Nov 03,2023 11:29

 మార్గదర్శకాలు జారీ చేసిన యునెస్కో
పారిస్‌ : 
  ప్రపంచ దేశాల్లో ఎన్నికల సమయంలో పాత్రికేయులపై జరుగుతున్న దాడులకు సంబంధించి ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ఓ నివేదికను రూపొందించింది. 2019 నుండి 2022 జూన్‌ వరకూ 70 దేశాల్లో జరిగిన 89 ఎన్నికల సందర్భంగా పాత్రికేయులపై జరిగిన దాడులను యునెస్కో పరిశీలించింది. 759 మంది పాత్రికేయులు, మీడియా సిబ్బందిపై దాడులు జరిగాయని, వాటిలో 42% అంటే 320 దాడులు చట్టాన్ని అమలు చేసే సంస్థలే చేశాయని, దాడులకు గురైన వారిలో 29% (218) మంది మహిళలని ఆ సంస్థ వివరించింది. ముఖ్యంగా చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వ సంస్థలే దాడులకు తెగబడ్డాయని ఎత్తిచూపింది. అనేక మంది పాత్రికేయులను నిర్బంధించాయని, కొందరిని తాత్కాలికంగా అరెస్ట్‌ చేశారని, కొందరిపై మోపిన ఆరోపణల్ని ఆ తర్వాత వెనక్కి తీసుకున్నారని పేర్కొంది. నిరసన ప్రదర్శనలకు సంబంధించిన వార్తలను అందించే సమయంలో చాలా మంది పాత్రికేయులను అరెస్ట్‌ చేశారని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సంస్థలకు యునెస్కో మార్గదర్శకాలు విడుదల చేసింది. 'పాత్రికేయులు, ప్రభుత్వ సంస్థల మధ్య మంచి, వృత్తిపరమైన సంబంధాలు ఉండాలి. పాత్రికేయులను కలుసుకుంటూ, వారి పాత్రపై చర్చించాలి. జర్నలిస్టులు తమ పని తాము చేసుకునేలా అనువైన వాతావరణం కల్పించాలి. సకాలంలో సమర్ధవంతమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి. పాత్రికేయులపై ఏ రూపంలోనూ బలప్రయోగం, ఒత్తిడి చేయకూడదు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన కార్యక్రమాల వార్తలు అందించే జర్నలిస్టులను అధీకృత పత్రాలు అడగకూడదు. అక్రెడిషన్‌ కలిగిన వారిని ప్రోత్సహించాలి. వారిని తేలికగా గుర్తించేలా దుస్తులు, సామగ్రి పైన ప్రెస్‌ అనే చిహ్నాన్ని ప్రదర్శించాలి. ఎన్నికల సమయంలో తటస్థంగా ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రభుత్వ సంస్థలకు, పాత్రికేయులకు తరచుగా శిక్షణ ఇవ్వాలి' అని యునెస్కో సూచించింది.