రైతుకు సకాలంలో సాగునీరు లేదు
ప్రజాశక్తి - తాళ్ళరేవు : రబీ సాగు పూర్తయి సాగునీరు నిలుపుదల చేసి సుమారు 2 నెలలు గడుస్తున్న పంట కాలువలకు నేటికీ ఎటువంటి ఆధునికీకరణ పనులు చేపట్టకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతున్నారు. పంట కాలవల ఆధునీకరణ లేక, రైతుకు సకాలంలో సాగునీరు అందక మండలంలోని రైతాంగం ఆందోళన చెందుతున్నారు. తాళ్ళరేవు మండలం కోరంగి టైల్ అండ్ లో సుమారు 11,500 హెక్టార్లలో సాగు భూములు ఉండగా సుమారు 8 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా మండలంలో నీటి ఎద్దడి సమయంలో సకాలంలో నీరందక రైతాంగం నానా ఇక్క ట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి విధితమే. అయితే వేసవిలో సాగునీటి కాలువలకు చేపట్టాల్సిన మరమ్మత్తు పనులు సకాలంలో చేపట్టకపోవడం వల్ల శివారు భూములకు మరింత ఎక్కువగా నీటి ఎద్దడి తలెత్తనుంది .అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పంట కాలువలు అన్నిటిని ఎత్తు పల్లాలు సరిచేసి, పలుచోట్ల డ్యాములు, తూరలు నిర్మించి వంటకాలువ గట్లు సరి చేయాల్సి ఉంది. అయితే నేటి వరకు ఎటువంటి ఆధునీకరణ పనులు చేపట్టకపోవడం వల్ల ఈ ఏడాది ఖరీఫ్ సాగు ఏమవుతుంది, కొత్త ఏడాదిలో ఖరీఫ్, రబీ సాగు పరిస్థితి ఏంటని రైతాంగం ఆలోచనలో పడ్డారు. ప్రభుత్వం, అధికారులు కాలువల ఆధునీకరణ పట్ల దృష్టి సారించకపోవడంతో రాబోయే సాగుకు సాగునీరు ప్రశ్నార్ధకం కానుంది. తాళ్ళరేవు మండలంలో కోటి రూ.కోటి 80 లక్షల తో ఆధునికీ కరణ పనులకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు ఇరిగేషన్ ఏఈ జి.ఈశ్వరరావు తెలిపారు. ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించిన నిధులు మంజూరు కాలేదని అధికారులు చెబుతున్నారు. కేవలం కాలువల్లో గుర్రపుడెక్క తొలగించడానికి మాత్రమే నిధులు మంజూరు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అది కూడా కాలువ నీరు వచ్చిన తర్వాత గుర్రపు డెక్క కొన్ని చోట్ల తీయడానికి మాత్రమే అనుమతులు వచ్చిందని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ ఏడాది జూన్ ఒకటో తేదీనే ప్రభుత్వం సాగునీరు విడుదల చేసినప్పటికీ తాళ్ళరేవు మండలంలోని శివారు ప్రాంతాలకు ఇంకా సాగునీరు రాలేదు. కపిలేశ్వరపురం కు 2 కిలోమీటర్ల దూరంలో పంట కాలవపై పుట్ పాత్ బ్రిడ్జి నిర్మిస్తుండటంతో అక్కడ సాగునీరు నిలిచిపోయింది. అది పూర్తి కావడానికి ఇంకా సుమారు నాలుగు రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.అదేజరిగితే ఈ నెల15వ తేదీనాటికి గాని సాగునీరు అందే పరిస్థితి లేదు. సామాన్యంగా జూన్ మొదటి వారంలో సాగునీరు విడుదల చేసి ఉంటే సక్రమంగా పూర్తిస్థాయిలో వచ్చి ఉంటే ఇప్పటికే రైతులు ఏరువాక సాగించి పనులు మొదలుపెట్టి ఉండేవారు. నేటికీ సాగునీరు విడుదల కాకపోవడంతో ఖరీఫ్ సాగు ఆలస్యం అవుతుందని రైతాంగం ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ ఆలస్యమైతే రబీలో తుఫానులు, వానలకు చిక్కుకుని రైతాంగం నష్టాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పూర్తిస్థాయి పూర్తిస్థాయిలో సాగునీటిపై దృష్టి సారించి రైతాంగం, రైతాంగానికి సాగునీరు వెంటనే అందించి ఇబ్బందులను తొలగించాలని తాళ్లరేవు మండల రైతులు కోరుతున్నారు.










