Aug 21,2022 12:12

మట్టి చెట్టు మీంచి
రెక్కలు విప్పుకున్న తీగపిట్టలు
చూస్తుండగానే
చూపుల పొలిమేరల్ని దాటి ఎగిరిపోతాయి

కత్తి పడవలుగా మారి కాగితాలు
పాత పుస్తకం గుమ్మం దాటి కదిలిపోతాయి
ఇంకిపోయిన నది కన్నా
సముద్రాన్ని అతిగా ప్రేమించే నదే లోతుగా గాయం చేస్తుంది

కొత్త పాటలు నేర్చుకున్న
లేత పిట్టల కచేరీ మధ్య కొన్నాళ్లు ముసలి చెట్టు కూర్చున్నట్టు
ఒక శ్రోతలా కూర్చోవడం బాగుంటుంది
దాహం వేయడానికీ
దప్పిక తీరడానికీ మధ్య
కొంత విరామాన్ని
దొరకబుచ్చుకోవడం బాగుంటుంది

పరుగుపందెంలో ఆటగాడి పాదాల కిందకు సరిపడా
నేలను ఇవ్వలేని మైదానం పడే తప్పనిసరి దిగులే కదా ఓడిపోవడమంటే!
అప్పుడప్పుడూ ఓడిపోవడమూ బాగుంటుంది.

సాంబమూర్తి లండ
96427 32008