ప్రజాశక్తి-కాకినాడ : తమ కోడలు కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని తమను రక్షించాలని జిల్లా కలెక్టర్ కు ఓ వృద్ధ జంట మొరపెట్టుకున్నారు. తమ కుమారుడు నుంచి విడిపోయి కోర్టులో విడాకులు పొందినా సరే తన ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించి తమను భయభ్రాంతులు చేసి చంపేస్తామంటూ తాళ్లరేవు మండలం పటవల గ్రామానికి చెందిన పితాని బాబురావు, సింహాచలం దంపతులు తను ఇద్దరు కుమారులు శ్రీను, గోవిందుతో కలిసి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందించి వేడుకొన్నారు. ఈ సందర్భంగా బాబురావు, సింహాచలం లు కలెక్టర్ కార్యాలయంలో విలేకరులతో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తాళ్లరేవు మండలం పటవల గ్రామంలో నివాసం ఉంటున్నామని తమకు 250 చదరపు గజాల ఇల్లు పూర్వార్జితంగా వచ్చిందన్నారు. తమకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారని వారి అందరికీ వివాహంలు జరిపించగా పెద్ద కుమారుడు పితాని శ్రీనుకు కే గంగవరం మండలం అద్దంపల్లి గ్రామానికి చెందిన సత్యవేణితో వివాహం జరిగిందని వారికి సంజయ్, అజయ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారన్నారు. శ్రీనివాస్ హైదరాబాదులో పేకర్స్ అండ్ మూవర్స్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా సత్యవేణి వారి కుమారులు సంజయ్, అజయ్ లకు లేనిపోని మాటలు చెప్పి తండ్రి శ్రీనుపై పగ పెంచుకునేలా చేసిందన్నారు. దీనిపై వారి మధ్య కుటుంబ స్పర్ధలు రాగా 2021లో కాకినాడ కోర్టు ద్వారా సత్యవేణితో విడాకులు మంజూరయ్యాయన్నారు. పైగా సత్యవేణి పామర్రు పోలీస్ స్టేషన్లో వరకట్నం కేసు, రామచంద్రపురం కోర్టులో మనోవర్తి కేసు కూడా శ్రీనుపై వేసిందన్నారు. తమ కుమారుడు శ్రీనివాస్ హైదరాబాద్ నుండి కాకినాడకు లోడుతో వస్తుండగా సత్యవేణి కుమారులు సంజయ్, అజయ్ లు దాడి చేసి ఇబ్రహీంపట్నం మండలం మాచవరం గ్రామం వద్ద వాహన అద్దాలు పగలగొట్టి చంపే ప్రయత్నం చేయగా శ్రీను పారిపోయినట్లు చెప్పారు. ఈ ఘటనపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో వారిపై కేసు నమోదు అయిందన్నారు.
ఈనెల 12వ తేదీన సత్యవేణి వారి కుమారులు సంజయ్, అజయ్ లు కలిసి తమ ఇంటిపై దాడి చేసి ఆస్తి రాసి ఇవ్వాలని లేని పక్షంలో చంపేస్తామని బెదిరించగా తాను తన భార్య సింహాచలం భయంతో పారిపోయామన్నారు. దీంతో ముగ్గురు కలిసి తమ ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించారని ఈ విషయం కోరంగి పోలీసులుకు ఫిర్యాదు చేసినా కోర్టులో ఉందని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను చంపేందుకు ప్రయత్నం చేస్తున్న సత్యవేణి వారి కుమారుల పైనా పోలీస్ చర్యలను తక్షణమే చేపట్టి తమను రక్షించాలని కోరారు. తన భార్య కేన్సర్ వ్యాధితో బాధపడుతుందని అందువల్ల రక్షణ కల్పించాలని బాబురావు, సింహాచలం దంపతులు జిల్లా కలెక్టర్ ను వేడుకొన్నారు.










