Jan 21,2021 21:12

ముంబయి: ఆస్ట్రేలియా పర్యటనను దిగ్విజయంగా పూర్తి చేసుకొని తిరిగి భారత్‌కు చేరుకున్న క్రికెటర్లు ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాలకు చేరిన ఆటగాళ్లకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. పువ్వులు చల్లుతూ.. డప్పులు వాయిస్తూ.. తిలకం దిద్దారు. ముంబయి చేరిన తాత్కాలిక కెప్టెన్‌ అజింక్య రహానేకు ఊహించని రీతిలో స్వాగతం లభించింది. విమానాశ్రయంలోనే గెలుపు సూచికగా భారీ కేక్‌ కట్‌ చేశాడు. ఈ కార్యక్రమంలో ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ అధికారులు, ప్రెసిడెంట్‌ విజరు పాటిల్‌, అపెక్స్‌ కౌన్సిల్‌ సభ్యులు అజింక్యా నాయక్‌, అమిత్‌ దాని మరియు ఉమేష్‌ ఖన్విల్క తదితరులు పాల్గన్నారు. గురువారం ఉదయం ముంబయికి రహానేతోపాటు రోహిత్‌ శర్మ, శార్దూల్‌ ఠాకూర్‌, కోచ్‌ రవిశాస్త్రి, ఓపెనర్‌ పృథ్వి షా తదితరులు చేరుకున్నారు. పంత్‌ నేరుగా ఢిల్లీకి వెళ్ళగా.. నెట్‌బౌలర్‌గా వెళ్ళి మూడు ఫార్మాట్‌లలో అరంగేట్రం చేసిన నటరాజన్‌ బెంగళూరు విమానాశ్రయంనుంచి చెన్నైకు ఆ తర్వాత సేలమ్‌కు చేరుకున్నాడు.
                                                       ముంబయి ఆటగాళ్లు హోం క్వారంటైన్‌కు
ముంబయి చేరుకున్న ఐదుగురు టీమిండియా ఆటగాళ్లకు మున్సిపల్‌ కమిషనర్‌ ఇక్బాల్‌ సింగ్‌ చాహల్‌ క్వారంటైన్‌కు వెళ్లాలని సూచించారు. ఏడు రోజులు తప్పనిసరిగా హోం క్వారంటైన్‌లోనే ఉండాలని, విమానాశ్రయంలోనే ఆర్‌టిపిసిఆర్‌ పరీక్షలు చేయించారు. దీంతో అజింక్య రహానె, రోహిత్‌ శర్మ, శార్దూల్‌ ఠాకూర్‌, పృథ్వీ షాతోపాటు కోచ్‌ రవిశాస్త్రి వారంరోజులు ఇళ్లకే పరిమితం కానున్నారు.
                                                     ఎయిర్‌పోర్ట్‌నుంచి నేరుగా తండ్రి సమాధివద్దకు సిరాజ్‌
ఆస్ట్రేలియా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మహ్మద్‌ సిరాజ్‌ను అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. విమానం దిగిన వెంటనే సిరాజ్‌ నేరుగా తండ్రి సమాధివద్దకు వెళ్లి ప్రార్ధన చేశాడు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా పర్యటన చిరస్మరణీయమైందని, ఆ టూర్‌ను ఎన్నటికీ మరిచిపోలేనన్నాడు. ఈ చిరస్మరణీయ సిరీస్‌ను ఎన్నటికీ మరిచిపోలేనితన తండ్రి బ్రతికి ఉంటే ఎంతో సంతోషించేవారన్నాడు. తను దేశానికి ఆడతానని తండ్రికిచ్చిన మాటను నిజం చేశానని చెబుతూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు.