Jul 17,2022 14:56

వాతావరణం చల్లచల్లగా.. చినుకులు పడుతూ పోతూ.. ఉంటున్నప్పుడు.. స్పైసీగా తింటే.. ఆహా.. ఊహకే ఎంతో బాగుంది కదా.. మరి రియల్‌గా చేసుకుని వేడి వేడిగా తింటే.. ఈ చల్లని వేళ ఆ అనుభూతి మాటల్లో చెప్పాల్సిన పనిలేదు.. అనుభవించాల్సిందే.. అయితే నాన్‌వెజ్‌తో స్పైసీ స్పైసీగా ఫ్రైలు చేసుకుందాం.. ఏవేవి ఎలా ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం..
రొయ్యల వేపుడు
కావలసిన పదార్థాలు : పచ్చిరొయ్యలు - కప్పు, ఉల్లిగడ్డ - ఒకటి (పెద్దది), పచ్చిమిర్చి - నాలుగు, కరివేపాకు - రెండు రెబ్బలు, కారం - రెండు టీస్పూన్లు, పసుపు - అర టీస్పూన్‌, ధనియాల పొడి - టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నూనె - అర కప్పు, జీలకర్ర పొడి - అర టీస్పూన్‌, కొత్తిమీర తురుము - కొద్దిగా.
తయారీ విధానం : ముందుగా రొయ్యలను శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి గంటపాటు నానబెట్టాలి. గంట తర్వాత రొయ్యల్లో నీళ్లుపోసి కడగాలి. ఒక గిన్నెలో రొయ్యలు, టీస్పూన్‌ కారం, కొంచెం పసుపు వేసి పది నిమిషాలు పక్కన పెట్టాలి. పాన్‌లో నూనె వేడయ్యాక రొయ్యల్ని వేసి, సన్నని మంటపై బాగా వేయించి పక్కనపెట్టాలి. అదే పాన్‌లో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేయాలి. ఇవి దోరగా వేగాక, రొయ్యలు వేసి, మరికాసేపు వేయించాలి. దీంట్లో కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర పొడి ఉప్పు వేసి, బాగా కలపాలి. దీనిని సన్నని మంటపై మరో రెండు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. చివరగా కొత్తిమీర తురుముతో గార్నిష్‌ చేసుకోవాలి.
వంజరం వేపుడు

fish


కావలసిన పదార్థాలు : వంజరం చేప - పావు కేజీ, కరివేపాకు - కొద్దిగా, నూనె - సరిపడా, అల్లంవెల్లుల్లి పేస్టు - టీస్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, ఉప్పు - తగినంత, నిమ్మకాయ - ఒకటి, కారం - అర టీస్పూన్‌, గరంమసాలా - అర టీస్పూన్‌.
తయారీ విధానం : ముందుగా చేపను శుభ్రం చేసుకోవాలి. ఒక బౌల్‌లో అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు, గరంమసాలా, కారం, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకు పట్టించాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కరివేపాకు వేసి వేగించాలి. తరువాత మసాలా పట్టించిన చేప ముక్కలు వేసి, చిన్నమంటపై కాసేపు వేగనివ్వాలి. కాసేపయ్యాక నెమ్మదిగా చేప ముక్కలు మరోవైపు తిప్పి, మరికాసేపు ఫ్రై కానివ్వాలి. చేప ముక్కలు రెండు వైపులా బాగా ఫ్రై అయ్యాక నిమ్మరసం పిండుకొని దించాలి. వంజరం వేపుడు చపాతీలోకి, అన్నంలోకి రుచిగా ఉంటుంది.
అపోలో చికెన్‌

appolo


కావలసిన పదార్థాలు : బోన్‌లెస్‌ చికెన్‌-అర కిలో, మైదా-పావు కప్పు, కార్న్‌ఫ్లోర్‌- పావు కప్పు, గుడ్డు-ఒకటి, పెరుగు-అర కప్పు, కారం, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి - టీస్పూన్‌ చొప్పున, పసుపు - అర టీస్పూన్‌, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - అర టీస్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు-నాలుగు, పచ్చిమిర్చి-రెండు, కరివేపాకు-రెండు రెబ్బలు, ఉల్లిగడ్డ-ఒకటి (చిన్నది), రెడ్‌ చిల్లీసాస్‌-టీస్పూన్‌, అజినమోటో-అర టీస్పూన్‌, నూనె - వేయించడానికి సరిపడా, ఉప్పు-తగినంత, నిమ్మరసం - రెండు టీస్పూన్లు.
తయారీ విధానం : చికెన్‌ను సన్నగా పొడవాటి ముక్కల్లా కోసుకోవాలి. ఒక గిన్నెలో చికెన్‌, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పసుపు, గుడ్డు, ఉప్పు, మైదా, కార్న్‌ఫ్లోర్‌ వేసి, బాగా కలిపి పది నిమిషాలు పక్కన పెట్టాలి. పాన్‌లో నూనెపోసి, చికెన్‌ ముక్కల్ని విడివిడిగా వేయించాలి. ఆ తర్వాత పాన్‌లో టేబుల్‌ స్పూన్‌ నూనెవేసి, వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి, వేయించాలి. అన్నీ బాగా వేగాక రెడ్‌చిల్లీ సాస్‌, ఉప్పు, ధనియాలు, జీలకర్ర పొడి, అజినమోటో, పసుపు, చిలికిన పెరుగు వేసి బాగా కలిపి నిమిషంపాటు మూతపెట్టి, సన్నని మంటపై మగ్గనివ్వాలి. ఆ మిశ్రమంలో వేయించిన చికెన్‌ వేసి, బాగా కలిపి పైనుంచి నిమ్మరసం వేస్తే.. నోరూరించే అపోలో చికెన్‌ సిద్ధం.
మటన్‌ లివర్‌ ఫ్రై

matton


కావలసిన పదార్థాలు : మటన్‌ లివర్‌ ముక్కలు - కప్పు, ఉల్లిగడ్డ - ఒకటి, పచ్చిమిర్చి - మూడు, ఎండుకొబ్బరి తురుము - రెండు టేబుల్‌స్పూన్లు, పసుపు - పావు టీస్పూన్‌, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, అల్లం తురుము - టీస్పూన్‌, లవంగాలు - నాలుగు, మిరియాలు - పావు టీస్పూన్‌, కారం - టీస్పూన్‌, ఉప్పు - తగినంత, ధనియాలు - టేబుల్‌ స్పూన్‌, నూనె - అర కప్పు, కరివేపాకు, కొత్తిమీర - కొద్దిగా.
తయారీ విధానం : ముందుగా స్టవ్‌ మీద పాన్‌ పెట్టి నూనె లేకుండా ధనియాలు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క నిమిషం పాటు వేయించుకోవాలి. దీనిలో కొబ్బరి తురుము, అల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పెట్టుకోవాలి. పాన్‌లో నూనెవేసి వేడయ్యాక తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. ఇవి వేగాక కడిగి పెట్టుకున్న లివర్‌ ముక్కలు వేసి, బాగా వేయించాలి. పది నిమిషాల పాటు సన్నని మంట మీద వేగించి, పసుపు, ఉప్పు, కారం, మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమం వేసి మరో ఐదు నిమిషాలు మగ్గించాలి. బాగా ఉడికి నూనె వేరు పడుతుంటే కరివేపాకు, కొత్తిమీర తురుము వేసి దింపుకుంటే మటన్‌ లివర్‌ ఫ్రై సిద్ధం.