
అదానీ కంపెనీల పెట్టుబడులు, షేర్ల పతనానికి సంబంధించిన అక్రమాలపై పార్లమెంటులో చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతుంటే కేంద్ర ప్రభుత్వం అందుకు సిద్ధం కాకపోవడం దారుణం. దేశ అత్యున్నత చట్ట సభలో చర్చ చేపడితే ప్రజల సొత్తును అదానీకి కట్టబెట్టడంలో పెద్దల పాత్ర బయటపడుతుందని కేంద్రం భయపడుతోందన్నది జనవాక్యం. మరోవైపు అదానీపై కుట్ర జరుగుతున్నదనీ, అక్రమాల్లేవంటూ ప్రభుత్వ ప్రతినిధులు చెప్తున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా విదేశీ శక్తులు చేస్తున్న కుట్రని ఆర్‌ఎస్‌ఎస్ నాయకులంటున్నారు. కాబట్టి అది కుట్రా, కాదా? అన్నది పార్లమెంటులో చర్చిస్తే తేలిపోతుంది. నిజానికి అలాంటి కుట్రలను ప్రభుత్వమే బట్టబయలు చేయాలి. మరి పార్లమెంటులో చర్చించకుండా సర్కారు ఎందుకు నిరోధిస్తున్నదో ఏలినవారికే తెలియాలి. ఏది ఏమైనా ఈ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలి లేదా సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి విచారణ జరపాలి. అప్పుడే వాస్తవాలేమిటి? అసలు దోషులెవరన్నది తేలుతుంది.
అదానీ కంపెనీల్లో భారత ప్రభుత్వరంగ దిగ్గజ సంస్థ ఎల్‌ఐసి వేల కోట్ల రూపాయలు మదుపు చేయగా, ప్రపంచంలోనే అగ్రగామి బ్యాంకుల్లో ఒకటైన ప్రభుత్వ రంగ ఎస్‌బిఐ వేలాది కోట్ల రూపాయల రుణాలిచ్చింది. అదానీ కంపెనీల షేర్ల పతనంతో ఆ ప్రభుత్వరంగ సంస్థలేమవుతాయో తమ సొమ్ము దక్కుతుందో లేదోనని కోట్లాదిమంది పాలసీ హోల్డర్లు, డిపాజిటర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారందరికీ వాస్తవాలు వివరించి, అవసరమైన భరోసా కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదే! అది మానేసి ఆ సంస్థలు మునిగిపోయినా, ఖాతాదార్లను ముంచేసినా పర్వాలేదన్నట్లు కేంద్రం వ్యవహరించడం క్షంతవ్యం కాదు. చర్చకు, విచారణకు, సమాధానానికి కేంద్రం సిద్ధంగా లేకపోవడం అన్యాయమే కాదు అప్రజాస్వామికం కూడా! ప్రజా సమస్యలను చర్చించి, వాటికి పరిష్కారాలు చూపడం పార్లమెంటు కర్తవ్యం.
రోడ్లు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాల వంటి మౌలిక వసతులు, వంట నూనెల మొదలు విద్యుత్ రంగం వరకూ దేశంలోని అన్ని రంగాలనూ అదానీ కబళించాడన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఇంతటి 'విజయాలు' సాధిస్తున్న అదానీ వెనుకున్న బలమేంటి? ఆ మాయాజాలమేమిటి? ఏమిటి ఆ అనుబంధం? తదితర ప్రశ్నలకు ప్రజలకు సమాధానం చెపాల్సింది సర్కారు వారే! రక్షణ రంగంలో అదానీకి అనుభవం లేకపోయినా నాలుగు డిఫెన్స్ కాంట్రాక్టులను అప్పగించారు. అదానీ ఎన్నడూ డ్రోన్లను తయారు చేయలేదు. ప్రభుత్వ రంగ హెచ్‌ఎఎల్ వాటిని తయారు చేసింది. అయినప్పటికీ మోడీ ఇజ్రాయిల్ పర్యటన తరువాత, అదానీకి ఆ కాంట్రాక్టు దక్కింది. ఒకప్పుడు అదానీ విమానంలో మోడీ ప్రయాణించేవారని, ఇప్పుడు మోడీ విమానంలో అదానీ ప్రయాణిస్తున్నారని పార్లమెంటులో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఎవరూ కాదనలేరు కదా! శ్రీలంకలో ఇంధన కాంట్రాక్టులు, బంగ్లాదేశ్‌లో విద్యుత్ కాంట్రాక్టులు...ఇలా ఒకటేమిటి అన్నీ అదానీకి వచ్చేలా ప్రధాని కార్యాలయమే మంత్రాంగం నెరిపిందన్నది బహిరంగ రహస్యం.
స్టాక్ మార్కెట్ కుంభకోణాలు, ఇతర భారీ అక్రమాలు వెల్లడైన సందర్భాల్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీలు నియమించిన చరిత్ర మన దేశానికి ఉంది. ప్రతిపక్షంలో ఉండగా బిజెపి నేతలు అందుకు పట్టుబట్టిన దృష్టాంతాలెన్నో ఉన్నాయి. ప్రపంచమంతటా చర్చనీయాంశంగా మారి దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన అదానీ వ్యవహారంపై ఇప్పటికైనా జెపిసి నియామకానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించాలి. ప్రతిపక్షాల న్యాయమైన డిమాండ్‌కు తలొగ్గాలి. విపక్షాలు మరింత ఐక్యంగా నిలబడి సర్కారు మెడలు వంచాలి. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రెండూ పార్లమెంటులో మౌన ముద్ర దాల్చడం తగదు. రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్న మోడీ ప్రభుత్వాన్ని నిలదీయడంలో విఫలమవుతున్న ఈ రెండు పార్టీలు ప్రజల సొత్తును స్వాహా చేసిన అదానీ వ్యవహారంలోనూ అలాగే ఉండడం దారుణం. తెలుగువారి పౌరుషాన్ని చూపి, అదానీ కంపెనీల అక్రమాలపై ఎలుగెత్తాలి. లేకపోతే రాష్ట్ర ప్రజలకు మరిన్ని అనుమానాలు కలుగుతాయి.