- కొట్టొచ్చిన ఆర్ అండ్ బి శాఖ నిర్లక్ష్యం
ప్రజాశక్తి -: తాళ్లరేవు : ప్రధాన సాగునీటి కాలువలో చెత్త పేరుకు పోతే సాగునీరు పారేదెలా అంటూ రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటి కాలువలకు నీరు విడుదల చేసి 23 రోజులు గడిచిన నేటికీ నారుమల్లు వేయడానికి కూడా పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు. ధవలేశ్వరం నుంచి వస్తున్న అరకొరా సాగునీరు ఇలా అక్కడక్కడ ప్రధాన కాలువలో పేరుకుపోతున్న చెత్త వల్ల సాగునీటికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. తాళ్లరేవు మండలం ఇంజరం కాజులూరు మండలం కోలంక వంతెన వద్ద ప్రధాన సాగునీటి కాలువలో చెత్త పేరుకుపోవడంతో తాళ్లరేవు మండలానికి వచ్చే సాగునీరు పూర్తిస్థాయిలో కిందికి రావడం లేదు. దీనికి తోడు ఇటీవల అదే ప్రాంతంలో ఉన్న కల్వర్టు పగిలిపోవడం వల్ల నీరు వృధాగా పోతుంది. ఇంజరం కోలంక వంతెన శిధిలావస్థకు చేరుకోవడంతో తాత్కాలికంగా కల్వర్టు నిర్మించి సుమారు రెండేళ్లు గడుస్తుంది. ఈ కల్వర్టు వద్ద ప్రతిరోజు చెత్త తీయాల్సిన ఆర్ అండ్ బి శాఖ అధికారులు నిర్లక్ష్యంతో సాగునీరు కోలంక వంతెన వద్ద నిలిచిపోయింది. దీంతో తాళ్ళరేవు మండలానికి రావలసిన వందలాది క్యూసెక్కుల నీరు కోలంక వద్ద ఆగిపోవడంతో కోరంగి శివారు భూములకు నేటికీ సాగునీరు రాలేదు. దీంతో రైతాంగం ఆందోళన పడుతున్నారు. నీటిపారుదల శాఖ, ఆర్. అండ్. బి. శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి సాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని రైతాంగం కోరుతున్నారు.










