Jan 03,2021 13:03

ఒంటరి మహిళగా ఆమె పిల్లల బాధ్యతను భుజానేసుకుని, వారిని కంటికి రెప్పలా కాపాడటం అనేది చిన్న విషయం కాదు. అలాంటి తల్లులకు తోడు కావాలనే ఉద్దేశ్యంతో పిల్లలే వారికి పెళ్లి చేసిన సందర్భాలను కూడా మనం చూశాం. కానీ ఒకే పందిరిలో తల్లీకూతుళ్ల వివాహం జరగడం లాంటి సంఘటనలు మాత్రం అరుదు. ఉత్తరప్రదేశ్‌లో అలాంటి అరుదైన సంఘటనే జరిగింది.
     త్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన బెలిదేవికి ఐదుగురు సంతానం. ఆమె భర్త 25 ఏళ్ల క్రితం చనిపోయారు. అప్పటి నుంచి ఐదుగురు పిల్లలే సర్వస్వంగా జీవిస్తుందామె. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ పిల్లలను పెంచి పెద్ద చేసింది. వారిలో ఇద్దరు కొడుకులకు, కూతుళ్లకు వివాహం చేసింది. ఈ మధ్య చిన్నకూతురు ఇందూకు రాహుల్‌ అనే వరుడితో వివాహం నిశ్చయమైంది.
   'జీవితమంతా పిల్లల కోసం బతికాను ఇకనైనా నా కోసం నేను బతకాలి!' అనుకుంది మనసులో బెలిదేవి. ఆ ఆలోచనను ఆచరణలో పెడుతూ తన భర్త సోదరుడు జగదీష్‌ని వివాహం చేసుకోవాలని ఆమె నిర్ణయించుకుంది.
    'మా చిన్నప్పటి నుంచి అమ్మ, బాబాయే మమ్మల్ని చూసుకున్నారు. మా అమ్మ ఇప్పటికి ఒక మంచి నిర్ణయం తీసుకుంది. నాన్న చనిపోయినప్పటి నుంచి బాబాయి మా మంచిచెడుల్లో అండగా ఉన్నారు. ఆయన వివాహం కూడా చేసుకోలేదు. ఇప్పుడు వారు ఒకరినొకరు చూసుకుంటామంటే మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ వివాహ విషయంలో మా తోబుట్టువులలో ఎవరికీ సమస్య లేదు. ఆమె తన జీవితాన్ని కొత్తగా ప్రారంభించబోతోంది. తన జీవితం మరింత ఆనందంగా ఉండాలనే మేము కోరుకుంటున్నాం!' అంటోంది బెలిదేవి చిన్న కుమార్తె ఇందు.
    ఈ మధ్య గోరఖ్‌పూర్‌లో సామూహిక వివాహ యోజన లో భాగంగా 63 జంటలు ఒక్కటయ్యారు. వారిలో బెలిదేవి, ఆమె కుమార్తె జంటలు కూడా ఉన్నాయి. నూతన జీవితంలోకి అడుగు బెట్టిన బెలిదేవికి మనమూ శుభా కాంక్షలు చెప్పేద్దాం.