Sep 20,2023 14:37

అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) ప్రకటించిన తాజా వన్డే బౌలర్ల జాబితాలో హైదరాబాదీ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ సత్తా చాటాడు. ఐసిసి విడుదల చేసిన వన్డే ర్యాకింగ్స్‌లో సిరాజ్‌ ఏకంగా ఎనిమిది స్థానాలను మెరుగుపరుచుకొని అగ్రస్థానానికి చేరుకున్నాడు. 694 రేటింగ్‌ పాయింట్లతో టాప్‌ వన్‌ బౌలర్‌గా నిలిచాడు. ఆసియా కప్‌ ఫైనల్లో శ్రీలంకపై 21 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టి కెరీర్‌ బెస్ట్‌ బౌలింగ్‌ను నమోదు చేయడంతో అతని ర్యాంక్‌ మెరుగైంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా బౌలర్‌ హేజిల్‌వుడ్‌ను వెనక్కి నెట్టాడు. తాజా వన్డే బౌలర్ల జాబితాలో హేజిల్‌వుడ్‌ 678 పాయింట్లతో రెండో స్థానంలో నిలువగా.. ట్రెంట్‌ బౌల్ట్‌(న్యూజిలాండ్‌) 677 పాయింట్లతో మూడోస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక వన్డే బ్యాటర్స్‌ జాబితాలో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌ అగ్రస్థానంలో ఉండగా.. భారత ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ రెండోస్థానంలో, విరాట్‌ కోహ్లీ ఎనిమిదో స్థానంలో, రోహిత్‌ శర్మ పదో స్థానంలో నిలిచి టాప్‌-10లో కొనసాగుతున్నారు.

ఐసీసీ తాజా వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌ టాప్‌-5లో ఉన్నది వీళ్లే
1. మహ్మద్‌ సిరాజ్‌- ఇండియా- 694 పాయింట్లు
2. జోష్‌ హాజిల్‌వుడ్‌- ఆస్ట్రేలియా- 678 పాయింట్లు
3. ట్రెంట్‌ బౌల్ట్‌- న్యూజిలాండ్‌- 677 పాయింట్లు
4. ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌- అఫ్గనిస్తాన్‌- 657 పాయింట్లు
5. రషీద్‌ ఖాన్‌- అఫ్గనిస్తాన్‌- 655 పాయింట్లు.