూ, ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం ఆమోదింపచేసుకుంది. కేంద్రంలో బిజెపి ఒత్తిడికి తలొగ్గి పాఠశాల విద్యలో మూడవ భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఏకపక్ష ప్రకటన చేసింది. పోలవరం ముంపు బాధితుల పునరావాసంతో పాటు, అంగన్‌వాడీలు, మున్సిపల్‌ వర్కర్లు, విద్యుత్‌ ఉద్యోగులు వంటి వివిధ తరగతుల ప్రజానీకానికి సంబంధించిన అంశాలను అసలు సమస్యలే కావన్నట్లు అధికారపక్షం వ్యవహరించింది. కొద్దిమందే ఉన్నా పిడిఎఫ్‌ సభ్యులు వీటిని లేవనెత్తడానికి మండలిలో పదేపదే చేసిన ప్రయత్నాల ఫలితంగా అరకొరగానైనా ప్రభుత్వం వీటిపై స్పందించాల్సి వచ్చింది. మొత్తంమీద ఈ అయిదు రోజుల అసెంబ్లీ సమావేశాలు నిస్సారంగా ముగిశాయనే చెప్పాలి. దీనికి ప్రధాన బాధ్యత అధికార పార్టీదే.