Nov 06,2022 08:23

ఆమె వయసు 25 ఏళ్లు. తన స్నేహితుల్లో కొందరు పెళ్లి చేసుకుని, హ్యాపీ లైఫ్‌ లీడ్‌ చేస్తున్నారు. ఇంత వయసు వచ్చిన ఒంటరిగా ఉండటం ఆమెకు కూడా ఇష్టం లేదు. కానీ, ఆమెకు తగిన అబ్బాయి ఇంకా దొరకలేదు. ఈ విషయంలో ఆమె తల్లిదండ్రులు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. 'అబ్బాయికు నచ్చిన ఆమ్మాయి దొరికే వరకు చూస్తారు. మరి తనకు నచ్చే అబ్బాయి కోసం ఎందుకని చూడరు?' అనుకునే మనస్తత్వం అంజలిది. 'ఎవరిని చూపిస్తే వారినే చేసుకోవాలా? నా ఇష్టాన్ని కాదని ఏమీ చేయరు!' అని ఆలోచిస్తూ హాల్లోకి వచ్చింది అంజలి.
'అతనికి మంచి ఉద్యోగం ఉంది. నెలకు యాభైౖ వేలు సంపాదిస్తున్నాడు. ఇంతకంటే ఏం కావాలి?' కొత్త అబ్బాయితో పెళ్లికి ఒప్పించేందుకు అంజలిని తల్లి 29వ సారి మందలించింది. కానీ ఇది అంజలి తండ్రికి ఇష్టం లేదు. అబ్బాయి దగ్గర చుట్టాల్లో వ్యక్తి. గతంలో ఒక పెళ్లిలో ఆ అబ్బాయి తండ్రి, అంజలి తండ్రి మధ్య గొడవ జరిగింది. అలాంటి కుటుంబంతో సంబంధమంటే అంజలికి అసలు ఇష్టం లేదు. 'అబ్బాయిలే దొరకనట్లు, ఆ ఇంటితో సంబంధం అంటే నాకు ఇష్టం లేదు. నాన్నకు ఇష్టంలేని పని నేను చేయలేను' తల్లితో అంది అంజలి.
'నీ చిన్నప్పుడు జరిగినదానికి ఇప్పుడు లింకేంటి? ఆ అబ్బాయికి మంచి ఉద్యోగం ఉంది. మళ్లీ అలాంటి అబ్బాయిని నేను ఎక్కడ వెతకాలి?'
'వెతకకపోతే వదిలేయండి. ఆ సంబంధం మాత్రం నాకు వద్దు' అని గట్టిగా చెప్పింది అంజలి.
నెల రోజులుగా ఈ విషయంపై చర్చ జరుగుతూనే ఉంది. అంజలిని తల్లి ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ విషయంలో అంజలి లోలోపల ఎంతో బాధపడింది. కానీ అంజలిని ఆమె తల్లి అర్థం చేసుకోవడం లేదు. ఆమెకు ఏం కావాలో ఆమె తల్లికి తెలియదు. ఆ అబ్బాయి చెడ్డవాడు కాదు, కానీ ఆమె కోరుకున్న అబ్బాయి అయితే కాదు. అంజలికి తనకు నచ్చిన అబ్బాయితో జీవితం జీవించాలని అనుకుంది. అంజలి మొండి అమ్మాయి. ఇష్టం లేకుంటే ఏ పనీ చేయదు.
'ఆ అబ్బాయి నన్ను ఇష్టపడితే నేను ఏం చేయాలి? తల వంచి, తాళి కట్టించుకోవాలా? నన్ను బలవంతం చేయవద్దు' తల్లితో వణుకుతున్న గొంతుతో అంది అంజలి.
అంజలి ఎన్నో విషయాల్లో తన తల్లిదంద్రుల కోరికలకు లొంగిపోయింది. కానీ పెళ్లి విషయంలో మాత్రం ఆమె తగ్గాలని అనుకోలేదు. అయితే అతన్ని అంజలి తిరస్కరించడానికి సరైన కారణం చూపలేకపోయింది. కాకపోతే ఆమె జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి గురించి ఆలోచించింది. అతనే ఇందుకు కారణం అని ఆమెకు బాగా తెలుసు. తన మనసుకు నచ్చిన వ్యక్తి ఎప్పుడు వస్తాడో అని ఎదురుచూస్తోంది.
తన జీవితంలో ఏం జరుగుతుందో చూసి నవ్వాలో, ఏడవాలో అంజలికి అర్థం కాలేదు. 'దేశంలో చాలా మంది అబ్బాయిలు ఉన్నారు. ఎవరో ఒకరు నాకోసం ఉండి ఉంటారు. కచ్చితంగా అతన్నే పెళ్లి చేసుకుంటా. ఇక ఆ అబ్బాయినే చేసుకోవాలని నన్ను ఇబ్బంది పెట్టకండి' తల్లితో ఈ సారి అంజలి గట్టిగానే చెప్పింది. ఈ విషయం గురించి మళ్లీ అంజలి తల్లి ప్రస్తావించలేదు.
ఓ నెల రోజుల తర్వాత అంజలి కోసం మరో సంబంధం చూసింది ఆమె తల్లి.
'ఈ రోజు నిన్ను చూడటానికి ఒక ఫ్యామిలీ వస్తుంది. రెడీగా ఉండు' అంజలితో తల్లి చెప్పింది. నిజానికి కాస్త రిలీఫ్‌ కోసం అంజలి తన స్నేహితులతో కలిసి టూర్‌కి ప్లాన్‌ చేసుకుంది. 20 రోజులుగా ప్లాన్‌ చేస్తున్న టూర్‌ ఇది. కానీ తన తల్లి ఈ టూర్‌ క్యాన్సిల్‌ చేసేలా ఉందని అంజలి భావించింది.
అంజలి తన స్నేహితులను కలుసుకుంది. స్నేహితులందరూ ఏ ప్లేస్‌కి వెళ్లాలి, ఎలా టైం స్పెండ్‌ చేయాలని ప్లాన్‌ చేసుకుంటున్నారు. అయితే తనని చూసుకోవడానికి వస్తున్నారనిర స్నేహితులకు అంజలి డల్‌గా చెప్పింది. అంజలి మాటలు ఎవరికీ నచ్చలేదు. 'ఇంట్లో నువ్వు చెప్పలేదా? ఈ రోజు నీకు వేరే ప్లాన్‌ ఉందని' స్నేహితుల్లో ఒకరు అంజలితో అన్నారు. అంజలి సైలెంట్‌గా ఉంది.
'అంతా ప్లాన్‌ చేశాక నువ్వు రాకపోతే ఎలా? నువ్వు మాతో కచ్చితంగా రావాల్సిందే' మరో స్నేహితురాలు అంది.
'నన్ను ఇబ్బంది పెట్టకండి. మీరు వెళ్లండి. నేను ఇక ఇంటికి వెళ్తాను' అని బరువెక్కిన హదయంతో చెప్పింది అంజలి. ఇది ఈ టైంలో అంజలి లైఫ్‌లో జరుగుతుంది మాత్రమే కాదు, మరో సందర్భంలో ఆమె స్నేహితుల జీవితాల్లో కూడా జరుగుతుందని అంజలికి బాగా తెలుసు.
ఇంటికి వచ్చిన అంజలి రెడీ అయ్యి కూర్చుంది. అంజలికి ఎలా ఉండాలో, ఏం మాట్లాడాలో తల్లి పలు సూచనలు చేసింది. ఆమె సూచనలకు అంజలి అలవాటుపడిన కారణంగా పెద్దగా పట్టించుకోలేదు. వారు వచ్చారు. వారికి అంజలి టీ అందించింది. 'మీకు వంట చేయడం వచ్చా?' అబ్బాయి తల్లి అడిగింది. 'వచ్చు' అని అంజలి తల ఊపింది. కాసేపు అంజలిని, ఆమె ఇష్టాలను తెలుసుకున్నారు. తర్వాత వారు వెళ్లిపోయారు. అంజలి రూంలోకి వెళ్లి, దుస్తులు మార్చుకుంది.
అంజలి టూర్‌కి రాని కారణంగా ఆమె స్నేహితులు కూడా టూర్‌ క్యాన్సిల్‌ చేసుకున్నారు. నిన్న జరిగిన విషయం గురించి కావేర్ని ఆమె స్నేహితులు అడిగారు. ఇలాంటి విషయాలను స్నేహితులతో చర్చించటం అమ్మాయిల గుంపులో ఒక ఆసక్తి.
అంజలి చాలా అందంగా ఉంటుందని అందరూ అంటారు. కానీ అంజలి ఎప్పుడూ అలాంటి పొగడ్తలను పట్టించుకోలేదు. అందంగా ఉన్నాను కాబట్టి తన చేతిని ఓ డబ్బున్న అబ్బాయి చేతిలో పెట్టాలని ఆమె ఎప్పుడూ అనుకోలేదు.
'నువ్వు చాలా అందంగా ఉంటావు. ఆ అబ్బాయి నీకు నచ్చితే చేసుకో, ఇంకా ఆందోళన ఎందుకు?' అన్నది తన స్నేహితురాలు. అందుకు అంజలి నవ్వింది. జవాబు మాత్రం చెప్పలేదు. దుకాణంలో అమ్మకానికి అందుబాటులో ఉన్న ఒక వస్తువులా తనని వాళ్లు భావిస్తున్నట్లు ఆమె భావించింది.
'అమ్మాయి మంచిదేనా? అమ్మాయి కలర్‌ బాగుందా? ఆమె ఎత్తు ఎంత? ఆమె లావుగా ఉందా?' వంటి ప్రశ్నలు ఎన్నో కావేర్ని చూడకముందే అన్నారు. చూశాక ఇంకా ఎన్నో అడిగారు. అంజలికి అన్నదమ్ములు లేరని రిజెక్ట్‌ చేసినవారు కూడా ఉన్నారు. చివరగా ఒక అబ్బాయిని నచ్చితే, అతను మరో అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని తెలిసింది. ఆమెను వదిలేసి అంజలిని చేసుకోవడానికి అతను రెడీ అయ్యాడు. ఈ విషయం తెలిసి కూడా అంజలి తల్లి పెళ్లి చేసుకోమని అంజలిని అడిగింది. ఆ తర్వాత ఇకపై ఏ వ్యక్తిని అంగీకరించకూడదని అంజలి నిర్ణయించుకుంది.
అంజలి తన మనసులో స్వేచ్ఛగా జీవించాలనుకుంది. తనకోసమే ఒక అబ్బాయి రావాలని, అతనితో స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంది. స్నేహితులను కలిసి ఇంటికి వచ్చిన అంజలికి ఆమె తల్లి మరో రెండు సంబంధాలు చూశానని చెప్పింది.
ఇద్దరు అబ్బాయిలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి చూసి వెళ్లారు. వారి సమాధానం కోసం అంజలి తల్లి ఎదురుచూస్తోంది. ఇంట్లో తల్లి ఫోన్‌ మాట్లాడుతున్న మాటలు అంజలి చాటుగా విన్నది. 'ఎత్తుతో సమస్య ఏం ఉంది. అమ్మాయి అబ్బాయి మంచిగా ఉంటే చాలు' అని అంజలికి వినిపించింది. తల్లి దగ్గరకు వెళ్లిన అంజలి, 'ఏమైంది?' అని అడిగింది.
నువ్వు ఎత్తుగా లేవని ఆ ఇద్దరు అబ్బాయిలు వద్దన్నారని చెప్పింది. అందుకు అంజలికి కోపం వచ్చింది. ఇక నేను ఏ అబ్బాయినీ చూడను. ఏదైనా జాబ్‌ చేస్తాను. కొన్ని రోజుల వరకు ఈ పెళ్లి విషయం నా దగ్గర తీయకండి అంది.
                                                           **********************************
ఆ తర్వాత అంజలి ఉద్యోగంలో జాయిన్‌ అయింది. తనకు నచ్చిన ప్రదేశాలకు వెళ్లింది. చూడాల్సిన ఎన్నో తన జీవితంలో చూసింది. సంవత్సరం తెలియకుండానే గడిచింది.
'ఇంకా ఎన్నాళ్లు ఒంటరిగా ఉంటావు?' సున్నితంగా అంజలిని అడిగింది తల్లి.
'నాకేమన్న ఒంటరిగా ఉండాలని ఆశనా?'
'అయితే ఒక సంబంధం చూశాను. ఇంటికి వస్తావా?'
'లేదు అమ్మ, ముందు నువ్వు, నాన్న వెళ్లి అబ్బాయిని చూడండి. అతను మంచిగా అనిపిస్తే, నా ఫొటో అతనికి చూపించండి. మన ఇంటి పరిస్థితులు అతనికి చెప్పండి. నా ఎత్తు, నా మాట, నేను ఎలా ఉంటానో, ఏం చేస్తున్నానో అన్నీ చెప్పండి. అన్నింటికీ అతను సరే అంటే అప్పుడు నన్ను చూడటానికి రమ్మనండి. అప్పుడు నేను వస్తాను!' అని తల్లితో అంజలి అంది. అందుకు తల్లి కూడా సరే అని చెప్పి ఫోన్‌ పెట్టేసింది.
అంజలి తల్లిదండ్రులు వెళ్లి అబ్బాయిని చూసి, అతని గురించి తెలుసుకున్నారు. అంజలి గురించి అన్ని వివరాలు తెలియజేసి, ఫొటో చూపించారు. అంజలి ఫోటో చూసిన అబ్బాయి 'నాకు అమ్మాయి నచ్చింది' అన్నాడు. అమ్మాయిని చూడటానికి ఒకరోజు వస్తామని అతను, అతని తల్లిదండ్రులు అన్నారు. జరిగినదంతా అంజలికి ఆమె తల్లి చెప్పింది.
ఉద్యోగానికి సెలవు పెట్టి, ఇంటికి వచ్చేసింది అంజలి. ఆ రోజు ఇంట్లో హడావుడిగా ఉంది. ఇది కేవలం మాట్లాడటానికి లేదా అబ్బాయిని చూడటానికి ఏర్పాటు చేసిన సమావేశంగా అంజలి భావించింది. అయితే ఇక్కడ ఫొటోలు తీయడం, మిఠాయిలు పంచడం, ఇరు కుటుంబాలు సంతోషంగా మాట్లాడటం అంజలికి కనిపించింది. కానీ అంజలి మౌనంగానే కూర్చుంది. 'మీ ఫోన్‌ నెంబర్‌ ఎంత?' అబ్బాయి సోదరి అంజలిని పక్కనే కూర్చున్నప్పుడు అడిగింది. 'సరే ఇస్తాను' అని అంజలి నవ్వింది. ఫలహారాలు వచ్చిన అతిథులకు వడ్డించారు. తీపి కబుర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. అబ్బాయిని అంజలి చాటుగా చాలాసేపు చూసింది. అతను ఆమెని చూసి నవ్వాడు. ఆమె కూడా నవ్వింది. ఆమె మనసులో అతను ఇంకా స్థానం సంపాదించలేదు. కానీ అతన్ని చూసినప్పుడు అంజలికి సిగ్గు తన్నుకొచ్చింది. ఆమెకు కావాల్సిన మిస్టర్‌ రైట్‌ అతనే అనిపించింది. అయితే ఇది జరుగుతుందా లేదా అన్న సందేహంలో కూడా అంజలి ఉంది.
ఆమెకు అతను మెసేజ్‌ పెట్టాడు. ఆ మెసేజ్‌ ఆమెకు నచ్చింది. తాను ఆఫీస్‌లో కాస్త బిజీగా ఉన్నానని, సాయంత్రం మెసేజ్‌ చేస్తానని రిప్లరు పెట్టింది. సాయంత్రం ఆఫీస్‌ నుంచి ఇంటికి వచ్చాక అతనికి మెసేజ్‌ పెట్టింది. ఆమె గురించి అతనికి ముందే అన్ని వివరాలు తెలిసిన కారణంగా ఆమె ఇష్టాలు, అయిష్టాలు మాత్రమే అడిగాడు. అందుకు ఆమె తనకు ఉన్న చిన్న చిన్న కోరికలను చెప్పింది. అతనితో మెసేజ్‌ చేయడం ఆమెకు నచ్చింది.
ఆ తర్వాత రోజు అతను ఆమెకు ఫోన్‌ చేశాడు. అతను హలో అనగానే ఆమెకు చుట్టూ సీతాకోకచిలుకలు తిరిగినట్లు అనిపించింది. 'హలో ఎలా ఉన్నారు?' ఆమె అడిగింది. అతను నవ్వుతూ 'బాగున్నాను' అన్నాడు. ఆ తర్వాత వారి సంభాషణ కొనసాగింది. గడిచే ప్రతి నిమిషం ఆమె సంతోషంగా అనుభూతి చెందడం ప్రారంభించింది. అతని స్వరం, మాట్లాడే మాటలు అంజలికి అద్భుతంగా అనిపించాయి.
'మీతో మాట్లాడుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఇలా ఎవరితో ఇప్పటివరకూ మాట్లాడలేదు' అని తన భావాలను చెప్పింది. అతను నవ్వుతూ..'అయితే నేను లక్కీ' అన్నాడు.
నిజంగా తాను ఆమెకు నచ్చానా లేదా, తన పట్ల ఆమె సంతోషంగా ఉందా లేదా అనేది అతను తెలుసుకోవాలనీ అనుకున్నాడు. ఆమె తనను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించిందంటే అది కుటుంబ ఒత్తిడి వల్ల కాదని అతను నిర్ధారించుకోవాలనీ అనుకున్నాడు. అవే ప్రశ్నలు ఆమెను అడిగాడు. అతను తన మనసులో ఉన్న భావాలను ప్రశ్నించినందుకు.. ఆమె సంతోషపడి, అతన్ని ప్రశంసించింది.
తన ఇష్ట ప్రకారమే జరుగుతుందని తెలిపింది. అందుకు అతను సంతోషకరమైన నవ్వు నవ్వాడు. అతని హదయం నుండి ఒక భారం పోయింది. 'మీరు నా పట్ల సంతోషంగా ఉన్నారా?' ఆమె అతనిని అడిగింది. అవును ఇప్పుడు మా ఫ్యామిలీలో ఐదుగురు ఉన్నారు అన్నాడు. ఆమె నవ్వింది. అతని కుటుంబంలో తాను ఐదో వ్యక్తినని ఆమెకు తెలుసు. అతని మాటలకు ఆమె ప్రేమలో పడకుండా ఉండలేకపోయింది. ఆమె అతనితో ప్రేమలో పడటానికి కారణం అతని నిజాయితీ, అహం లేకపోవడం.
'మీరు చేస్తున్న ఉద్యోగం ఎలా ఉంది?' అడిగాడు అతను.
'చాలా బాగుంది. మీ ఉద్యోగం ఎలా ఉంది?'
'ప్రభుత్వ ఉద్యోగం కదా, బాగుంది'
అతనితో ఆమె స్నేహంగా మెలగడానికి ఆమెకు కొన్ని నిమిషాలు పట్టింది.
'రోజూ ఏ టైంకి ఆఫీస్‌కి వెళ్తారు?'
'ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరుతాను. ఆఫీస్‌కి వెళ్లేసరికి పది అవుతోంది.'
'అవునా, ఏ సమయంలో ఇంటికి తిరిగి వస్తారు?'
'ఇంటికి వచ్చేసరికి ఏడున్నర అవుతుంది.'
'నా టైమింగ్‌ కూడా ఇంచుమించు మీ టైమింగే.' అంది అంజలి.
'రేపు నేను కాస్త తొందరగా బయటకు వద్దాం అనుకుంటున్నా!'
'ఎందుకో?'
'మీకు ఎలాంటి అభ్యంతరం లేకుంటే, మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాను' అన్నాడు.
కొన్ని సెకన్ల మౌనం తర్వాత అంజలి 'సరే' అంది.
కేఫ్‌లో ఇద్దరు ఎదురుగా కూర్చున్నారు. కొన్ని సెకన్ల పాటు వాళ్ల మధ్య మౌనం ప్రయాణించింది. వాస్తవ ప్రపంచంలో ప్రేమ నిజంగా సాధ్యమేనని ఆమె నమ్ముతుంది. ఇక తాను ఒంటరిగా జీవించాల్సిన అవసరం లేదని ఆమె గ్రహించింది. ఆమె లేచి అతనికి ఒక బహుమతి ఇచ్చి, మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉందని చెప్పింది. అతను కూడా ఆమెకు ఓ గిఫ్ట్‌ ఇచ్చి, కతజ్ఞతలు తెలిపాడు. కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. వారి మధ్య సంభాషణ కొనసాగింది. తెలియకుండానే సమయం గడిచిపోయింది. నిజానికి, వారిద్దరూ బయలుదేరాలని అనుకోలేదు, కానీ ఒక అందమైన అనుభూతితో తిరుగుముఖం పట్టారు.
మరుసటి రోజు రాత్రి ఆమెకు మెసేజ్‌ చేశాడు. వారు మామూలుగా కబుర్లు చెప్పుకోవడం మొదలుపెట్టారు. అతని స్నేహపూర్వక స్వభావాన్ని ఆమె ఆరాధించడం మొదలుపెట్టింది. ఆమె తన భాగస్వామిలో స్నేహితుడిని, ప్రియుడ్ని కోరుకుంది. అతను తన గురించి ప్రతిదీ చెప్పాడు, ఆమె గురించి కూడా అడిగాడు. వారిద్దరూ ఒకరికొకరు రహస్యాలు దాచుకోలేదు. ప్రేమికులు, స్నేహితుల వలే కలిసి జీవించాలని వారి ప్రమాణం మొదలు పెట్టారు. కొన్ని వారాల సన్నాహాల తర్వాత, వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. సంతోషంగా జీవించారు.
అంజలి ఇలా జరుగుతుందని, అతనిలాంటి మంచి వ్యక్తి తన లైఫ్‌లోకి వస్తాడని ఆమె ఊహించలేదు. అంజలి పెళ్లి తర్వాత మౌనంగా కూర్చుంది. మొదటి చూపులోనే అతనితో ప్రేమలో పడింది. అతనితో మొదటిసారి మాట్లాడిన రోజును మరచిపోలేకపోయింది. తెలియకుండానే ఆమె పెదవులపై చిరునవ్వు మెరిసింది.
రమేశ్‌ రాపోలు
9030872697