
- నేడు జీవిత బీమా జాతీయీకరణ దినోత్సవం
జనవరి 19 ఎల్‌ఐసి ఉద్యోగులకు అత్యంత ముఖ్యమైన రోజు. 1956లో ఇదే రోజున, ప్రజల పొదుపును దోచుకోవడంలో మునిగి తేలుతున్న మొత్తం 245 ప్రైవేట్ బీమా కంపెనీలను విలీనం చేస్తూ జీవిత బీమా (అత్యవసర నిబంధనలు) ఆర్డినెన్స్‌ను ప్రకటించారు అప్పటి ఆర్థిక మంత్రి సి.డి. దేశ్‌ముఖ్. జీవిత బీమా వ్యాపార జాతీయీకరణ అనేది స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో జాతీయ స్పృహలో అంతర్భాగంగా ఉంది. ''ప్రజల సంక్షేమం కోసం ప్రజల సొమ్ము'' అనే నినాదంతో వ్యక్తితో పాటు దేశానికి కూడా సేవ చేయడమే లక్ష్యం. ఎల్‌ఐసి దశాబ్దాలుగా స్థిరంగా, అద్భుతంగా ఈ పునాది లక్ష్యాలను నెరవేరుస్తోంది. ప్రభుత్వ సామాజిక-రంగ బాధ్యతలు నెరవేర్చడంలోనేగాక...భారత ఆర్థిక వ్యవస్థపై ఎల్‌ఐసి తనదైన శాశ్వత ముద్ర వేయడం ద్వారా దేశ అభివృద్ధి కార్యక్రమం నుండి ఒక అవిభాజ్య అంగంగా మారింది.
1956లో కేవలం రూ.5 కోట్ల ప్రారంభ మూలధనంతో మొదలైన ఎల్‌ఐసి ఇప్పుడు రూ.42,30,617 కోట్ల ఆస్తిని కలిగి ఉంది. రూ.37,35,760 కోట్ల మేర లైఫ్ ఫండ్ ఉంది. రూ.1,43,938 కోట్ల నూతన వ్యాపార ప్రీమియం ఆదాయాన్ని వసూలు చేయడం ద్వారా ఎల్‌ఐసి పెన్షన్ మరియు గ్రూప్ సూపర్ యాన్యుయేషన్ వ్యాపారం మూడు సంవత్సరాల పాటు ఒక ట్రిలియన్ మార్కును దాటింది. 2021-22 సంవత్సరంలో ఎల్‌ఐసి 2.18 కోట్ల కొత్త పాలసీలను విక్రయించి 3.56 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొదటి సంవత్సరం ప్రీమియంగా రూ.1,98,760 కోట్లు వసూలు చేసింది. నేడు ప్రపంచ వ్యాప్తంగా 14 దేశాల్లో ఎల్‌ఐసీకి తనదైన ముద్ర ఉంది. బీమా పరిశ్రమలో ఎల్‌ఐసికి అత్యధిక మార్కెట్ వాటా ఉంది. 2021-22 సంవత్సరానికి మొత్తం ఆదాయం రూ.7,21,103 కోట్లు. ఇది రూ.1.92 లక్షల కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించింది.
సర్వీస్ చేయబడిన పాలసీల సంఖ్య పరంగా, సెటిల్ చేయబడిన క్లెయిమ్‌ల పరంగా చూసినట్లయితే ఎల్‌ఐసి ప్రపంచంలోనే ఒక అతి పెద్ద బీమా సంస్థ. ఎల్‌ఐసి భారతదేశంలో అత్యధిక ఆస్తులు కలిగిన అతి పెద్ద సంస్థ. ఎల్‌ఐసి ఆస్తులు అనేక దేశాల జిడిపి ని మించి పోయాయి. 30 కోట్లకు పైగా పాలసీదారులతో ఇది కోట్లాదిమంది భారతీయ కుటుంబాలను చేరింది. ఏటా రూ.4-5 లక్షల కోట్ల మొత్తాన్ని పెట్టుబడి మిగులుగా సమకూరు స్తోంది. సంస్థ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ప్రభుత్వానికి డివిడెండ్‌గా రూ.31,000 కోట్లకు పైగా మొత్తాన్ని చెల్లించింది.
ప్రభుత్వం మరియు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ప్రతికూల విధానాల కారణంగా బీమా పరిశ్రమ నేడు అనేక సవాళ్ళను ఎదుర్కొంటోంది. దురదృష్టకర విషయం ఏమిటంటే ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చినా... ఎల్‌ఐసి ఐపిఓ ద్వారా స్టాక్ మార్కెట్‌లో ప్రభుత్వం తన వాటాలో 3.5 శాతం మేర విక్రయించడంతో పునాది లక్ష్యాలకు తీవ్ర విఘాతం కలిగింది. ఎల్‌ఐసి తో ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయించే విధంగా చర్యలు చేపడుతోంది. లైసెన్సుల జారీలో, మూలధన అవసరాలలో, ఏజెన్సీ నిబంధనలు, బ్యాంక్ ఎష్యూరెన్స్, కార్పొరేట్ ఏజెన్సీ మోడల్స్ మరియు పెట్టుబడులు మొదలైన అంశాలపై మార్పులను తీసుకురావడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ప్రయత్నిస్తోంది. వీటిని అమలు చేస్తే బీమా పరిశ్రమను 1956కి ముందు పరిస్థితులకు తీసుకువెళ్లే ప్రమాదం ఉంది. పాలసీదారుల డబ్బును, భద్రతను పణంగా పెట్టే కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అందువల్ల జనవరి 19 అనేది ఒక నమ్మకాన్ని, ఒక భరోసాను కలిగించేది. మన నమ్మకాలను, నిబద్ధతను దృఢపరిచే రోజు. ప్రభుత్వ రంగంలో ఎల్‌ఐసిని రక్షించడానికి కొత్త శక్తితో, నూతనోత్సాహంతో, ముందుకు సాగడానికి స్ఫూర్తిని కలిగించే ఒక మంచి రోజు.
బిజెపి ప్రభుత్వ రంగానికి వ్యతిరేకమని, ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గతంలో ప్రభుత్వ రంగంపై అనేక సార్లు విషం చిమ్మారనేది రహస్యమేమీ కాదు. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయడం దేశ ఆర్థిక సార్వభౌమత్వానికి చేటు. కానీ, ప్రైవేటీకరణకు ఈ ప్రభుత్వం హాల్‌మార్క్‌గా మారింది. మానిటైజేషన్ లేదా ప్రజల ఆస్తుల అమ్మకం ద్వారా ప్రభుత్వం తన ఆదాయాన్ని సంపాదించడానికి ఏకైక మార్గంగా అవలంబిస్తోంది.
ఈ నేపథ్యంలో జీవిత బీమా రంగ జాతీయీకరణ దినోత్సవాన (జనవరి 19) ''ప్రభుత్వ రంగాన్ని కాపాడండి-ఎల్‌ఐసిని బలోపేతం చేయండి'' నినాదంతో ఉద్యమించడం అత్యంత సముచితం.
ప్రభుత్వ రంగ ఎల్‌ఐసి కి పాలసీదారుల నమ్మకం, ఏజెంట్లు, ఉద్యోగుల శ్రమ అత్యంత కీలకమైనవి. గతంలో అనేక సందర్భాలలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని తన ప్రతిభను నిరూపించిన ఎల్‌ఐసి ఆఫ్ ఇండియా ...ప్రైవేటు రంగానికి ఎక్కువ చేయూతనిచ్చే ప్రభుత్వ విధానాలను సైతం తోసిపుచ్చి...ముందుకు సాగే శక్తిని కలిగి ఉండడం భారతదేశానికి గర్వకారణం. ప్రభుత్వ రంగ ఎల్‌ఐసికి తోడ్పాటునందిస్తున్న వారందరూ అభినందనీయులే.
- చిలకలపూడి కళాధర్,
సంయుక్త కార్యదర్శి ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్, మచిలీపట్నం డివిజన్,
సెల్ : 7382099838