ప్రజాశక్తి-పోరుమామిళ్ల : వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డితో ఎట్టి పరిస్థితులలో కలిసి పని చేయలేమని ఎమ్మెల్సీ అసమ్మతి నేతలు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఎమ్మెల్సీ స్వయానా తమ్ముడు కాశీనాయన జెడ్పిటిసి సత్యనారాయణరెడ్డి, కాసినాయన వైఎస్ఆర్ సీపీ మండల కన్వీనర్ స్వయానా బామర్ది విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో పోరుమామిళ్ల మండలంలోని రామిరెడ్డి కుంట సమీపంలోని విశ్వనాథరెడ్డి ఏస్టేట్ లో బద్వేల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్సీ వ్యతిరేకవర్గం భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ తీరు వలన నియోజకవర్గంలోని నేతలు కార్యకర్తలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆరోపించారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉండే అభిమానంతో వైఎస్ఆర్ సీపీకి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడటం లేదన్నారు. గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్సీ వైసిపి నేతలను కార్యకర్తలను పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని అసమ్మతి నేతలు నిర్ణయించుకున్నారు. వైఎస్ ఆర్ సీపీ నాయకులకు ఎటువంటి కష్టాలు వచ్చినా అన్ని విధాలుగా ఆదుకుంటామని సత్యనారాయణ రెడ్డి ,విశ్వనాథరెడ్డి నాయకులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ, ప్రస్తుత జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సచివాలయ కన్వీనర్లు, సర్పంచులు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.










