Oct 18,2020 10:38

నలుచదరపు నిర్ణీత స్థలం నుంచి విశాల రహదారిపై
నడవడానికి చేయందించింది ఈ ఎర్రజెండానే
అంత:పురం హద్దుల్ని చెరిపేసి
ఆకాశం రెక్కలనిచ్చింది నువ్వే
సూర్యకోయిల మేల్కొలుపు పల్లవి పాడకముందే
చంటిపిల్లలను ఎడ పిల్లలను వదలి
చెత్తకుండీలాటి ఇంటిని
శుభ్రనదీ ప్రవాహంలా మార్చి
అన్నం డబ్బా పట్టుకొని పనిలోకి వెళ్తే
ఒంటిమీద చెమట కాల్వలు కట్టే వరకు
ఉదయం నుంచి సాయంకాలం వరకు
రెక్కలు ముక్కలు చేసికొనే వ్యవసాయ కూలీని నేనే
నాట్లు వేసినా కలుపుతీసినా
ఒకటికైనా రెండుకైనా వీలులేక
పొద్దుననగా గొంతు తడుపుకొన్న
గుక్కెడు నీళ్లతోనే సరిపుచ్చుకొనే ఒంటెలం మేము
ఆడామగా సమానమంటూ
ఇప్పటికీ చేతిలో పెడతారు ఆడకూలీ
స్త్రీ పురుష సమానత్వం త్రాసు ఎప్పుడూ అటే మొగ్గు చూపిస్తుంది
చెమట సాలభంజికనైనా
కన్నీటి చిత్రాన్నైనా సానుభూతి పవనాల ఉనికి ఎక్కడ
అధికార కుర్చీలకు సింహాసనాలకు
ఆధారమైన కాళ్లము మేమే
రాత్రి నక్షత్రాలు అంతరించక ముందే
వంటలు వడ్డనలు చేసి
సమ్మెల సత్యాగ్రహాల సమిధలం మేమే
పని ప్రదేశాల కర్మాగారాల కార్యాలయాల సగం మేమే
మర్యాదల ముసుగుల మాటున
మేస్త్రీల పులిపంజాలకు చిక్కేది
మా దేహాల ఫలహారాలే
పురుషాహంకారం బలిపీఠంపై వంచిన తలపై
ఏ హింసా ఖడ్గం వేటు వేస్తుందో
క్షణక్షణం అభద్రతా భావాల అరణ్యంలో
సంచరించే అశాంతి హరిణాన్ని
నోరెత్తినపుడల్లా నీకేం తెలుసని దబాయింపు చెంపదెబ్బలు
రాజ్యపాలన ఉచ్చరించగూడని విషయం
ముఫ్పై మూడు శాతం రిజర్వేషను చందమామ
ఎన్ని పున్నములైనా ఉదయించదు
ఎగిరే పక్షికి ఎవరూ పథనిర్ధేశం చెయ్యరు
బుద్ధిజీవులు మానవ జాతిలో మాత్రం
పాలకులొకరు అమలుచేసే వారొకరు
ఎంతకాలమిలా మీ చెప్పుచేతల్లో బందీలు
ఇకపై నిర్ణయాలన్నీ మావే

- మందరపు హైమావతి,
9441062732