- డిజిటల్ పరికరాల స్వాధీనం తీవ్రమైన అంశం
- ఏజెన్సీలతో నడిచే ప్రభుత్వం కాకూడదు
- నెల రోజుల్లో మార్గదర్శకాలు : కేంద్రానికి సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ : పాత్రికేయులు వార్తలు, కథనాల సమాచారం కోసం అనేక వనరులపై ఆధారపడుతుంటారని, ఆ విషయంలో గోప్యత పాటించడం వారి ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తెలిపింది. మీడియాలో పనిచేసే జర్నలిస్టులు, ఉద్యోగులు వార్తలను సేకరించేందుకు సోర్సుల కాంటాక్ట్‌లు కలిగివున్న డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకోవడం అత్యంత తీవ్రమైన అంశమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. దర్యాప్తు కోసం వారి పరికరాలను స్వాధీనం చేసుకోవాల్సి వస్తే.. అందుకు ప్రత్యేకమైన మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. దేశంలోని దర్యాప్తు సంస్థలు జర్నలిస్టులను విచారించేందుకు, వారి నుంచి పత్రాలు, హార్డ్ డిస్క్‌లు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటివి స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక విధివిధానాలను రూపొందించాలని కోరుతూ ఫౌండేషన్ ఫర్ మీడియా ప్రొఫెషనల్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజరు కిషన్ కౌల్, జస్టిస్ సుధాంషు ధులియాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ''ఇది చాలా తీవ్రమైన అంశం. మీడియా ప్రొఫెషనల్స్ డిజిటల్ పరికరాల తనిఖీలు, స్వాధీనం కోసం ప్రత్యేకమైన మార్గదర్శకాలు ఉండాలి. మీడియా వ్యక్తులకు వారి సొంత సోర్సులు ఉంటాయి. గోప్యత హక్కు అనేది ప్రాథమిక హక్కు. దానిలో సమతుల్యం పాటించాలి'' అని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. జర్నలిస్టు డిజిటల్ పరికరాల స్వాధీనం కోసం ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని ఈ సందర్భంగా కేంద్రానికి సూచించింది. ఇందుకోసం నెల రోజుల గడువు ఇస్తున్నట్టు తెలిపింది. ''మీరు కోరుకుంటే మేం మార్గదర్శకాలను రూపొందిస్తాం. కానీ మీరు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఏజెన్సీలతో నడిచే ప్రభుత్వం కాకూడదు'' అని ధర్మాసనం స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు సమాధానమిస్తూ.. ఇలాంటి పరికరాలను పరిశీలించకుండా అధికారులను ఆపలేమని అన్నారు. అయితే ఎలాంటి మార్గదర్శకాలు లేనప్పుడు ఇలాం టి అంశాలపై ప్రభుత్వానికి అధిక అధికారాలు ఇస్తే అది ప్రమాదకరమని ధర్మాసనం పేర్కొంది. అనంతరం ఈ పిటిష న్‌పై తదుపరి విచారణను డిసెంబరు 6కి వాయిదా వేసింది.
''దేశంలో చాలా మంది పాత్రికేయులు ప్రతీకార దాడులు జరుగుతాయనే భయంతో పనిచేస్తున్నారు. జాతీ య, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి కొంతమంది జర్నలిస్టులు రాసే వార్తలను ప్రభుత్వం అంగీకరించడంలేదు. వారిని కట్టడి చేసేందుకు సోదాల పేరిట ప్రతీకార దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురిచేస్తోంది'' అని ఇటీవల 15 మీడియా సంస్థలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్‌కు లేఖ రాశాయి. ఇటీవలి న్యూస్‌క్లిక్ ఆన్‌లైన్ పోర్టల్‌లో పనిచేసే 46 మంది జర్నలిస్టులు, ఉద్యోగుల ఇండ్లలో ఢిల్లీ పోలీసులు సోదాలు చేసి, వారి డిజిటల్ పరికరాల(ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు)ను స్వాధీనం చేసుకున్న విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు.