Oct 31,2020 23:09

నిశ్చయ మనసంతా గుబులు కమ్మేసి ఉంది. అమ్మ, నాన్న మాటకు అవుననీ, కాదనీ చెప్పలేని స్థితిలో చిక్కడింది. ఆమెకు స్వేచ్ఛ లేదని కాదు.
'మా పంచ ప్రాణాలు నువ్వే!' అంటూ వారు తన నుదుటిపై పెట్టే ముద్దుతో కురిపించే ప్రేమ ఆమెకు అడ్డుపడుతోంది. ఏదో తెలియని అనిశ్చితకు గురవుతోంది.
అంతలోనే శ్యామ్‌ రూపు మనసులో మెదిలింది. ఆమె పెదవులపై చిరునవ్వు పాదం మోపింది. అతను ఎదురుగా ఉండకపోయినా, ఏదో దగ్గరితనం ఎద అంతా ఆక్రమించింది. శ్యామ్‌ పరిచయమై కొన్ని నెలలే. కానీ తలపులలో తిష్టవేశాడు. నిన్న గాక మొన్న సాగిపోయిన పున్నమి చంద్రుడిల్లా ఎప్పటిలాగే అతనే కనపడ్డాడు.
నిశ్చయ మొబైల్‌ చేతిలోకి తీసుకుని, స్క్రీన్‌ అన్‌లాక్‌ చేసింది. మనసులో ఉన్న 'చిగురంత ఆశలాగా' మినుకు మినుకు వెలుగు చిమ్మింది స్క్రీన్‌. 'శ్యామ్‌' పేరుని సెర్చ్‌ చేసి, ఆ నెంబర్‌ని డయల్‌ చేయబోయింది.
'ఊహాలోకి కూడా రానిది జరిగింది. ఆ దేవుడి దయ సాయపడింది అనుకుందాము!' అమ్మ అనునయంతో చెప్పిన మాటలు నిశ్చయ వేళ్లను చటుక్కున పట్టుకుని ఆపాయి. ఆ వెంటే 'ఈ రోజుల్లో పీటల మీద పెళ్లిళ్లే ఆగిపోతున్నాయి. నీకు జరిగింది ఏముంది? అదృష్టం అనుకుని, జరిగిందంతా మర్చిపో!' అన్న నాన్న మాటలు వెంటాడటం మొదలెట్టాయి.
'అంత తేలిగ్గా ఎలా మాట్లాడుతున్నారు? అదే పెళ్ళైపోయి ఉంటే ఏమి చేసేవారు?'
'అప్పుడు ఏమీ చేసేవాళ్ళము కాదేమో! అట్లాగని ఇప్పుడు ఆపకుండా ఉండలేము'
'అలా మాట్లాడటం అన్యాయం కదా నాన్నా! మీకు శ్యామ్‌ నచ్చి, మెచ్చే కదా..!'
'పాపా! మర్చిపొమ్మంటున్నది నీ మంచి కోరే!' నిశ్చయ మాటను తుంచేస్తూ, భర్తకు వత్తాసు పలుకుతూ అమ్మ మాట దూసుకొచ్చింది.


'ఇన్ని రోజులుగా శ్యామ్‌తో ఏర్పడ్డ అనుబంధం ఎలా మర్చిపోను? కనీసం నువ్వన్నా అర్థంచేసుకో అమ్మా!'
'మేము కాదు అర్థం చేసుకోవాల్సింది.. నువ్వు. అనవసరమైన సెంటిమెంట్స్‌తో బంగారు భవిష్యత్తును పాడుచేసుకోకు!' తండ్రి అన్న మాటలు, తన ఆలోచనలు.. రెండింటి తీవ్రత నుండి బయటపడి, నిట్టూర్పు విడిచింది. చేతిలో ఫోన్‌ కేసి సాలోచనగా చూస్తూ..
ఆ ఫోన్‌కే మాటొస్తే 'నీ మీమాంసను డిలీట్‌ చేసి, శ్యామ్‌ నెంబర్‌ను ప్రెస్‌ చెయ్యి!' అనేదేమో.
అంతలోనే ఏదో కలకలం. మనుషుల గల గలా మాటలు. ఆ సందడికి ఉలిక్కిపడింది.
'ఈ కరోనా కాలంలో జనాల హడావిడా? ఎలా...ఎందుకు?' అని ఆశ్చర్యపోతూ కొద్దిగా తెరచి ఉన్న కిటికీలో నుండి తొంగి చూసింది.
తన అపార్ట్‌మెంట్‌కు ఎదురుగా ఉన్న నాలుగు పోర్షన్ల ఇంటిముందు కారు వచ్చి ఆగింది. దానిలో నుండి ఓ మహిళ దిగింది. మొహానికి మాస్క్‌. గుర్తుపట్టడం కష్టంగా ఉంది.


గేటు దగ్గర నుంచున్న వాళ్ళు, తాము పట్టుకున్న పళ్లేల నుండి పూలు తీసి, ఆమె మీద జల్లుతున్నారు. ఆమె రెండు చేతులూ ముకుళించి, నమస్కరిస్తూ ఒక్కసారిగా ఉద్వేగానికి గురయ్యింది. ముక్కుకున్న మాస్క్‌ తీసి మొహాన్ని చేతుల్లో కప్పుకుంది.
''యశోద ఆంటీనా?!'' అనుకుంటూ నిశ్చయ కిటికీని పూర్తిగా తెరిచింది. నవ్వుతూ పలకరించే ఆవిడ ఆత్మీయ పిలుపు ఆ చుట్టుప్రక్కల వారందరికీ పరిచయమే.
యశోద ఆంటీ హాస్పిటల్లో హెడ్‌నర్స్‌గా పనిచేస్తోంది. నెల రోజులుగా క్వారంటైన్‌లో ఉన్న కరోనా పేషెంట్స్‌ వార్డ్‌లో సేవలు అందించి వచ్చింది. ఆమె సేవలకుగాను ఇరుగూ పొరుగువారు, కుటుంబసభ్యులు ఘన స్వాగతం పలుకుతున్నారు. యశోదమ్మ కూతురు ఆవిడను పొదవి పట్టుకుని, ఇంటిలోకి నడిచింది.
అది చూస్తున్న నిశ్చయ మనసంతా తెలియని వేదనతో నిండిపోయింది.


'ఇలాంటి గొప్ప మానవసేవ.. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలందించడమే! వారిని తెలియని భయంతో, స్వార్ధంతో దూరం పెట్టడం, బంధాలను తెంపుకోవడం ఎంతవరకు సబబు?' అంతరాత్మ ప్రశ్నకు నిశ్చయ గుండెల్లో ఊరిన చెమ్మ కళ్ళల్లోకి ఉరికింది.
శ్యామ్‌ ఆమె ప్రేమికుడో, స్నేహితుడో కాదు. స్వయానా అమ్మా, నాన్న ఎంపిక చేసిన వరుడు. పెద్దలు ఏర్పాటు చేసిన పెళ్లి చూపుల ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ క్షణాన నచ్చినప్పటికీ, నిర్ణయం తీసుకోవటానికి నిశ్చయ, శ్యామ్‌ కొంత టైమ్‌ అడిగారు. ఆపై ఒకరితో ఒకరు టచ్‌లో ఉండి, రెండునెలల తరువాత పెళ్ళికి ఆమోదం తెలిపారు.
అందరూ సంతోషించారు. తాంబూలాలు పుచ్చుకోవటానికి ముహూర్తం నిర్ణయించి, ఏర్పాట్లు చేసుకున్నారు. అనుకోకుండా ముంచుకొచ్చిన కరోనా కరాళ నృత్యానికి ఆగిపోయిన ఫంక్షన్స్‌లో వాళ్ళ నిశ్చయ తాంబూలాలు కూడా ఒకటి.
ఆతృతగా మొబైల్‌ చేతిలోకి తీసుకుని శ్యామ్‌ నెంబర్‌ డయిల్‌ చేసింది నిశ్చయ.
'హారు నిశ్చా ఎలా ఉన్నావు ?'
'శ్యా.....మ్‌....' గొంతులో ఏదో తెలియని బాధ ధ్వనిస్తూ అంది నిశ్చయ.
'నిశ్చా! ఏమయ్యింది? అందరూ ఓ.కే. నా?' కంగారుగా అడిగాడు శ్యామ్‌.
'ఐ మిస్‌ యూ..!'' అంది మనసులోని బెంగంతా మాటలలోకి వొంపి.
'కమాన్‌ నిశ్చా! కూల్‌. ఐ టూ మిస్‌ యూ. కానీ నా బాధ్యత నిర్వహించాలి కదా! పాపం, ఆ రోగులని చూస్తే జాలేస్తోంది. ఓకే.. నాకు డ్యూటీ టైమ్‌ అయ్యింది. మరలా టచ్‌లోకి వద్దాము' అంటూ ఫోన్‌ కట్‌ చేశాడు డాక్టర్‌ శ్యామ్‌.
'నువ్వు మా ఒక్కగానొక్క గారాల పట్టివి. చూస్తూ చూస్తూ కరోనా రోగులను ట్రీట్‌ చేసే శ్యామ్‌కి నిన్ను ఇచ్చి పెళ్లి చేయటానికి మనసు ఒప్పటం లేదు. అంతకన్నా మంచి సంబంధం తెచ్చి, పెళ్లి చేస్తాను. అతనికి దూరంగా ఉండు!' అన్న తండ్రి మాటలు ఆ క్షణాన ఆమెకు గుర్తుకు రాలేదో.. వచ్చినా వాటికి విలువ ఇవ్వలేదో కానీ ఆమె మనసంతా నిశ్చింత ఆక్రమించుకుంది.

 - సి. యమున
9550445911