Jan 30,2023 22:31
  • ఆగస్టు 9న రాష్ట్రాల్లో మహా ధర్నా
  • 2023 పోరాటాల సంవత్సరం
  • ఏడాది చివరిలో జాతీయ సమ్మె

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తీవ్ర స్థాయిలో కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఆందోళనలను ఉధృతం చేసేందుకు కేంద్ర కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. కార్మిక వ్యతిరేక విధానాలను ఓడించేందుకు సర్వశక్తులూ ఒడ్డాలని నిర్ణయించాయి. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉన్నందున 2023 పోరాటాల సంవత్సరంగా మారనుందని స్పష్టం చేశాయి. లేబర్‌ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశాయి. ప్రభుత్వ రంగ సంస్థల విక్రయాలను నిలిపివేయాలనీ, కార్మికులకు హాని కలిగించే విధానాలను ఉపసంహరించుకోవాలనీ, ఉద్యోగ స్థిరత్వాన్ని నిర్ధారించాలనీ, సార్వత్రిక పెన్షన్‌ను కోరుతూ ఆందోళనలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నాయి. సోమవారం నాడిక్కడ కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌ అనెక్స్‌లో సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, హెచ్‌ఎంఎస్‌, ఎఐయుటియుసి, సేవా, టియుసిసి, ఎఐసిసిటియు, ఎల్‌పిఎఫ్‌, యుటియుసి ఆధ్వర్యాన జాతీయ సదస్సు జరిగింది. మహాత్మాగాంధీకి ఘన నివాళులర్పించడంతో కన్వెన్షన్‌ ప్రారంభమైంది. ఆగస్టు 9న క్విట్‌ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర స్థాయిలో మహాపడావ్‌ను కార్మిక సంఘాలు నిర్వహించనున్నాయని కన్వెన్షన్‌ ప్రకటించింది. మహా ధర్నాకు ముందు జిల్లా, పంచాయతీ స్థాయిల్లో సమావేశాలు, జాతాలు, పాదయాత్రలు నిర్వహించనున్నారు. ఏడాది చివరిలో జాతీయ సమ్మె కూడా నిర్వహించనున్నారు.
ఈ సదస్సుకు కె. హేమలత (సిఐటియు), బినరు విశ్వం (ఎఐటియుసి), అమిత్‌ యాదవ్‌ (ఐఎన్‌టియుసి), రాజా శ్రీధర్‌ (హెచ్‌ఎంఎస్‌), ఆర్‌.పరాశర్‌ (ఎఐయుటియుసి), జిఆర్‌ శివశంకర్‌ (టియుసిసి), లతా బెన్‌ (సేవా), కెకె బోరా (ఎఐసిసిటియు), రషీద్‌ ఖాన్‌ (ఎల్‌పిఎఫ్‌), శత్రుజిత్‌ సింగ్‌ (యుటియుసి) పది మంది సభ్యులు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. అన్ని సెక్టోరల్‌ నేషనల్‌ ఫెడరేషన్‌ల నాయకులు ఈ సదస్సులో పాల్గన్నారు. ఆర్థిక వ్యవస్థలోని అసంఘటిత, వ్యవస్థీకృత, స్వయం ఉపాధి, మొదలైన అన్ని రంగాలకు చెందినవారు పాల్గన్నారు. జాతీయ ఐక్యత, సామరస్య జీవనాన్ని కాపాడేందుకు కార్మికులు పోరాడాలనీ, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ విధానాలను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డాలనీ సదస్సు తీర్మానించింది. రాష్ట్రాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలను ఆమోదించడానికి రాష్ట్ర, జిల్లా, సెక్టోరల్‌ స్థాయి సమావేశాలను నిర్వహించడం ప్రారంభించి, ఆగస్టు 9న క్విట్‌ ఇండియా రోజున రాష్ట్రాల్లో మహాపడావ్‌గా ముగుస్తుందని డిక్లరేషన్‌ను కన్వెన్షన్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది.

  • అదానీ కంపెనీల మోసాలపై దర్యాప్తు చేయాలి : తపన్‌ సేన్‌

సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ మాట్లాడుతూ కేంద్రంలోని ప్రభుత్వ, కార్మిక, ప్రజా, జాతీయ వ్యతిరేక విధానాలను బహిర్గతం చేయడానికి ఏడాది పొడవునా ఆందోళనలు చేయనున్నట్టు తెలిపారు. పిఎస్‌యుల ప్రయివేటీకరణ విధానాలు, జాతీయ వనరులు, ఆస్తులను దేశ, విదేశీ కార్పొరేట్‌లకు విక్రయించడం, దేశ ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ ఫైనాన్స్‌ క్యాపిటల్‌కు లంగదీసుకోవడానికి వ్యతిరేకంగా, దేశ స్వావలంబన, సార్వభౌమాధికారం, స్వాతంత్య్రం పరిరక్షణ కోసం పోరాడాలనే నొక్కిచెప్పారు. ఆశ్రిత పెట్టుబడిదారులు (క్రోనీ క్యాపిటలిస్ట్‌ల)ను రక్షించడానికి మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. హిండెన్‌బర్గ్‌ పరిశోధన నివేదికలో పేర్కొన్న అదానీ కంపెనీల మోసాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విధానాలపై వ్యతిరేక స్వరాన్ని అణచివేయడానికి అన్ని అప్రజాస్వామిక చర్యలకు పూనుకోవడంతో సమాజంలోని లౌకిక ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి అమర్జిత్‌ కౌర్‌, ఐఎన్‌టియుసి జాతీయ ఉపాధ్యక్షుడు అశోక్‌ కుమార్‌ సింగ్‌, హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి హర్భజన్‌ సింగ్‌, ఎఐయుటియుసి వర్కింగ్‌ కమిటీ రాజిందర్‌ సింగ్‌, టియుసిసి అధ్యక్షురాలు కె ఇందు ప్రకాష్‌ మీనన్‌, సేవా జాతీయ కార్యదర్శి సోనియా జార్జ్‌, ఎఐసిసిటియు ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ దిమ్రీ, ఎల్‌పిఎఫ్‌ ప్రధాన కార్యదర్శి షణ్ముగం, యుటియుసి ప్రధాన కార్యదర్శి అశోక్‌ ఘోష్‌ తదితరులు మాట్లాడారు.