
జైపూర్ : రాజస్తాన్‌లో దారుణం జరిగింది. తన సోదరుని పట్ల ఓ వ్యక్తి క్రూరంగా ప్రవర్తించాడు. ట్రాక్టర్‌ను తన సోదరునిపై చనిపోయేవరకు 8 సార్లు నడిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. రాజస్తాన్‌లోని భరత్‌పూర్‌లో బహదూర్ సింగ్, అతర్ సింగ్ కుటుంబాల మధ్య చాలా కాలంగా భూ వివాదం ఉంది. బుధవారం ఉదయం బహదూర్ సింగ్ కుటుంబం ట్రాక్టర్‌తో వివాదాస్పద పొలానికి చేరుకుంది. కొంత సమయం తర్వాత అతర్ సింగ్ కూడా తన కుటుంబసభ్యులతో అక్కడకు చేరుకున్నారు. ఇరు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. తుపాకి పేలుడు శబ్దాలు కూడా వినిపించినట్లు గ్రామస్తులు తెలిపారు.
ఈ ఘర్షణలో అతర్ సింగ్ కుమారులలో ఒకడైన నిర్పత్ నేలపై పడిపోయాడు. ఇంతలో సోదరుడి వరుసైన దామోదర్ ట్రాక్టర్‌ను నిర్పత్‌పై నడిపించాడు. మిగిలిన కుటుంబసభ్యులు వారించినప్పటికీ.. వరుసగా 8 సార్లు ట్రాక్టర్‌ను నడిపి ఆ వాహనంతోనే అతనిని క్రూరంగా తొక్కించి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడు దామోదర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని చెప్పారు. ఇరు కుటుంబాల ఘర్షణలో గాయపడిన పది మందిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఐదురోజుల క్రితం కూడా ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగిందని, ఈ ఘటనలో బహదూర్ సింగ్, అతని చిన్న సోదరుడు జనక్ గాయపడినట్లు సమాచారం. దీంతో బహదూర్ సింగ్ కుటుంబం అతర్ సింగ్‌తో పాటు అతని కుమారుడు నిర్పత్ పై కేసు పెట్టినట్లు తెలిపారు.