Jan 12,2023 08:13
  • బ్రిటీష్‌ ప్రభుత్వం ఇచ్చిన భూముల రిజిస్ట్రేషన్‌కు అవకాశం
  • ఫీల్డ్‌ లేబర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ భూములకు రక్షణ కరువు

ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : రిజిస్ట్రేషన్ల నిషేధి జాబితా 22 'ఎ' నుంచి కండిషన్‌ పట్టా భూములకు విముక్తి కల్పిస్తున్నామనే పేరుతో దళితుల, పేదల భూములను భూస్వాములకు, బడాబాబులకు ప్రభుత్వం ధారాదత్తం చేస్తోంది. దళితులు, పేదల భూములను ఆక్రమించి అనుభవిస్తోన్న భూస్వాములు, బడాబాబులకు రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు కేసులను, గతంలో ఈ భూములపై ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకుండా కొత్తగా ప్రభుత్వం ఇటువంటి ఉత్తర్వులివ్వడం చర్చనీయాంశమైంది. కృష్ణా జిల్లా నందివాడ మండలంలోని 14 గ్రామాల్లో 1107.01 ఎకరాలను ఫీల్డ్‌ లేబర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ పేరుతో బ్రిటీష్‌ ప్రభుత్వం 1921లో దళితులు, ఇతర పేదలకు పంపిణీ చేసింది. అనమనపూడిలో 34.31 ఎకరాలు, అరిపిరాలలో 5.29, దండిగానిపూడిలో 81.64, ఇలపర్రులో 205.21, జనార్థనపురంలో 0.16, కుదరవల్లిలో 35.56, నందివాడలో 26.12, నూతులపాడులో 1.46, పెదవిరివాడలో 18.90, పోలుకొండలో 406.37, రుద్రపాకలో 201.75, తమిరిశలో 43.14, తుమ్మలపల్లిలో 16.70, వెన్ననపూడిలో 30.04 ఎకరాల పంపిణీ జరిగింది. 1995 తర్వాత ఆక్వా సాగు విస్తరించే క్రమంలో ఈ భూములను బడాబాబులు ఆక్రమించారు. వాటిని తిరిగి తమకు ఇవ్వాలని ఫీల్డ్‌ లేబర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ సభ్యుల వారసులు గత కొన్నేళ్లుగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆయా గ్రామాల్లోని బాధితులు ఆందోళనలు చేస్తున్నారు. పిఒటి యాక్టు 9/77 ప్రకారం దళితులకు పంపిణీ అయి 1995 తర్వాత ఆక్రమణలు, అమ్మకాలు జరిగిన భూములకు సంబంధించి అమ్మకాలు, కొనుగోళ్లు చెల్లవని గతంలోనే పలువురు జిల్లా అధికారులు స్పష్టం చేశారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ఈ భూములను షరతులుగల పట్టాలుగా పేర్కొంటూ నిషేధిత భూముల జాబితా 22 ఎ (ఇ)లో చేర్చారు. ఇటీవల ఈ భూములకు రిజిస్ట్రేషన్‌ హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం 2022 అక్టోబర్‌ 11న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దళితులు, పేదలకు చెందిన ఫీల్డ్‌ లేబర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ భూములు ఆక్రమించిన బడాబాబులకు ఇది వరంగా మారింది. ఎటువంటి పరిశీలనా లేకుండానే పెద్దలకు వీటిని కట్టబెట్టేందుకు అధికారులు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

  • అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అనుమతి!

ఇలపర్రు రెవెన్యూ గ్రామంలో 167 ఎకరాల భూమి కోర్టు వివాదంలో ఉంది. భూస్వామి ఆక్రమించిన 17 ఎకరాలను ప్రభుత్వం 2007లో స్వాధీనం చేసుకుంది. ఆర్‌డిఒ, జాయింట్‌ కలెక్టర్‌ కోర్టులు సైతం ఈ భూమిని క్లయిం చేసే హక్కు భూస్వామికి లేదని తేల్చాయి. ఈ గ్రామంలోని ఫీల్డ్‌ లేబర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ భూములను తిరిగి తమకు పంపిణీ చేయాలని సొసైటీ సభ్యుల వారసులు 2014 నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు. అప్పటి నుండి 95 ఎకరాల భూమి బీడుగా ఉంది. 51 ఎంక్వైరీలో ఈ భూముల్లోని 70 ఎకరాలు ఎటువంటి ఆధా రమూ లేకుండా పెద్దలు సాగు చేసుకుంటున్నారని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆక్రమించిన పెద్దలే ఈ భూములను వారి పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి జిల్లా అధికారులు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగి వివాదాస్పద భూములకు అధికారులు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారనే ఆరోపణలు వస్తున్నాయి.

  • ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి

9/77 చట్టం ప్రకారం 1954 తర్వాత దళితులకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూముల కొనుగోలు, అమ్మకాలు నిషేధం. నందివాడ మండలంలో 1995 తర్వాత సొసైటీ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. పేదలకు దక్కాల్సిన ఈ భూములను పెద్దలకు కట్టబెట్టేలా ప్రభుత్వాధికారులు ఉత్తర్వులివ్వడం సరికాదు. వెంటనే ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి.
 - మురాల రాజేష్‌, వ్యవసాయ కార్మిక సంఘం కృష్ణా జిల్లా కార్యదర్శి