ఢాకా : బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు మంగళవారం చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఒక కార్యకర్త మరణించగా, 200 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ... ఎన్నికలకు ముందే ప్రధాని రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దేశ రాజధాని ఢాకాతో పాటు ఇతర నగరాల్లో వేలాది మంది ప్రతిపక్ష కార్యకర్తలు మంగళవారం భారీ నిరసన ప్రదర్శన చేపట్టడంతో పాటు ప్రధాని రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజధాని ఢాకాలో 13 కి.మీ మేర సాగిన ఈ నిరసన ప్రదర్శనలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన వేలాది మంది కార్యకర్తలు, మద్దతుదారులు పాల్గన్నారు. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇది కేవలం రాజకీయ ర్యాలీ మాత్రమే కాదని, క్యాబ్, ట్రక్ డ్రైవర్స్, రిక్షా వాలాలతో పాటు సాధారణ ప్రజలు ఈ ఆందోళనలో పాలుపంచుకున్నారని స్థానిక మీడియా తెలిపింది.
ఢాకాతో పాటు సుమారు 16 ఇతర నగరాల్లో కూడా ఈ నిరసనలు కొనసాగాయి. అయితే ప్రతిపక్షాల ర్యాలికి వ్యతిరేకంగా అధికార పార్టీ 'పీస్ అండ్ డెవలప్‌మెంట్' పేరుతో ఊరేగింపు చేపట్టింది. కార్యకర్తల్లో ఒకరైన సాజిబ్ హుస్సేన్‌ను అధికార పార్టీకి చెందిన విద్యార్థి విభాగం సభ్యులు కాల్చి చంపారని బిఎన్‌పి ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణలు నెలకొన్నాయి. పోలీసులు షార్ట్‌గన్స్‌తో ఆందోళనకారులపై కాల్పులకు తెగబడ్డారని ఆయన తెలిపారు. అయితే కార్యకర్త మృతి చెందడంతోనే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణకు కారణం కాదని పోలీసులు తెలిపారు.
అవామీ లీగ్ పార్టీకి చెందిన హసీనా 2009 నుండి బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్నారు. అమె పరిపాలనా కాలంలో మానవ హక్కులను దుర్వినియోగం చేయడంతో పాటు భారీగా అవినీతికి పాల్పడినట్లు వార్తలు వెల్లువెత్తాయి. దీంతో మాజీ ప్రధాని ఖలేడా జియా నేతృత్వంలోని ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) సహా పలు పార్టీలు దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చాయి. ప్రధాని రాజీనామా చేయాలని, కేర్ టేకర్ గవర్నమెంట్ (సిటిజి) ఆధ్వర్యంలో ఎన్నికలు జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తక్షణమే ప్రధాని రాజీనామా చేయాలని, పార్లమెంట్‌ను రద్దు చేయాలని బిఎన్‌పి ప్రధాన కార్యదర్శి మిర్జా ఫక్రుల్ డిమాండ్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు అధికారాన్ని తాత్కాలిక ప్రభుత్వానికి అప్పగించాలని స్పష్టం చేశారు.