Aug 21,2022 07:16

'పుష్పం సంపూర్ణ వికాసం కోసం ఎన్నో దశలను దాటి వచ్చినట్లే...మానవ జన్మ సంబుద్ధం కావడానికీ దశలు ఎన్నో ఉంటాయ'ని అంటారు. అలాగే, మనిషి జీవనచక్రంలో వృద్ధాప్యం కూడా ఒకటి. బాదరబందీలన్నీ తీరిపోయి, కొత్త శక్తిని, కొత్త ఆలోచనలను పునరుత్తేజింపజేసుకునే ఒక విలువైన కాలం. 'వృద్ధాప్యం శాపం కాదు, వ్యాధి కాదు...అది రెండో బాల్యం' అంటారు తిరుపతి వేంకట కవులు. బాల్యం, కౌమారం, యవ్వనాన్నీ ఆహ్వానించినంత ఆనందంగా వృద్ధాప్యాన్ని స్వాగతించలేడు మనిషి. నడిప్రాయం లోంచి వృద్ధాప్యంలోకి అడుగిడటానికి మనసు అంగీకరించదు. 'జనాలు నన్ను నిన్నటి వార్తను చూసినట్లు చూడకూడదు. ఇవాల్టి తాజా వార్తలా చూడాలని కోరుకుంటాను' అంటారొక పెద్దాయన. కొందరు వృద్ధాప్యాన్ని శాపంగా భావిస్తే...మరికొందరు ప్రశాంత జీవితం గడిపే అద్భుత వరంగా చూస్తారు. వృద్ధాప్యాన్ని ఎవరూ తప్పించుకోలేరు. వయసు పెరిగేకొద్దీ ఆరోగ్యం క్షీణిస్తుందనుకోవటం, అనారోగ్యంతో బాధపడటం కొందరిలో జరగొచ్చు. కానీ, మన:సామర్థ్యం పదిలపరచుకునే అవకాశం ఎప్పుడూ ఉంది. ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలంటే కొన్ని కచ్చితమైన పద్ధతులు పాటించాల్సిందేనని ఆరోగ్య నిపుణులు సైతం చెబుతుంటారు.
             సాధారణంగా...60 ఏళ్లు దాటగానే శారీరకంగా, మానసికంగా ముసలితనం వచ్చేసిందని భావిస్తుంటారు. కానీ ఇప్పుడు చాలా మంది 60 ఏళ్ల తర్వాత కూడా యాక్టివ్‌గా వుంటున్నారు. సగటు జీవితకాలం బాగా పెరిగింది. అందువల్ల డెమోగ్రఫీ (సైన్స్‌ ఆఫ్‌ పాపులేషన్‌) ఇప్పుడు ముసలివాళ్లను యంగ్‌ ఓల్డ్‌ (60-80), ఓల్డ్‌ ఓల్డ్‌ (80-ఆపైన) అని రెండుగా వర్గీకరించింది. అసలు వృద్ధాప్యం ఎప్పుడొస్తుంది? ఏ వయసు వారిని వృద్ధులు అనాలి? అనే అంశంపై ట్రినిటీ కాలేజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూరో సైన్సెస్‌కి చెందిన శాస్త్రవేత్త ఇయాన్‌ రాబర్ట్‌సన్‌ మానవ మెదడుపై పరిశోధనలు జరిపాడు. 1984 నుంచి 1999 నాటికి మెదడు పనితనం పదేళ్లు పెరిగిందని ఇయాన్‌ నిర్థారించాడు. దీన్నిబట్టి మానసికంగా, శారీరకంగా కూడా 80 ఏళ్ల వరకు మనిషి వృద్ధుడు కాడు, ముసలితనం రాదు అంటాడాయన. మనం మెదడును ఉపయోగించే కొద్దీ దాని సామర్థ్యం పెరుగుతుందని ఆయన వెల్లడించాడు. ఇది మన ఆలోచనలపైన, నేర్చుకోవడంపైన ఆధారపడి వుంటుంది. ముఖ్యంగా 50-80 ఏళ్ల మధ్య వయస్కులు 30 ఏళ్ల పాటు మెదడు ముసలితనాన్ని దూరంగా పెట్టాలంటే...శారీరకంగా మేథోపరంగా చురుకుగా వుండాలి. ఎంత సృజనాత్మకంగా ఆలోచించగలిగితే, మెదడు అంత ఆరోగ్యంగా, చురుకుగా వుంటుంది. నేర్చుకోవడం పెరిగే కొద్దీ నేర్చుకునే సామర్థ్యం కూడా పెరుగు తుంది. 70-80 ఏళ్ల వయస్సులో కూడా చదువుకుంటూ, పిహెచ్‌డిలు చేస్తున్నారు. జార్జ్‌ బెర్నార్డ్‌ షా తన 94వ ఏట 'వై షి వుడ్‌ నాట్‌' అనే నాటకాన్ని రాశాడు. సోఫోక్లిస్‌ తన 89 ఏళ్ల వయస్సులో 'ఈడిపస్‌ ఎట్‌ కొలొనస్‌' అనే ప్రసిద్ధ నాటకం రాశాడు. ఆ మాటకొస్తే... ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్ని, పరిణామాల్ని శాసించే వారిలో వృద్ధులే అధికం.
                 వృద్ధులైపోయామనో, బిడ్డలు పట్టించుకోడంలేదనో బాధ పడకుండా, ఒత్తిడికి లోనవకుండా తమను తాము నిరూపించుకునే దిశగా అడుగెయ్యాలి. నలుగురితో కలిసి మెలసి వుండే వారి మెదడు చాలా చురుకుగా వుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఒత్తిడి మానవ మేధస్సుకు పెద్ద శత్రువు. కోవిడ్‌ వల్ల సోషల్‌ లైఫ్‌... ఆన్‌లైన్‌ లైఫ్‌గా మారిపోయింది. ఉత్సాహం తగ్గిపోయింది. 'ముదిమి వాలనీయకు తలపులపై' అన్నట్టుగా...వయసు పెరుగుతున్నకొద్దీ నేను యంగ్‌ అనుకోవాలి. నేను యంగ్‌ అనుకున్నప్పుడు మనిషి ఆలోచనలు కూడా అలాగే వుంటాయి. అంటే...యవ్వనంలో వున్నారని కాదు, ముసలి వాళ్లయితే కాదని. 'కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు' అంటాడు శ్రీశ్రీ. 'వయసు పెరిగేకొద్దీ పెద్దరికం పొందాలి కానీ, ముసలితనాన్ని కాదు' అంటారు తత్వవేత్త జాన్సన్‌. చాలామంది ఉద్యోగ విరమణ తర్వాత ఇక జీవితం అయిపోయిందనుకుంటారు. ఉద్యోగం నుంచి మాత్రమే విరమణ తప్ప...జీవితం నుంచి కాదని గ్రహించాలి. భారత్‌లో వృద్ధుల సంఖ్య 10 కోట్ల పైగా ఉంది. 2050 నాటికి 32 కోట్లు దాటుతుందని అంచనా. వీరి అనుభవమంతా సమాజానికి ఉపయోగపడాలి. ప్రభుత్వాలు సైతం వృద్ధులన్న చులకన భావం వీడాలి. మనిషి మనుగడకు రహదారి వాళ్లు. మనం నడిచే దారిలో మార్గదర్శకులు వాళ్లు. ఆ సమాజ నిర్మాణానికి రాళ్లెత్తిన శ్రామికులు వాళ్లు. ప్రతి అంశంలోనూ వాళ్లకు అనుభవం, ఆలోచన ఉంటుంది. అలాగే, కాలగమనంలో రేపటి తరానికి మనమూ మార్గదర్శకులం కావాలి. అప్పుడే 'జాతీయ వృద్ధుల దినోత్సవం'కు ఒక పరమార్థం.