Jan 22,2021 21:36

ముంబయి: ఆస్ట్రేలియా సిరీస్‌తో టీమిండియాకు ఓ ఆణిముత్యంలాంటి గొప్ప బౌలర్‌ దొరికాడని హైదరాబాద్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌నుద్దేశించి కోచ్‌ రవిశాస్త్రి తెలిపాడు. ట్విట్టర్‌ వేదికగా శుక్రవారం రవిశాస్త్రి భారతజట్టు టెస్ట్‌ సిరీస్‌ను చేజిక్కించుకోవడంలో సిరాజ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడని ప్రశంసించాడు. తండ్రి మరణం కుంగదీసినా, జాత్యహంకార వ్యాఖ్యలు ఎదుర్కొన్నా.. వాటన్నింటినీ వికెట్లు తీసేందుకు ఉపయోగించుకున్నాడని వెల్లడించాడు. జట్టుకెంతో మేలుచేశాడని కితాబిచ్చాడు. టీమిండియా యువ క్రికెటర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఆస్ట్రేలియా సిరీస్‌ ద్వారా హీరోగా మారిపోయాడు. దుబారు నుంచి ఆసీస్‌కు వెళ్లిన వారం రోజులకే తండ్రి మహ్మద్‌ గౌస్‌ హైదరాబాద్‌లో మరణించారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు, క్వారంటైన్‌ నిబంధనలు, దేశానికి ఆడాలన్న తండ్రి కలను నెరవేర్చేందుకు అతడు నగరానికి రాలేదు. తండ్రి అంత్యక్రియలకు హాజరవ్వలేదు. ఆ బాధను భరిస్తూనే క్రికెట్‌ ఆడాడు. మెల్‌బోర్న్‌ టెస్టులో సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు. సిడ్నీలో జాతి వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నాడు. ఇక కీలకమైన నాలుగో టెస్టులో అతడు జట్టు బౌలింగ్‌ దళానికి నాయకత్వం వహించాడు. సీనియర్లు లేకపోవడంతో కుర్రాళ్లకు సలహాలిస్తూ నడిపించాడు. ఐదు వికెట్ల ఘనతనూ అందుకున్నాడని పేర్కొన్నాడు.
                                                                    అంపైర్లు వెళ్లిపోమన్నారు: సిరాజ్‌
మహ్మద్‌ సిరాజ్‌ హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ తనపై, జస్ప్రీత్‌ బుమ్రాపై ఆసీస్‌ ప్రేక్షకులు వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేశారని వెల్లడించాడు. తమపై ప్రేక్షకులు వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడంతో అంపైర్లకు ఫిర్యాదు చేశామని, అయితే అంపైర్లు అనూహ్యంగా మ్యాచ్‌నుంచి వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోమని సలహా ఇచ్చారని సిరాజ్‌ చెప్పాడు. కానీ కెప్టెన్‌ రహానే అందుకు అంగీకరించలేదని, దీంతో అలాగే మ్యాచ్‌ కొనసాగించామని వివరించాడు. తాము ఆటను ఎంతో గౌరవిస్తామని, అందువల్ల అలా వెళ్లిపోవడం తమకిష్టం లేదని రహానే తెలిపాడని, అది చాలా గొప్ప విషయం' అని సిరాజ్‌ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తనపై ప్రేక్షకులు చేసిన వ్యాఖ్యలు తనను మానసికంగా మరింత దృఢంగా మార్చాయని సిరాజ్‌ చెప్పుకొచ్చాడు.