Sep 18,2022 08:12

కథలోకి వెళ్తే.. ఆది (శర్వానంద్‌), శ్రీను (వెన్నెల కిషోర్‌), చైతూ (ప్రియదర్శి) మంచి స్నేహితులు. చిన్నప్పట్నుంచీ కలిసి పెరిగిన వీళ్లు ఒక్కొక్కరూ ఒక్కో సమస్యతో సతమతమవుతూ ఉంటారు. ఎవరిలోనూ సంతృప్తి ఉండదు. ఆది మంచి గిటారిస్ట్‌ కానీ స్టేజ్‌పై పాడాలంటే భయం. ప్రియురాలు వైష్ణవి (రీతూ వర్మ) ఎంత ఎంకరేజ్‌ చేసినా.. ఆది సక్సెస్‌ కాలేకపోతాడు. కళ్ల ముందు అమ్మ (అమల) ఉంటే బాగుండేది అనుకుంటాడు. ఇరవై ఏళ్ల క్రితం (మార్చి 28, 1998) రోడ్డు ప్రమాదంలో తల్లి చనిపోతుంది. అప్పటి నుంచి ఆదికి స్టేజ్‌ ఫియర్‌ ఇంకా ఎక్కువవుతుంది.
ఇక శ్రీను చిన్నప్పుడు సరిగ్గా చదువుకోలేక హౌస్‌ బ్రోకర్‌గా మారతాడు. ఇంగ్లీష్‌ అస్సలు రాదు. చిన్నప్పుడు మంచిగా చదువుకొని ఉంటే బాగుండేదని బాధపడుతుంటాడు. ఇక మూడో వ్యక్తి చైతూకి పెళ్లి సమస్య. మంచి అమ్మాయిని చూసి, పెళ్లి చేసుకోవాలకుంటాడు. కానీ ఏ అమ్మాయి నచ్చదు. చిన్నప్పుడు తనను ఇష్టపడిన సీతను ఎందుకు ప్రేమించలేదా అని ప్రతి క్షణం బాధపడుతుంటాడు.
ఇలా బాధపడుతున్న ఈ ముగ్గురు స్నేహితులకీ సైంటిస్ట్‌ రంగీ కుట్టా పాల్‌ (నాజర్‌) పరిచయమవుతాడు. అతడు ఇరవయ్యేళ్లుగా టైమ్‌ మెషిన్‌ కనిపెట్టడం కోసం కష్టపడుతుంటాడు. చివరికి తాను కనిపెట్టిన టైమ్‌ మెషిన్‌తో గతంలోకి వెళ్లి, తమ తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశాన్ని ఆది, శ్రీను, చైతూలకి ఇస్తాడు. వారు కూడా తాము చేసిన తప్పులను సవరించుకోవాలని భావించి, గత కాలంలోకి వెళ్లేందుకు రెడీ అవుతారు. మరి వాళ్లు గతంలోకి వెళ్లి ఏం చేశారు? తప్పుల్ని సరిదిద్దుకున్నారా? భవిష్యత్తుని గొప్పగా మార్చుకున్నారా? వారికి చివరికి ఏం అర్థమైందనేది మిగతా కథ.
టైమ్‌ మెషిన్‌ కథలు టాలీవుడ్‌కి కొత్తేమీ కాదు. 'ఆదిత్య 369' మొదలుకొని '24', 'బింబిసార'.. ఇలా క్రమం తప్పకుండా వస్తూనే ఉన్నాయి. ఫాంటసీతో కూడిన ఈ కథల్లో ఓ ప్రత్యేకమైన మ్యాజిక్‌ ఉంటుంది. మిగతా అన్ని జోనర్లలాగా కావివి. పక్కా స్క్రిప్ట్‌, లాజిక్‌తో రూపొందించాల్సి ఉంటుంది. కాల ప్రయాణంతో కూడిన కథే అయినా 'ఒకే ఒక జీవితం' గతంలో వచ్చిన సినిమాలకి పూర్తి భిన్నంగా ఉంటుంది. అమ్మ ప్రేమతో ముడిపెట్టి ఈ కథని అల్లాడు దర్శకుడు. ఆది, శ్రీను, చైతూల పాత్రలని పరిచయం చేస్తూ కథలోకి తీసుకెళ్లిన దర్శకుడు.. మంచి ఫన్‌ క్రియేట్‌ చేసేలా సన్నివేశాల్ని రాసుకున్నాడు. ముఖ్యంగా వెన్నెల కిషోర్‌ పాత్ర, ప్రియదర్శి లవ్‌ట్రాక్‌ ఆకట్టుకుంటుంది. విరామ సమయంలో వచ్చే సన్నివేశాలు ఎవరూ ఊహించని విధంగా అనిపిస్తాయి. ద్వితీయార్ధంలో పూర్తిగా భావోద్వేగాలే ప్రధానంగా సాగుతుంది. అమ్మ ప్రేమని పొందడం కోసం పరితపించే ఆది చుట్టూ సాగే ఆ సన్నివేశాలు హృదయాల్ని బరువెక్కిస్తాయి. గతంలోకి వెళ్లి తన అమ్మానాన్నలు, ఇల్లుని చూసుకోవడం, అమ్మ చేతి వంట రుచి చూడటం వంటి సన్నివేశాలు మనసుల్ని హత్తుకుంటాయి. ప్రథమార్ధమంత వేగం ద్వితీయార్ధంలో లేకపోయినా, ఆ ప్రభావం పెద్దగా కనిపించదు. టైమ్‌ మెషిన్‌ నేపథ్యంలో వచ్చిన కథల్లో గుర్తుండిపోయే మరో మంచి సినిమా ఇది.
శర్వానంద్‌, వెన్నెలకిషోర్‌, ప్రియదర్శి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. వీళ్ల బాల్యాన్ని గుర్తు చేసే పాత్రల్లో నటించిన చిన్నారులు కూడా ఆకట్టుకున్నారు. శర్వానంద్‌ సెంటిమెంట్‌ ప్రధానంగా సాగే సన్నివేశాల్లో తనలో ఎంత గొప్ప నటుడు ఉన్నాడో మరోసారి చాటి చెప్పాడు. అమల తన అనుభవాన్నంతా రంగరించి, నటించారు. చాలా రోజుల తర్వాత ఆమె తెరపై ఓ బలమైన పాత్రలో కనిపించారు. ఆమె కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా ఇది. శర్వానంద్‌కి కూడా అంతే. రీతూవర్మ పాత్ర, ఆమె అభినయం కూడా ఆకట్టుకుంటుంది. నాజర్‌ తనకి అలవాటైన పాత్రలోనే కనిపించారు. సాంకేతికత విషయానికొస్తే ప్రతీ విభాగం చక్కటి పనితీరుని కనబరిచింది. ముఖ్యంగా సంగీతంతో సినిమాకి ప్రాణం పోశారు జేక్స్‌ బిజోరు. సుజీత్‌ సారంగ్‌ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. దర్శకుడు శ్రీకార్తిక్‌ కథని తెరపైకి తీసుకొచ్చిన విధానంలోనూ ఓ ప్రత్యేకత కనిపించింది. నిర్మాణం బాగుంది.
టైటిల్‌ : ఒకే ఒక జీవితం
నటీనటులు : శర్వానంద్‌, అమల,రీతూవర్మ, వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి, నాజర్‌
సంగీతం : జేక్స్‌ బిజోరు
సినిమాటోగ్రఫీ : సుజిత్‌ సారంగ్‌
ఎడిటింగ్‌ : శ్రీజిత్‌ సారంగ్‌
మాటలు : తరుణ్‌ భాస్కర్‌
నిర్మాత : ప్రకాశ్‌బాబు, ప్రభు
కథ, కథనం, దర్శకత్వం : శ్రీ కార్తిక్‌