న్యూఢిల్లీ : న్యూస్‌క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థ, పోర్టల్ హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిలను ఢిల్లీ కోర్టు బుధవారం ఏడురోజుల పాటు పోలీస్ రిమాండ్ విధించింది. యుఎపిఎ (ఉగ్రవాద నిరోధక చట్టం ) చట్టం కింద న్యూస్ క్లిక్ కార్యాలయంపై, సిబ్బంది ఇళ్లపైన 30 ప్రాంతాల్లో మంగళవారం రాత్రి దాకా ఢిల్లీ పోలీసులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఎడిటర్ ప్రబీర్ పురకాయస్థతో పాటు హెచ్‌ఆర్ హెడ్‌లను అరెస్ట్ చేయడంతో పాటు న్యూస్ క్లిక్ కార్యాలయాన్ని సీల్ వేశారు.
యుఎపిఎలోని సెక్షన్153(ఎ) (మతం,జాతి, జన్మ స్థలం, నివాసం ఆధారంగా విభిన్న ప్రజా సమూహాలమధ్య శత్రుత్వం పెంచడం), ఐపిసి 120 (బి)(నేరపూరిత కుట్ర), కింద ప్రబీర్ పుర్కాయస్థ, అమిత్ చక్రవర్తి తదితరులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లతో పాటు పలు డిజిటల్ పరికరాలను ఎత్తుకెళ్లారు. జర్నలిస్టులు అభిసర్ శర్మ, భాషా సింగ్, ఊర్మిళేష్, ఔనిందో చక్రవర్తి, చరిత్రకారుడు సొహైల్ హష్మీ, వ్యంగ్య రచయిత సంజరు రాజౌరా మరియు సెంటర్ ఫర్ టెక్నాలజీ అండ్ డెవలప్‌మెంట్‌కు చెందిన డి. రఘునందన్‌లను సుమారు ఆరుగంటల పాటు విచారించారు. ఈ దాడులను సిపిఐ (ఎం) పొలిట్ బ్యూరో, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు), ఐద్వాలు ఖండిచాయి.