Nov 17,2022 11:13

విశ్వానికి సంబంధించిన అద్భుతమైన దృశ్యాలను మనకు అందిస్తున్న జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మరోసారి అబ్బురపరిచే చిత్రాలను తీసింది. తాజాగా అంతకుముందు చూడని కాస్మిక్ మేఘాలను చిత్రీకరించింది. నారింజ, నీలిరంగు ధూళికి సంబంధించిన ఫోటోలను జెమ్స్ వెబ్ తీసింది. భూమికి 430 కాంతి సంవత్సరా దూరంలో ఉంటూ, అప్పుడే పుట్టడం ప్రారంభించిన  ఓ నక్షత్రం చూస్తున్న విధ్వంసాన్ని క్లిక్ మనిపించింది. ఈ ఫోటోలో టారస్ నక్షత్ర మండలంలోని ప్రోటోస్టార్ ఎల్1527 అనే నక్షత్రం ఏర్పడుతున్నపుడు,  దాని చుట్టూ ఆవరించి ఉన్న కాస్మిక్ మేఘాలను చూడవచ్చు. పరారుణ కాంతిలో మాత్రమే కనిపించే మేఘాలను నియర్-ఇన్‌ఫ్రారెడ్ కెమెరా ద్వారా జేమ్స్ వెబ్ ఫోటో తీసింది. నక్షత్రం నుంచి వెలువడుతున్న పదార్థం దాని చుట్టు పక్కల ఉన్న పదార్థంతో ఢీకొట్టినట్లు కనిపిస్తోంది. ఎల్1527 నక్షత్రం వయసు కేవలం లక్ష ఏళ్లు మాత్రమే అని..ఒక నక్షత్ర వయసుతో పోల్చి చూస్తే ఇది కేవలం యవ్వన దశలో మాత్రమే ఉందని నాసా పేర్కొంది. దీన్ని నక్షత్ర ప్రారంభ దశ ప్రోటోస్టార్ గా పరిగణిస్తారు. విశ్వం పుట్టుక, ఎక్సో ప్లానెట్స్, నక్షత్రాల పుట్టుకకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు జేమ్స్ వెబ్ ని ప్రయోగిస్తున్నారు. బ్లాక్ హోల్స్, అనేక గెలాక్సీలను, నెబ్యులాలకు సంబంధించిన ఫోటోలను తీసి శాస్త్రవేత్తలనే అబ్బురపరుస్తోంది ఈ జేమ్స్ వెబ్. 10 బిలియన్ డాలర్ల భారీ ఖర్చుతో ఈ టెలిస్కోప్ ను నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు నిర్మించాయని సంగతి విదితమే.