Apr 02,2023 08:15

గాలి, వెలుతురు, సూర్యరశ్మి ఉంటేనే మొక్కలు బాగా పెరుగుతాయి అని మనకు తెలుసు. ఇవేమీ లేకపోయినా గదుల లోపల కూడా కొన్ని మొక్కలు పెరుగుతూ ఉంటాయి. వీటినే ఇండోర్‌ లేదా లోపల మొక్కలని పిలుస్తుంటారు. అపార్ట్మెంట్‌ కల్చర్‌ వచ్చేశాక ఆర్నమెంటల్‌ మొక్కలు అంటే ఎక్కువగా ఇండోర్‌ మొక్కలే చలామణి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కడియం నర్సరీ రైతాంగం దేశ విదేశాల నుంచి రకరకాల ఇండోర్‌ మొక్కలను సేకరించి ఇక్కడ పునరుత్పత్తి చేస్తున్నారు. మరికొన్ని చిన్న మొక్కలను తీసుకొచ్చి పెంచి పెద్దవి చేసి అమ్ముతున్నారు. ఈ వారం కొత్తరకం నాన్‌ లోకల్‌ ఇండోర్‌ మొక్కల గురించి తెలుసు కుందాం!

  • జపనీస్‌ మదర్‌ పెర్న్‌..

చిన్ని చిన్ని ఆకులు కాడకు ఇరువైపులా సమాంతరంగా అమర్చబడి, నాజుగ్గా ఉంటాయి. ఈ కాడలు సన్నగా, పొడవుగా కిందకి వేలాడుతూ ఉంటాయి. హ్యాంగింగ్‌ కుండీల్లో అందంగా పెంచుకోవచ్చు. సుతి మెత్తని ఈ మొక్క పుట్టుక జపాన్‌. దవల్లియేసి కెనారియన్సిస్‌ దీని శాస్త్రీయ నామం. తక్కువ నీటి సహాయంతో కొబ్బరి పొట్టులో.. నీరెండలోనూ బాగా పెరుగుతుంది.

  • చైనీస్‌ మనీ ప్లాంట్‌..
plant 1

మొక్క నుంచి అన్ని దిశలకు విస్తరించిన సన్నని కాడలకు రూపాయి కాసంత పరిమాణంలో గుండ్రని, దళసరి ఆకులు ఉండటం దీని ప్రత్యేకత. పది అంగుళాల ఎత్తు ఉండే ఈ మొక్క ప్లాస్టిక్‌ మొక్కలా భ్రమింప చేస్తుంది. ఇది చైనా దేశపు మొక్క. మట్టిలోనూ, కొబ్బరిపొట్టులోనూ పెరిగే అలంకరణకు ఉపయోగించే మొక్క.

  • ఆంథోనియం జన్మని..
plant 2

మేడిచెట్టు ఆకులను పోలిన లేత ఆకుపచ్చని ఆకులను కలిగి ఉంటుంది ఆంథోనియం జన్మని. ఇది ఆంతర్యం కుటుంబానికి చెందిన మొక్క. దీని పుట్టుక బ్రెజిల్‌ దేశం. ఇది పూర్తిగా ఇండోర్‌ ప్లాంట్‌. నాలుగైదు సంవత్సరాలకు మొక్క మధ్య నుంచి ఒక గెలలాంటి పుష్పగుచ్ఛం పుడుతుంది. దాని నిండుగా బొడిపెలాంటి ఎర్రని పువ్వులు ఉంటాయి. మొక్క మూడడుగులు పెరుగుతుంది. కొబ్బరి పొట్టు మిశ్రమంలోనూ, మట్టిలో కూడా పెరుగుతుంది. వారానికి ఒకసారి నీరు అందిస్తే సరిపోతుంది.

  • సెన్స్వీర్యా ఎలిఫెంటా..
plant 3

సెన్స్వీర్యా జాతిలోని ఒక రకం సెన్స్వీర్యా ఎలిఫెంటా. మొక్క మొదలు భాగం నుంచి మట్టలు లాంటి ఆకులు వెడల్పుగా పాము పడగవిప్పినట్లు ఉంటాయి. సెన్స్వీరియాలో ఈ తరహా మొక్కలు భారీ పరిమాణంలో ఉండటంతో వీటిని సెన్స్వీరియా ఎలిఫెంటా అంటారు. ఇది గడ్డి జాతి మొక్క. నెలకు ఒకసారి కొద్దిగా నీటిని అందిస్తే సరిపోతుంది. ఈ మొక్క కొబ్బరి పొట్టులోను, ఇసుక నేల, ఎర్రమట్టి నేల, నల్లమట్టి నేల, రాతి నేలల్లో కూడా పెరగడం విశేషం. ఇది జపాన్‌ దేశపు మొక్క. అలంకరణ మొక్కల్లో దీనికి ఒక ప్రత్యేకత ఉంది.

  • మెడినిల్లా కుమింగి..
plant 4

ఇది డ్వార్ఫ్‌ అంటే పొట్టి జాతి మొక్క. వెడల్పాటి, పొడవాటి ఆకులు వాటి మధ్య గెలలాంటి పుష్పగుచ్ఛం.. దానికి చిన్ని బల్బులు లాంటి లేత గులాబీ రంగు పువ్వులతో ఉంటుంది. ఇది సింగపూర్‌ దేశపు మొక్క. అక్కడ సంవత్సరం అంతా, మన వాతావరణానికి తొమ్మిది నెలల పాటు పువ్వులు పూస్తూ ఉంటుంది. వేలాడే కుండీల్లో కూడా ఈ మొక్కలను అలంకరించుకోవచ్చు.

  • ఆగ్లోనిమా థిన్‌ వెరిగేటా..
plant 6

సన్నగా, పొడవుగా ఉండే ఆకులు ఆకుపచ్చ, తెలుపు రంగుల కలబోతతో ఉన్న మొక్క ఆగ్లోనిమా థిన్‌ వెరిగేటా. అమెరికా దేశానికి చెందిన ఈ మొక్కను అలంకరణ కోసం పెంచుకోవచ్చు.

  • పెపెరోమియా అల్బోవిట్టాటా..
plant 7

పెపెరోమియా అల్బోవిట్టాటా అనేది పైపెరేసి కుటుంబానికి చెందిన మొక్క. ఇది ఈక్వెడార్‌ ప్రాంతానికి చెందింది. ఆకులు మెత్తగా ముఖమల్‌ క్లాత్‌లాగా ఉంటాయి. ఆకు అడుగుభాగాన లేత చింతపిక్క రంగులోనూ, పత్రం పైన లేత వెండి-చింతపిక్క రంగు కలబోతలతో మొక్క వైవిధ్యంగా ఉంటుంది. పత్రాలపై నిలువు చారలు ఉంటాయి. ఇండోర్‌, సెమీషేడ్‌ వాతావరణంలో పెరిగే ఈ మొక్కను పీస్‌ ప్లాంట్‌ అని కూడా పిలుస్తారు. ఉదయం, సాయంత్రం నీటిని స్ప్రే చేస్తే మొక్క తాజాగా కనిపిస్తుంది.