
వినాయక చవితి ఉత్సవాలకు యావత్ దేశం సిద్ధమవుతోంది. పండగలు, సంప్రదాయాలు పాటించినా, సామాజిక బాధ్యతను నెరవేర్చాల్సిన తరుణమిది. ప్రకృతిలో మమేకమవుతూ నేల-నీరు, చెట్టు - పుట్ట తదితర ప్రకృతి శక్తులన్నింటినీ ఆరాధిస్తుంటారు. ఈ వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కనబెట్టి, పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యమిద్దాం.
ప్రకృతి అంటే మన చుట్టూ ఉండే పంచ భూతాలు. భూమి, నీరు, నింగి, అగ్ని, వాయువు. వీటితో మనిషికి, పర్యావరణానికీ విడదీయరాని బంధం ఉంది. వాటిని కాలుష్యం నుంచి కాపాడుకోవాలనే గొప్ప సంకల్పం ఈ పండుగలో ఇమిడి ఉంది. ఉదాహరణకు చెరువులో పూడిక తీయడం కోసం మట్టిని తీస్తాం. అలా తీసిన మట్టితో వినాయకుడి విగ్రహాన్ని తయారుచేసుకుంటాం. తొమ్మిదిరోజుల పాటు పూజలు చేస్తాం. మళ్లీ అదే చెరువులో గణపతిని నిమజ్జనం చేస్తాం. చెరువు మట్టిని మళ్లీ జాగ్రత్తగా చెరువుకే అప్పగించేస్తాం. కోట్లాది మంది ప్రజలు ఆచరించే నిమజ్జనంలో అంతర్లీనంగా పర్యావరణ హితం దాగి ఉందనడానికి ఇదే నిదర్శనం.
ఇంకాస్త గట్టిగా చెప్పాలంటే.. వినాయకచవితి భాద్రపద నెల్లో వస్తుంది. ఈ సమయంలో సహజంగానే వానలు పడతాయి. వానలతో భూదేవి పులకిస్తుంది. ఆకులు, పూలతో చెట్లు కొత్త అందాలను సంతరించుకుంటాయి. ఇలా ఆకులు, పువ్వులు, పండ్లు అన్నీ ప్రకృతి ఇచ్చిన వాటిల్లోనే ఉంటాయి. ఇలా ప్రకృతి ప్రత్యేకంగా అందించిన 21 రకాల పత్రి, గరికతో మట్టి గణపతికి పెడతాం.. గణనాథుడు అంటే మనిషి అవతారం.. అటు ఆకులు, ఇటు పూలు..పండ్ల మధ్య కొలువైన గణపతిని చూస్తే ఈ ప్రకృతిలో మనమూ భాగమేనన్న అర్థాన్ని తెలియజెప్తుంది ఈ పండుగ. అందుకే గణపతి పూజను ప్రకృతి సంబరంగానే చూడాలి.

హాని కారకాలు వద్దు..
వివిధ రకాల రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారుచేసే విగ్రహాల వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. మనం చేసే సంబరం వల్ల మరొకరికి ముప్పు వాటిల్లడం మంచిది కాదు. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే.. మట్టి గణపతి కోసం గట్టి సంకల్పం తీసుకోవచ్చు. అందుకే మట్టి ప్రతిమలనే వాడాలి. గొప్పలకు పోయి మనకు మనమే నష్టం చేసుకునేకంటే.. భవిష్యత్తులో అనేక ప్రకృతి విపత్తులకు మనమే కారకులమవుతాం.
ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చ సాగుతోంది. దీనికి అంత ప్రాధాన్యత వచ్చిందంటే.. మనవల్ల ఎంత నష్టం జరుగుతుందో ఇప్పటికే తెలిసుండాలి. పర్యావరణాన్ని పరిరక్షించి, భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, అందమైన సమాజాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది.
ఆకులు, అలముల్లో ఔషధగుణాలు

ప్రకృతి సహజంగా దొరికే ఆకులు అలముల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అనేకరకాల రోగాలకు ఇవి మందుగా ఉపయోగపడతాయి. ఆకులు, అలములను పత్రిగా వాడటం వల్ల ఏ ఆకుల్లో ఏ ఔషధ గుణాలు ఉన్నాయో తెలుస్తుంది. చిన్ని చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఇంటి ఆవరణలో సులభంగా దొరికే ఆకులతోనే ప్రకృతి వైద్యం చేసుకోవచ్చు. ఆరోగ్య సమస్యలకూ అడ్డుకట్ట వేయవచ్చు.
అసలైన అర్థం ఇదే..!
విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలు తొలగించేవాడు అని మనం చెప్పుకుంటుంటాం. మరి అలాంటి విఘ్నేశ్వరుడి పేరుతో మనం ప్రకృతి ఎన్ని విఘ్నాలు కలిగిస్తున్నామో ఒకసారి మననం చేసుకుంటే మంచిది. నవరాత్రుల పేరుతో మనుషులను, మూగ జీవాలను ఇబ్బందులకు గురి చేయమని ఏ దేవుడూ చెప్పలేదు. చేతనైతే ఇంత సాయం చేయాల్సింది పోయి.. తెలిసీ తెలిసీ ఇతరులను ఇబ్బందుల్లో పడేద్దామా..? మట్టి గణపతులను పూజించడంతోనే సరిపోదు.. వీధుల్లోని రహదారులన్నీ ఆక్రమించి అడ్డదిడ్డంగా మండపాలు నిర్మించి, సామాన్య మానవుడికి ఇబ్బంది కలిగించే పనులనూ మానుకోవాలి. కాలనీ వాళ్లంతా కలసి ఒకే గణపతిని పెట్టుకుంటే.. దేవుడు దీవించడా? ఊరు వాళ్లంతా కలిసి ఒక్కటే విగ్రహాన్ని పూజిస్తే గణపతి ఊరుకోడా? ఊరేగింపు పేరుతో టన్నుల కొద్దీ టపాసులు కాల్చి, వాయు కాలుష్యం, శబ్ధ కాలుష్యం చేయడం ఎంతవరకూ సమంజసమో ఆలోచించండి.
చైతన్యం పెరగాలి..
మట్టి గణపతిని పూజించి, పర్యావరణాన్ని కాపాడాలని ప్రభుత్వాలు, పలు స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. దీన్ని మరో జాతీయ ఉద్యమంలా చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎలాంటి మంచిపనికైనా మొదట్లో కొన్ని ఇబ్బందులు తప్పవు. ఆచరిస్తే ఇది పెద్ద కష్టమైన పనేం కాదు. భూమిని చీల్చుకొస్తూ పుట్టే మొలక పచ్చనిమొక్కలా ఎదిగినట్టు.. ఒక మంచి పండుగ సందర్భంగా మొగ్గ తొడిగిన ఈ ఆలోచన ఉన్నత ఆశయాల దిశగా ఎదిగేట్టు ఇప్పుడే ప్రయత్నం ప్రారంభిద్దాం..
వివిధ సంస్థల ప్రోత్సాహం..
పర్యావరణ పరిరక్షణలో భాగంగా వివిధ సంస్థలు, స్టార్టప్‌లు మట్టి విగ్రహాలు తయారుచేసి, అమ్ముతున్నాయి. వోకల్ ఫర్ లోకల్, గ్రీన్ ఛాలెంజ్‌కు పెరుగుతున్న సమయంలో ప్రజల్లో అవగాహన పెరిగి, ఈసారి మట్టి వినాయకులపై ఆసక్తి పెరుగుతోంది. మట్టి గణపతి అయితే ఇంట్లోనే పూజలు చేసి, కుండీలో నిమజ్జనం చేయొచ్చు. ఇటీవలి కాలంలో ఎక్కువ మంది సీడ్స్‌తో తయారుచేసిన వినాయక విగ్రహాలనే కొనేందుకు ఇష్టపడుతున్నారు. పూజల తర్వాత కుండీలో నిమజ్జనం చేస్తే అందులో నుంచి మొక్క వస్తుంది.
కలిసి ఉండాలన్నదే సందేశం..

ఎవరికి వారుగా బతికే ఊరి ప్రజలను ఐక్యంగా ఉంచడమనే సందేశం వినాయక నవరాత్రుల్లో ఉంది. వినాయకుడి విగ్రహం పెట్టడం దగ్గర నుంచి నిమజ్జనం చేసేంతవరకూ తొమ్మిదిరోజుల పాటు గ్రామ ప్రజలు కుల, మతాలకు అతీతంగా ఒక చోట గుమికూడతారు. సాయంత్రం పూట జడకొప్పు కోలాటం, చెక్క భజన వంటి ఎన్నో కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే ఉత్సవాల్లో ముస్లిం సోదరులూ ఎంతో ఉత్సాహంగా భాగస్వాములవుతారు. అనే ప్రాంతాల్లో మత సామరస్యానికి ఇది ప్రతీక. ఈ కోణంలో నుంచి చూస్తే నవరాత్రి ఉత్సవాలు ఓ సాంఘిక సంబురం కూడా.
ప్రభుత్వ నిబంధనలు ఇవీ..

గణేష్ విగ్రహ ప్రతిష్ఠ, పందిళ్లు / మంటపాలు ఏర్పాటు చేసుకోవాలి అనుకున్న వారు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఐదు లేదా అంతకంటే ఎక్కువమంది సభ్యులతో కమిటీగా ఏర్పడి, వారి పూర్తి వివరాలతో దగ్గరలో ఉన్న పోలీస్‌స్టేషన్‌లో పర్మిషన్ తీసుకోవాలి.
- వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకునే వారు సంబంధిత స్థల యజమాని లేదా పంచాయితీ, గ్రామ అధికారుల అనుమతి తప్పనిసరి.
- వీటితో పాటు ఫైర్, విద్యుత్ శాఖల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.
- పందిళ్లు / మంటపాల్లో అగ్నిప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్ వైర్లను, ప్రకాశవంతమైన లైట్ల వినియోగంలో జాగ్రత్త వహించాలి.
- పందిళ్ల వద్ద శబ్ధకాలుష్య క్రమబద్ధీకరణ, నియంత్రణ నింబంధనలు-2000 ప్రకారం స్పీకర్లను ఉపయోగించాలి. ఉదయం ఆరు గంటల నుండి రాత్రి 10 గంటల వరకూ మాత్రమే వాడాలి.
- రాత్రి వేళల్లో ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిధులు కాపలా ఉండాలి.
- విగ్రహం పెట్టే ప్రదేశం రోడ్డుపై ఉండకూడదు. బ్యానర్లు / ఫ్లెక్సీలు రోడ్డుపైన రాకపోకలకు అంతరాయం లేకుండా చూసుకోవాలి.
- ఊరేగింపు సమయంలో పోలీసు వారి అనుమతి లేకుండా వేషధారణలు, ఎక్కువ శబ్ధము వచ్చే వాయిద్యాలు, డి.జే, బాణసంచా వినియోగం తదితరాలకు అనుమతి ఉండదు.
- కేటాయించిన ప్రదేశం, మార్గములోనే నిమజ్జనకు ఏర్పాటు చేసుకోవాలి.
- ట్రాఫిక్ ఇబ్బంది కలుగకుండా రద్దీని నివారించేందుకు కమిటీ సభ్యులు, ఉత్సవ నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలి.
ఉదయ తేజశ్విని ఆకుల
79897 26815