Oct 26,2023 07:04

'న్యూస్‌ క్లిక్‌' కార్యాలయంపైనా, దాదాపు దాంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరి నివాసాలపైనా ఢిల్లీ పోలీసుల దుర్మార్గంగా ఇష్టానుసారం దాడులు చేశారు. జర్నలిస్టులు, ఇతర ఉద్యోగులు ఉపయోగించే ఎలక్ట్రానిక్‌ పరికరాలను విచక్షణారహితంగా కనీస నిబంధనలకు పాటించకుండా తీసుకెళ్లిపోయారు. ఆ న్యూస్‌ పోర్టల్‌ ప్రధాన కార్యాలయంలో సోదాలు జరిపారు. అందులోని డేటా వివరాలకు సంబంధించి ఎలాంటి రశీదులు ఇవ్వలేదు. 'న్యూస్‌ క్లిక్‌' సంస్థాపక సంపాదకుడు, ప్రబీర్‌ పుర్కాయస్థ, దాని అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, అమిత్‌ చక్రవర్తి తీవ్రవాద చర్యలకు పాల్పడ్డారంటూ ఆరెస్టు చేశారు. ఇది చాలదన్నట్టు, సిబిఐ కొత్తగా ఒక క్రిమినల్‌ కేసును దాఖలు చేసి 'న్యూస్‌ క్లిక్‌' ఆవరణలోనూ, దాని సంస్థాపక సంపాదకుని ఇంట్లో కొత్తగా సోదాలు చేసింది. నిజానికి ఆ మధ్య స్థాయి న్యూస్‌ పోర్టల్‌ సంస్థపై ఇది ఐదోసారి దాడి. ఇలాంటి చర్యలు, 1975-77 మధ్య ఎమర్జెన్సీ నాటి నుండి భారతదేశ మీడియా స్వేచ్ఛపై ఇంత దారుణ దాడి ఎప్పుడూ లేదు. 'రిపోర్టర్స్‌ సాన్స్‌ ఫ్రంటియర్స్‌' ప్రచురించిన వివరాల ప్రకారం చూస్తే 2014 నుంచి జరుగుతున్న పరిణామాలతో 'భారతీయ మీడియా స్వేచ్ఛ-2023'లో మొత్తం 180 దేశాల్లో 161వ స్థానానికి దిగజారింది. వివిధ స్థాయిల్లో వృత్తిపరంగా, చట్టపరంగా, రాజకీయపరంగా గట్టి ప్రతిఘటనలు లేకుంటే ఇది ఇంకా క్షీణిస్తుంది.
ఈ నేపథ్యంలో పుర్కాయస్థ, ఇతరులపై ఢిల్లీ పోలీసుల స్పెషల్‌ సెల్‌ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ పరిశీలించడం చాలా అవసర మవుతుంది. బుద్ధిహీనమైన పోలీస్‌ రాజ్యం ఎలా ఉంటుందో అర్థం చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఒకవేళ కోర్టులు యథేచ్ఛగా అనుమతిస్తే ''ముందు శిక్ష, తరువాతనే తీర్పు'' అమలు చేయాలనుకుంటుంది. గోప్యతా కారణాల వల్ల ఎఫ్‌ఐఆర్‌ బయిట పెట్టలేకపోతున్నామని పోలీసుల అంటున్నప్పటికీ ఎఫ్‌ఐఆర్‌ కొంతమంది ప్రత్యేక అవకాశాలులన్న జర్నలిస్టుల చేతుల్లోకి వెళ్ళింది. దాన్ని ఏమాత్రం చూసినా ఇదంతా ఒక కుట్రపూరితమైన కుహనా వ్యవహారమనీ నకిలీ కేసు అని తెలిసిపోతుంది. 'న్యూస్‌ క్లిక్‌'పై చేసిన ఆరోపణలు ఏ మాత్రం నిలిచేవి కాదు, అవి బూటకమైనవని ''హిందూ'' సంపాదకీయం స్పష్టం చేసింది. కానీ 'న్యూస్‌ క్లిక్‌' పై దాడి కేవలం పోలీసులు చేసిన హడావుడి కాదు, ఇదొక రాజకీయ వ్యవహారం. స్వతంత్రంగా, విమర్శనాత్మకంగా వ్యవహరించే వామపక్ష భావజాలం గల ప్రగతిశీల, డిజిటల్‌ వార్తా సంస్థపై బిజెపి, హిందూత్వ నిరంకుశ రాజ్యం చేస్తున్న యుద్ధం ఇది.

  • న్యూస్‌ క్లిక్‌ వాస్తవాలు

న్యూస్‌ క్లిక్‌.ఇన్‌ అనే సంస్థను పీపీకే 'న్యూస్‌ క్లిక్‌' స్టూడియో ప్రైవేట్‌ లిమిటెడ్‌ యాజమాన్యంలో 2009లో స్థాపించారు. చాలా పరిమితమైన బడ్జెట్‌ తోనే అది పని చేస్తుంది. రోజువారీ పనులను ఒక సంపాదక వర్గం నిర్వహిస్తుంది. దీని వ్యవస్థాపక ప్రధాన సంపాదకుడైన ప్రబీర్‌ పుర్కాయస్థ ఇంజినీర్‌. విద్యుత్‌, టెలికాం, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో పని చేసే సైన్స్‌ కార్యకర్త. దేశంలో వామపక్షంలోని ఒక ప్రభావశీల మేథావి. ఈ నెట్‌వర్క్‌ ప్రజా ఉద్యమాలు, పోరాటాలను నివేదిస్తోంది. వ్యాఖ్యానాలు విశ్లేషణలూ చేస్తుంది. ఇది క్రమం తప్పకుండా విభిన్న సమస్యలపై నిరంతరం విమర్శనాత్మకమైన ప్రగతిశీల వాణి వినిపిస్తుంది. సహజంగానే ఇందులో భాగంగా 'న్యూస్‌ క్లిక్‌' మోడీ ప్రభుత్వ నిరంకుశ ''హిందూత్వ'', హిందూ-నిరంకుశ రాజకీయ ఎజెండాకు, దాని విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. దాని నివేదికలు, విశ్లేషణలు, రోజువారీ తాజా సమాచారం అంతా ఉచితంగానే అందిస్తుంది. వ్యాపారం, చందాలు, విదేశాలకు మీడియా కంటెంటు అమ్మకం అనే వ్యాపార నమూనాలోనే పని చేస్తుంది. రోజువారీ నిర్వహణకు, విస్తరణకు కొన్ని పెట్టబడులను తెచ్చుకుంటుంది.
మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020-21లో రైతులు సామూహిక నిరసన కార్యక్రమాలు చేపట్టిన సమయంలో 'న్యూస్‌ క్లిక్‌' కీలక పాత్ర నిర్వహించింది. రైతాంగ ఉద్యమం విజయానికి, ఆ ప్రజా వ్యతిరేక చట్టాల రద్దుకు ఈ కృషి దోహడపడిందనే భావం అందరిలో ఏర్పడింది.
ఇక్కడే అమెరికా పౌరుడు, వామపక్ష మేథావి, కార్యకర్త, అత్యంత ప్రతిభా వంతుడైన వ్యాపారి నెవిల్లీ రారు సింగమ్‌ కథలోకి ప్రవేశిస్తాడు. ఆయన 'థాట్‌ వర్క్స్‌' అనే ఒక అంతర్జాతీయ ఐటీ కన్సల్టెన్సీ కంపెనీ వ్యవస్థాపకుడు, అధినేత. ఈ సంస్థకు భారతదేశంలోనూ ఉద్యోగులున్నారు, కార్యాలయాలున్నాయి. సింగమ్‌ 2017లో థాట్‌ వర్క్స్‌ను, బ్రిటన్‌కు చెందిన 'అపాక్స్‌ పార్ట్‌నర్స్‌'కు 785 మిలియన్‌ డాలర్లకు విక్రయించారు. ఈ అమ్మకంతో వచ్చిన డబ్బుతో సింగమ్‌, అతని టీం సభ్యులు, అమెరికాలో పీపుల్స్‌ సపోర్ట్‌ ఫౌండేషన్‌ లిమిటెడ్‌ (పిఎస్‌ఎఫ్‌) అనే ప్రైవేట్‌ సంస్థను స్థాపించారు. ఈ పిఎస్‌ఎఫ్‌ సంస్థ లాయర్‌, మేనేజర్‌ జాసన్‌ ఫెచర్‌ సంస్థ తరపున విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ''పిఎస్‌ఎఫ్‌ కు విరాళంగా ఇచ్చిన నిధులన్నీ ''థాట్‌ వర్క్స్‌'' అమ్మకం ద్వారా వచ్చిన నిధుల నుండే వచ్చాయని వెల్లడించారు. పిఎస్‌ఎఫ్‌, మరో దేశ ప్రభుత్వం నుండి ఎలాంటి నిధులను స్వీకరించలేదు. వరల్డ్‌ వైడ్‌ మీడియా హోల్డింగ్స్‌ ఎల్‌ఎల్‌సీ (డబ్ల్యుఎంహెచ్‌) అనే మరో సంస్థను ఈ ఫౌండేషన్‌ నిర్వహిస్తుంది. ప్రపంచ వ్యాపితంగా ప్రజల కోణంలో వార్తలను అందించే ప్రగతిశీల మీడియా ప్రాజెక్టులలో వివిధ రకాల పెట్టుబడులు పెట్టి లాభాలు తెచ్చుకునే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థ డబ్ల్యుఎంహెచ్‌.

  • న్యూయార్క్‌ టైమ్స్‌ రాసిందేంటి?

2017 చివరలో డబ్ల్యుఎంహెచ్‌, 'న్యూస్‌ క్లిక్‌'ను తన లక్ష్యాలకనుగుణమైన సంస్థగా గుర్తించింది. పెట్టుబడులు పెట్టడం ప్రారంభించింది. 'న్యూస్‌ క్లిక్‌' వ్యవస్థాపక సంపాదకుడు పుర్కాయస్థ ఎన్నో ఏళ్లు థాట్‌ వర్క్స్‌లో పని చేసిన వ్యక్తి. కనక దాంట్లో పెట్టుబడి పెట్టవచ్చని డబ్య్లుఎంహెచ్‌ నిర్ణయించుకుంది. 2018 మార్చిలో 'న్యూస్‌ క్లిక్‌'లో పెట్టుబడి కార్యరూపం దాల్చింది. మరోవైపున 2021 నుండి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సంస్థలు, ముఖ్యంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగం, ఆదాయ పన్ను శాఖ 'న్యూస్‌ క్లిక్‌'ను లక్ష్యం చేసుకొని నిరంతర దాడులు, సోదాలు మొదలుపెట్టాయి. అయితే స్వాధీన పర్చుకున్న పరికరాలు, డాక్యుమెంట్లు, ఈమెయిళ్లలో 'మనీ లాండరింగ్‌', లేదా పన్నుల ఎగవేత వంటి తప్పుడు పనులు చేసిన రుజువులు దొరక్కపోవడంతో ఈ విచారణలు ముందుకు సాగలేదు. ఈ దశలోనే అమెరికా పత్రిక 'న్యూయార్క్‌ టైమ్స్‌' తన ప్రత్యేకమైన పరిశోధక కథనంతో రంగప్రవేశం చేసింది. అమెరికా సాంకేతిక కుబేరుని చేరిన చైనా ప్రచారజాలం (''ఏ గ్లోబల్‌ వెబ్‌ ఆఫ్‌ చైనీస్‌ ప్రోపగాండా లీడ్స్‌ టు ఏ యూఎస్‌ టెక్‌ మొఘల్‌'') అనే శీర్షికతో ఈ కథనం వెలువడింది. అపార నిధులతో చైనా అనుకూల ప్రచార వ్యాప్తి కేంద్ర బిందువుగా ఆకర్షణీయమైన అమెరికా మిలియనీర్‌, నెవిల్లీ రారు సింగమ్‌ ఉన్నాడనేది ఈ కథనం సారాంశం. ఈయన వామపక్ష శ్రేయోభిలాషి కావడం ఏదో పెద్ద నేరమైనట్టు ఈ పత్రికా కథనం ఆరోపించింది. ఈ వ్యాసం 'న్యూస్‌ క్లిక్‌' గురించి రెండు మామూలు విషయాలే చెప్పింది. చైనా ప్రభుత్వంతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ అధికారులు దాడి చేసినా ఎలాంటి రుజువులు దొరక లేదంటూనే సింగమ్‌ నెట్‌వర్క్‌ ఈ న్యూస్‌ క్లిక్‌ సైట్‌ కు, పెట్టుబడి పెట్టడాన్ని ప్రస్తావించింది.''
అంతేగాని 'న్యూస్‌ క్లిక్‌' ఏ చట్టాన్నైనా ఉల్లంఘించిందని ఆ పత్రిక ఆరోపించలేకపోవడం ముఖ్యమైన విషయం. ఎవరైనా శ్రద్ధగా పరిశోధనాత్మకంగా అధ్యయనం చేసి వుంటే 'ఫైనాన్సింగ్‌' అనేది, డబ్ల్యుఎంహెచ్‌ పెట్టుబడి రూపంలో ఇచ్చిందని తెలుసుకొని ఉండేవారు. ఆ వివరాలు చట్ట ప్రకారం అధికారులకు అప్పగించినవే. ఎన్‌ఫోర్స్‌్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆరోపించినట్లు ఇక్కడ ''మనీ లాండరింగ్‌'' ప్రశ్నే లేదు. అందుకే ఢిల్లీ హైకోర్టు కూడా 'న్యూస్‌ క్లిక్‌'కు అనుకూలంగా, కంపెనీ బాధ్యులను అరెస్ట్‌ చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పించింది. దీనికి సంబంధించిన ఆదాయ పన్ను అధికారులు చేసిన ఫిర్యాదును కింది కోర్టు కొట్టేసింది. 70 ఏళ్ళ చైనా విప్లవం తర్వాత కాలంలో వచ్చిన మార్పులకు సంబంధించి 2019 అక్టోబర్‌ 2న పోస్టు చేసిన వీడియో మాత్రమే న్యూయార్క్‌ టైమ్స్‌ చూపిన గొప్ప ఆధారం! ఇదే దాని దృష్టిలో చైనా అనుకూల ప్రచారమైంది. నిజానికి న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం, తీవ్ర భావజాలంతో రాసింది. సమాచారం ముసుగులో ప్రచారం కోసం రాసింది. డబ్ల్యుఎంహెచ్‌ మేనేజర్‌, లాయర్‌ అయిన జాసన్‌ ఫెచర్‌కు వ్యాసం ప్రచురణకు ముందే రిపోర్టర్లు లేవనెత్తిన ప్రశ్నలకు పిఎస్‌ఎఫ్‌ తరఫున స్పందించాడు: పిఎస్‌ఎఫ్‌ ఎవరి నుంచి ఎలాంటి నిధులను స్వీకరించలేదు, ఏ విదేశీయుని నుండి గానీ, ఏ సంస్థ నుండి గానీ, ఏ రాజకీయ పార్టీ నుండి గానీ, ఏ ప్రభుత్వం నుంచి గానీ ఎలాంటి ఆదేశాలనూ తీసుకోలేదు. పిఎస్‌ఎఫ్‌ నిధుల వనరు థాట్‌ వర్క్స్‌ అమ్మకం ద్వారా వచ్చినవే. కాని అవి చైనా నుండి వచ్చినట్లు పాఠకులను న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం వండారని ఫెచర్‌ స్పష్టం చేశారు.

  • తీవ్ర ప్రచార దాడి

కాకపోతే మరోసారి 'న్యూస్‌ క్లిక్‌'పై దాడి చేయడానికి న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం అక్కరకు వచ్చింది. ఈసారి ప్రభుత్వం అమెరికా తరహా మెకార్థియన్‌ ప్రచారం (అంటే కమ్యూనిస్టు వ్యతిరేక సమాచారం), భయానక కథనాలు, విషపు దాడికి పాల్పడింది. సామాజిక మాధ్యమాల ద్వారా హిందూత్వ అనుకూల భక్తులు, ఉన్మాద శక్తులు ఆ కథనంలో చెప్పినట్టు భారతదేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని గగ్గోలు మొదలెట్టారు. అమెరికా పత్రిక ఏదో గొప్ప సంచలనం బయిటపెట్టిందంటూ న్యూస్‌ క్లిక్‌పై, దాని నిర్వాహకులపై కత్తులు నూరుతున్నారు. సర్కారీ భజనకు పేరు మోసిన రెండు టీవీ ఛానళ్ళు ఈ తప్పుడు ప్రచారానికి వంత పాడుతున్నాయి. దర్యాప్తు సంస్థలు క్రమపద్ధతిలో లీక్‌ చేస్తున్న సమాచారంతో అభాండాలు కుమ్మరిస్తున్నాయి. ఈ విధంగా తీవ్రవాద నేరంతో కొత్త కేసు మోపడానికి రంగం సిద్ధమైంది.
దీనికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జర్నలిస్టులు, న్యాయవాదులు, రాజకీయ, సామాజిక కార్యకర్తలు, ప్రజల నుండి విస్తృతంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. కానీ, ఇదో సంఘటనగానే మాత్రమే అనుకుంటే మీడియా స్వతంత్రత, స్వేచ్ఛను రక్షించే ఉద్యమం విజయవంతం కాదు. ప్రభుత్వ అణచివేతను అనేక మార్గాల్లో ప్రతిఘటించాలి. విష పూరితమైన తప్పుడు సమాచారం, ద్వేషపూరిత ప్రచారా వరణం సాగుతున్న నేటి భావావరణాన్ని ఛేదించాలి.
2014 మే నుండి 19 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. కానీ హంతకులపై చర్యల్లేవు. ఇటీవల 'ద వైర్‌' పత్రికలో ప్రచురితమైన వ్యాసం ప్రకారం, 16 మంది జర్నలిస్టులపై 'ఉపా చట్టం' కింద కేసులు మోపారు. ఏడుగురు జైళ్ళలో ఉన్నారు, ఇలాంటి ప్రతీ కేసును తీవ్రంగా తీసుకోవాలి. కేవలం స్వతంత్ర జర్నలిస్టులు, విమర్శనాత్మక జర్నలిస్టుల రక్షణకు మాత్రమే కాక, మన రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక స్వేచ్ఛలను రక్షించుకునేలా దీక్షబూనడానికి దారితీయాలి. ఎందుకంటే...ఒక్కరు ప్రమాదంలో పడితే అందరూ పడినట్టే.

news-click-raids-freedom-of-expression-press-in-bp-govt-ram-article1

 

 


- ఎన్‌. రామ్‌
(''ఫ్రంట్‌లైన్‌'' సౌజన్యంతో)